రజినీకాంత్ @69: సినిమాలా? రాజకీయమా? జీవితంలోని కీలక సమయంలో ఏ నిర్ణయం తీసుకుంటారు?

    • రచయిత, మురళీధరన్ కాశీ విశ్వనాథన్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నాలుగు దశాబ్దాలుగా తమిళ సినిమాలో అత్యుత్తమమైన, విజయవంతమైన కళాకారుల్లో ఒకరిగా రజినీకాంత్ తన స్థానాన్ని కాపాడుకుంటున్నారు. అప్పుడప్పుడూ చిన్నచిన్న మార్పులతో తనను తాను కొత్తగా ఆవిష్కరించుకుంటున్నారు. ఆయన విజయవంతమైన కళాకారుడిగానే కొనసాగుతారా? లేక పోటాపోటీ రాజకీయాల్లోకి దూకుతారా?

రజినీకాంత్.. ఇప్పుడు ఏడు పదుల వయసుకు దగ్గరపడ్డారు. ఆసియాలో అత్యధిక పారితోషికం అందుకునే నటుల్లో ఒకరు. 1975 నుంచి మొదలుకుని త్వరలో విడుదల కాబోయే 'దర్బార్' వరకూ.. ఆయన 167 సినిమాల్లో నటించారు.

తమిళ సినిమా రంగాన్ని ఆయన మూడు దశాబ్దాలుగా ఏలుతున్నారు. ఆయన 168వ సినిమా మొదలైనప్పటికీ.. గత కొన్నేళ్లుగా ఆయన నటిస్తున్న సినిమాల సంఖ్య తగ్గింది. ఆయన తన కెరీర్‌ మొదటి 20 సంవత్సరాల్లో 150 సినిమాల్లో నటించారు. కానీ.. ఆ తర్వాతి 24 సంవత్సరాల్లో కేవలం 17 సినిమాల్లో మాత్రమే నటించారు.

రజినీకాంత్ సినీ ప్రస్థానాన్ని మూడు దశలుగా విభజించవచ్చు. 1975-1995 కాలంలో ఆయన తన కెరీర్‌లో అత్యంత చురుకుగా ఉన్నారు. 1990ల నుంచి 2016 వరకూ ఆయన చాలా తక్కువ సినిమాల్లో నటించారు. 2016 తర్వాత ఆయన కెరీర్.. సినిమాలు - రాజకీయాలుగా విభజితమైంది.

అయినప్పటికీ.. 1975-1995 మధ్య కాలం ఆయనకు సినిమాల్లో అత్యంత విజయవంతమైన దశ. తమిళ సినీ రంగంలో మామూలు, నలుపు రంగు చర్మం ఉన్న, నైపుణ్యం గల వ్యక్తులు.. విజయవంతమైన కథానాయకులుగా మారటం చూసిన ఒక శకానికి ప్రతినిధుల్లో రజినీకాంత్ ఒకరు.

1980ల వరకూ వారిలో ఒకరుగా ఉన్నారాయన. ఆ తర్వాత మరే హీరో సాధించలేనంతటి పతాక స్థాయిని అందుకున్నారు. ఆ తర్వాతి పది సంవత్సరాలు.. తన బాక్స్ ఆఫీస్ రికార్డును తాను మాత్రమే బద్దలు కొట్టగలిగేవారు.

అనంతర కాలంలో రజినీకాంత్ తన సినిమాల సంఖ్యను తగ్గించారు. 2010లో 'రోబో' విడుదలైన తర్వాత ఆయన అనారోగ్యం పాలవటంతో పలు సందేహాలు తలెత్తాయి. ఆ సందేహాలన్నిటినీ ఆయన తన సినిమాలతో పటాపంచలు చేశారు. కాలా, రోబో 2.0 వంటి విజయవంతమైన సినిమాలు ఆయనకు కొత్త శక్తిని అందించాయి. ఇప్పుడు ఆయన రాబోయే సినిమా 'దర్బార్'తో పాటు.. వచ్చే ఏడాది నిర్మించబోయే డైరెక్టర్ శివ సినిమా కోసం చాలా ఉత్సాహంగా పనిచేస్తున్నారు.

దక్షిణాది సినీ పరిశ్రమలో బాక్స్ ఆఫీస్ వసూళ్లలో అగ్రస్థాయి నటుడిగా రజినీకాంత్ ఇంకా కొనసాగుతూనే ఉన్నారు. అయితే.. మున్ముందు ఇటువంటి సినిమాలు ఇంకా ఎన్నిటిలో ఆయన నటిస్తారు? అనేది ఇప్పుడు ప్రధాన ప్రశ్న.

2021లో జరిగే తమిళనాడు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలుగా తన పార్టీని భవిష్యత్తులో ప్రారంభిస్తానని రజినీ ప్రకటించారు.

తమిళ సినీ రంగంలో మరో ఇద్దరు పెద్ద నటులు విజయ్‌కాంత్, కమల్ హాసన్‌లు కూడా వేర్వేరు సమయాల్లో పార్టీలను ప్రారంభించారు. ఇటీవలి లోక్‌సభ ఎన్నికలకు 14 నెలల ముందు కమల్ హాసన్ తన 'మక్కల్ నీతి మయీం' పార్టీని ప్రారంభించారు. కానీ రజినీ తన పార్టీని ఎప్పుడు ప్రారంభిస్తారనేది ఎవరికీ తెలియదు.

