అయోధ్య రామ మందిరం నిర్మాణం కోసం ట్రస్టు ఏర్పాటులో మోదీ ప్రభుత్వానికి ఉన్న ఇబ్బందులేంటి?

    • రచయిత, విజయ్ త్రివేది (సీనియర్ జర్నలిస్టు)
    • హోదా, బీబీసీ కోసం

సుదీర్ఘ న్యాయ పోరాటం తర్వాత అయోధ్యలో రామ మందిర నిర్మాణానికి మార్గం సుగమమైంది. చూస్తుంటే... ఇక దీనికి ఎలాంటి అడ్డంకులూ లేవని, త్వరలోనే రామ మందిర నిర్మాణ పనులు మొదలవుతాయనిపిస్తోంది.

మూడు నెలల్లో మందిర నిర్మాణానికి ట్రస్టు ఏర్పాటు చేయాలని తీర్పు వెల్లడించే సమయంలో సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. కానీ, ఇప్పటికే సగం గడువు పూర్తైనా ట్రస్టు సభ్యులను నిర్ణయించడంలో ప్రభుత్వం ఇంకా మల్లగుల్లాలు పడుతోంది.

ట్రస్టు అధ్యక్షుడిని నిర్ణయించడం ప్రభుత్వానికి అంత సులభమైన పని కాదు. ఎందుకంటే, ఈ 'ద్రాక్ష'ను అందుకోవడం కోసం వందలాది మంది ఎదురుచూస్తున్నారు.

మందిర నిర్మాణం, అనంతరం దాని నిర్వహణ ఈ ట్రస్టు బాధ్యత.

ఈ ట్రస్టులో నిర్మోహి అఖాడాను కూడా భాగం చేయాలని సుప్రీంకోర్టు తన తీర్పులో సూచించింది.

ఈ తీర్పు తర్వాత కేంద్ర ప్రభుత్వం ట్రస్టు ఏర్పాటు చర్యలను ప్రారంభించింది. ట్రస్టు ఏర్పాటయ్యే వరకూ ఆ భూమిపై అన్ని హక్కులూ కేంద్ర ప్రభుత్వానివే. ఈ ట్రస్టు ఏర్పాటుకు సంబంధించి ప్రధాని మోదీ, హోం మంత్రి అమిత్ షాలు ఇప్పటికే కొందరితో చర్చలు జరిపారు.

ట్రస్టులో బీజేపీ భాగం కాదు

ఈ అంశంపై నవంబర్ చివర్లో ఉత్తర్‌ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్ వారణాసిలో సంఘ్ సర్కార్యవాహ్ భయ్యాజీ జోషీ, సహ-సర్కార్యవాహ్ డాక్టర్ కృష్ణ గోపాల్‌లతో పాటు ఇతర ప్రాంతీయ నేతలతో సమావేశమై చర్చించారు.

బీజేపీకి ఈ ట్రస్టులో ఎలాంటి పాత్రా లేదని, బీజేపీ నేతలెవరూ ఇందులో భాగంగా ఉండరని అమిత్ షా ఇప్పటికే స్పష్టం చేశారు. ఆర్ఎస్ఎస్ కూడా ఓ సంస్థగా ఈ ట్రస్టులో భాగం కాదు. కానీ సంఘ్ ప్రతినిధులు ఎవరైనా ఈ ట్రస్టులో ఉండొచ్చు.

ట్రస్టు అడ్వైజరీ బోర్డులో ఉండేవారు ఎవరనేది ఇప్పటికే నిర్ణయమైపోయిందని కొందరు చెబుతున్నారు. ఇందులో, ప్రధానమంత్రి, హోంమంత్రి, ఉత్తర్‌ప్రదేశ్ గవర్నర్, ముఖ్యమంత్రి ఉంటారు. కార్యనిర్వాహక సభ్యులపై మాత్రం ఇంకా తుదినిర్ణయం తీసుకోలేదు.

మందిర నిర్మాణ పనుల పర్యవేక్షణకు ట్రస్టులో ఓ ప్రత్యేక కమిటీ ఉంటుంది. ఈ కమిటీలో రామ జన్మభూమి ఉద్యమంతో ఏదో విధంగా సంబంధం ఉన్నవారు కూడా ఉంటారు. సాధువులు, రుషులతో పాటు మేధావులు, న్యాయవాదులు, మాజీ పరిపాలనాధికారులు, మాజీ పోలీసు అధికారులు కూడా ఉంటారు.

ట్రస్ట్ ఛైర్మన్ పదవికి పోటీ

అయోధ్య చట్టం-1993, చాప్టర్-2, సెక్షన్-6 ప్రకారం... కేంద్ర ప్రభుత్వం కోరుకుంటే తన సొంత నిర్ణయం ఆధారంగా మందిర నిర్వహణ బాధ్యతలను ఏదైనా ట్రస్టుకు అప్పగించవచ్చు. ఈ చట్టం పీవీ నరసింహరావు నేతృత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం రూపొందించింది.

సుప్రీం కోర్టు ఆదేశాలతో ఇప్పుడు ఏర్పాటు కాబోయే ట్రస్టే ప్రధానంగా మొదటిది అవుతుంది. ఇది మందిర నిర్మాణానికి ముందే ఏర్పాటవుతుంది.

గతంలో ట్రస్టులన్నీ అప్పటికే నిర్మాణం పూర్తైన మందిరాల నిర్వహణకు ఏర్పాటయ్యాయి. ఈ ట్రస్టు కోసం కేంద్రం పార్లమెంటులో ఓ బిల్లు కూడా ప్రవేశపెట్టొచ్చు.

ట్రస్టు ఏర్పాటులో ఆలస్యానికి ప్రధాన కారణం ఛైర్మన్ పదవికి తగిన వ్యక్తిని ఎంపికచేయడం. ధర్మాచార్యులు, శంకరాచార్యులు, రాజకీయ నాయకులు, సంఘ్ పదాధికారులు.. ఇలా చాలామంది ఈ పదవిని ఆశిస్తున్నారు.

ప్రస్తుతం, రామజన్మభూమి ట్రస్టు అధ్యక్షుడిగా నృత్యగోపాల్ దాస్ ఉన్నారు. మందిర నిర్మాణం, దానికి నిధుల సమీకరణ, పరిపాలన వ్యవహారాలు, పూజాదికాలు, నిర్వహణ బాధ్యత కూడా ట్రస్టుదే.

ట్రస్టులో ఎంతమంది సభ్యులుండాలి, వారి బాధ్యతలు, అధికారాలను నిర్ణయించే పనిలో ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉంది.

ఈ ట్రస్టును కూడా స్వాతంత్ర్యం సాధించిన తర్వాత ఏర్పాటైన సోమ్‌నాథ్ ఆలయ ట్రస్టు లాగే ఏర్పాటుచేస్తారని, కానీ సభ్యుల సంఖ్య మాత్రం ఎక్కువగా ఉంటుందని చెబుతున్నారు.

ట్రస్టు వ్యవహారాల్లో ప్రభుత్వ జోక్యం ఉండదు

సోమ్‌నాథ్ ఆలయ ట్రస్టులో ఎనిమిది మంది సభ్యులుంటారు. వీరిలో మోదీ, అమిత్ షా, అడ్వాణీ, కేశూబాయ్ పటేల్, హర్ష్‌వర్ధన్ నెవతియా, పీకే లాహిరి, జీడీ పార్మర్‌లున్నారు. వీరంతా వ్యక్తిగత హోదాలో ట్రస్టులో భాగస్వాములుగా ఉన్నారు. అంటే ప్రధానిగా, హోంమంత్రిగా కాదు.

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నలుగురిని ట్రస్టు నామినేట్ చేస్తుంది. ఈ ట్రస్టుకు ఛైర్మన్, సెక్రటరీ ఉంటారు. ప్రభుత్వమే వీరిని నియమించినప్పటికీ, ప్రభుత్వం ట్రస్టు వ్యవహారాల్లో జోక్యం చేసుకోదు.

ప్రతి సంవత్సరం సభ్యులంతా తమ అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. ప్రస్తుత సంవత్సరానికి కేశూభాయ్ పటేల్ ట్రస్ట్ అధ్యక్షుడిగా ఉన్నారు. వీళ్లంతా జీవితకాల సభ్యులు. వాళ్లంతట వాళ్లే తమ సభ్యత్వానికి రాజీనామా చేయాలి, లేదంటే ట్రస్టు బోర్డు వారిని తొలగించాలి.

సోమ్‌నాథ్ ట్రస్ట్ మందిరం కోసం నిధులు సేకరిస్తుంది. దీనిపై వచ్చే ఆదాయానికి పన్ను చెల్లించాల్సిన అవసరం లేదు. ట్రస్టు నిర్వహణలో ప్రభాశ్ పఠాన్ ప్రాంతంలో 2000 ఎకరాల భూమి, 60 ఇతర మందిరాలు ఉన్నాయి.

సోమ్‌నాథ్ ఆలయాన్ని చంద్రుడు నిర్మించాడని చెబుతారు. మొదట్లో అది పూర్తిగా బంగారంతో నిర్మితమైందంటారు. 1026 సంవత్సరంలో మొహమ్మద్ ఘజినీ భారత్‌కు వచ్చినప్పుడు ఈ ఆలయంపై దండెత్తి, ధ్వంసం చేసి, సంపదనంతా దోచుకెళ్లాడు.

ఆ తర్వాత మాళవ భోజరాజు, సోలంకి భీమ రాజు ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. తిరిగి 1706లో ఔరంగజేబు కూడా ఈ ఆలయంపై దాడికి దిగాడు.

గాంధీ చెప్పినట్లు.. మందిర నిర్మాణానికి ప్రభుత్వ సొమ్ము ఖర్చు చేయకూడదు

దేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత సోమ్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణంపై చర్చ మొదలైంది. స్వాతంత్య్రానికి ముందు ఈ మందిరం జునాఘడ్ సంస్థానం పరిధిలో ఉండేది. విభజన తర్వాత, ఈ సంస్థానం భారత్‌లో విలీనమైన సమయంలో మందిర నిర్మాణం చర్చకు వచ్చింది.

అప్పుడు సర్దార్ పటేల్, కేఎం మున్షీ వెళ్లి గాంధీజీని కలిసి ఈ విషయంపై చర్చించారు. అప్పుడు గాంధీజీ... "మందిర నిర్మాణం కోసం ప్రభుత్వ ధనం ఖర్చుచెయ్యడానికి వీల్లేదు. ప్రజలు అది కావాలని కోరుకుంటే, వాళ్లే నిధులు సమీకరించి, దాన్ని పునర్నిర్మించుకోవచ్చు" అని చెప్పారు.

అప్పటి ప్రధాని నెహ్రూ సైతం... మందిర నిర్మాణ వ్యవహారాల నుంచి ప్రభుత్వాన్ని దూరంగా ఉంచాలని కోరుకున్నారు. మందిర నిర్మాణంలో ప్రభుత్వం పాలుపంచుకుంటే తనకున్న సెక్యులర్ ముద్ర పాడవుతుందేమో అని నెహ్రూ భావించారు. అన్ని రకాల సంప్రదింపులు, నిరసనలు, మద్దతుతో.. సర్దార్ పటేల్ మందిర నిర్మాణానికి సిద్ధమయ్యారు.

ఇద్దరు దాతలు, ఇద్దరు కేంద్ర మంత్రులు, ఇద్దరు ప్రముఖులు, సౌరాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు ఇద్దరితో ట్రస్టు ఏర్పాటు చేయాలని 1949 జనవరి 23న జామ్‌నగర్‌లో జరిగిన ఓ సమావేశంలో తీర్మానం జరిగింది.

పటేల్, గాంధీల మరణం తర్వాత కేఎం మున్షీ మందిర పునర్నిర్మాణ బాధ్యతలు చేపట్టారు. దీనికోసం ఆయన బొంబాయి పబ్లిక్ ట్రస్ట్-1950 ప్రకారం కొత్త ట్రస్టు ఏర్పాటు చేశారు. ప్రభుత్వాన్ని మందిర వ్యవహారాలకు దూరంగా ఉంచడానికి, మందిర బాగోగులు చూసుకోవడానికి ఆయన దీన్ని ఏర్పాటుచేశారు.

ఈ విధంగా, సోమ్‌నాథ్ ఆలయ పునర్నిర్మాణం ప్రారంభమైంది. 1951 మేలో నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అప్పటి రాష్ట్రపతి డాక్టర్ రాజేంద్ర ప్రసాద్‌ను దీని ప్రారంభోత్సవానికి ఆహ్వానించారు. నెహ్రూకి ఇష్టం లేకపోయినా ఆయన దానికి హాజరయ్యారు.

సోమ్‌నాథ్ మందిరం బాటలోనే అయోధ్య మందిర నిర్మాణం

సోమ్‌నాథ్ మందిర నిర్మాణానికి చేసినట్లు అయోధ్య మందిర నిర్మాణానికి కూడా ఇప్పుడు ఏర్పాటయ్యే ట్రస్టు ప్రజల నుంచి నిధులు సేకరిస్తుంది. దీనికోసం ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా వెచ్చించదు.

ప్రస్తుతం, 67ఎకరాల్లో మందిర నిర్మాణం జరుగుతుంది. కానీ, గతంలో రూపొందించిన మందిరం మోడల్ ప్లాన్‌లో కొన్ని మార్పులు అవసరమని కొందరు భావిస్తున్నారు. ఎన్నో ఏళ్లుగా మందిర నిర్మాణం కోసం ఇటుకలు, ఇతర సామగ్రిని సేకరించడం, శిల్పాలను చెక్కే పనిలో ఉంది రామ్ జన్మభూమి న్యాస్. ఇప్పటికే వీటిలో చాలావరకూ పనులు పూర్తయ్యాయి కూడా.

సంఘ్, విశ్వ హిందూ పరిషత్‌ల పనితీరును చూస్తే, కేవలం భారత్‌ లోనేకాదు, ప్రపంచం మొత్తం నుంచి వీలైనంత ఎక్కువ మందిని మందిర నిర్మాణంలో భాగస్వాముల్ని చేస్తారు. గతంలో శిలాన్యాస్ (ఆలయ శంకుస్థాపన) సందర్భంగా కూడా దేశం నలుమూలల నుంచి రాముడి పేరుతో రాళ్లను తీసుకురావాలని ఈ రెండు సంస్థలూ పిలుపునిచ్చాయి.

1960ల్లో నాగపూర్‌లో డాక్టర్ హెడ్గేవార్ స్మృతి చిహ్నాన్ని నిర్మించడానికి ప్రజల నుంచి నిధులు సేకరించే బాధ్యతను విదర్భ, నాగపూర్ ప్రాంతాలు తీసుకోవడానికి సిద్ధపడినా, అప్పటి సర్‌సంఘ్‌చాలక్ మాధవ్ సదాశివ్ గోల్వాల్కర్.. దేశవ్యాప్తంగా 'ఒక్కో స్వయంసేవకుడు-ఒక్కో రూపాయి' తీసుకురావాలని కోరారు. ఈ పద్ధతిలోనే విరాళాలు సేకరించాలని నిర్ణయించారు.

ఇటీవల, నరేంద్ర మోదీ కూడా సర్దార్ పటేల్ విగ్రహం 'స్టాట్యూ ఆఫ్ యూనిటీ' నిర్మాణానికి దేశం మొత్తం నుంచి లోహాన్ని సేకరించాలని పిలుపునిచ్చారు. దీన్ని బట్టి చూస్తే, అయోధ్యలో రామమందిర నిర్మాణానికి నిధుల సేకరణకు మరో కొత్త ఉద్యమం, కార్యక్రమం త్వరలోనే ప్రారంభమవుతుందని తెలుస్తోంది.

(అభిప్రాయాలు రచయిత వ్యక్తిగతం)

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)