రజినీ రాజకీయాల్లోకి వచ్చినా కూడా సినిమాల్లో కొనసాగితే.. రజినీ అభిమానులు, సినిమా అభిమానులు ఇద్దరూ చాలా సంతోషిస్తారు.

''తమిళ సినిమా రంగంలో అత్యంత ప్రతిభ ఉన్న నటుల్లో రజినీకాంత్ ఒకరు. ఆయన తన హావభావాల ద్వారా చాలా భావోద్వేగాలను వ్యక్తంచేయగలరు. తమిళ సినిమా ఆయనను పూర్తిగా ఉపయోగించుకోలేదని నేను అంటాను. తమిళ సినిమా రంగంలో అత్యుత్తముల్లో ఒకరిగా ఆయనను గుర్తించి ఉండాల్సింది. కానీ.. ఆయన శైలి, కరిజ్మా ఆ స్థానాలను ఆక్రమించుకుంది. చాలా మంది దర్శకులు ఆయనను కేవలం ఆయనకు గల 'సూపర్ స్టార్' ఇమేజ్ కోసమే ఉపయోగించుకోవాలని భావిస్తారు. ఆయన తన నటనా నైపుణ్యాలు అవసరమయ్యే సినిమాలను మరింత ఎక్కువగా ఎంపిక చేసుకోవటానికి ప్రయత్నించాలి'' అంటారు పార్లమెంటు సభ్యుడు రవికుమార్.

కానీ.. కొంతమంది మాత్రం ఆయన సినీ ప్రస్థానం ముగిసిపోయిందని భావిస్తారు. ''సినిమా వ్యాపారానికి ఒక కిటుకు ఉంది. ఒక పెద్ద సినిమా విడుదలైనపుడు.. దానిని ఒకేసారి వందలాది తెరల మీద ప్రదర్శిస్తారు. అందువల్ల అత్యధిక స్థాయిలో బాక్స్ ఆఫీస్ వసూళ్లను అందుకుంటారు. రజినీకాంత్ కూడా ఈ ట్రెండ్‌లో ఉన్నప్పటికీ.. ఈ క్రమాన్ని ఇక ఆయన తట్టుకునే పరిస్థితి లేదు'' అని విశ్లేషకుడు రాజన్‌కురై అభిప్రాయపడ్డారు.

''ఈ తరహా వ్యూహం కోసం ఆయనకు మరింత మంది అభిమానులు అవసరమవుతారు. ఆయన అభిమానులు మధ్య వయసు జనం. విజయ్ లేదా అజిత్ అభిమానులు వచ్చినట్లుగా ఆయన అభిమానులు థియేటర్ల దగ్గరకు రారు'' అని ఆయన వ్యాఖ్యానించారు.

''సినీ రంగానికి రజినీ చాలా మందిని తీసుకొచ్చారు. చాలా పనులు చేశారు. కానీ.. సినిమా అనే కళ కోసం ఆయన ఏం చేశారనేది ఆయన ఇంకా ఆలోచించుకోవాల్సి ఉంది. ఆయన తనకు తాను ఈ ప్రశ్న వేసుకోవాలి. ఈ ప్రశ్నకు సమాధానం ఇవ్వకుండా ఆయన అన్యమనస్కంగానే ఉంటారు'' అని ఎంపీ రవిశంకర్ పేర్కొన్నారు.

రాజకీయాల్లోనూ రజినీకాంత్ ఇదే విజయాన్ని సాధించగలరా?

''ఎంతో మంది అభిమానులను ఆకర్షించిన, వారికి స్ఫూర్తినిచ్చిన కళాకారుల్లో రజినీకాంత్ ఒకరు. ఆయన 'కీర్తి'ని రాజకీయాల్లో వాడుకోవటానికి గత 25 సంవత్సరాలుగా వేర్వేరు నాయకులు, వివిధ పార్టీలు చాలా ప్రయత్నాలు చేశాయి కానీ ఫలించలేదు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశిస్తే విజయవంతమైన రాజకీయవేత్త అవుతారని మనం చెప్పలేం. అందుకు లోతైన రాజకీయ కారణం ఉంది. ఎంజీఆర్‌కు ఉన్నట్లుగా రజినీకి తమిళనాడు ప్రజల్లో మెజారిటీ మద్దతు లేదు. విజయ్‌కాంత్ తరహాలోనూ ఆయన పనిచేయలేదు. రజినీకాంత్ ఎప్పుడూ సాధారణ జనంతో కలవరు. అధికారంలో ఉన్న వారితో, శక్తిమంతులతో ఆయన కలుస్తారు. ఆ తరహా అవగాహనతో ఆయన తమిళనాడు రాజకీయాల్లో ఏమీ చేయలేరు'' అని మద్రాస్ యూనివర్సిటీలో రాజనీతిశాస్త్ర ప్రొఫెసర్ రాము మణివణ్నన్ వ్యాఖ్యానించారు.

''అందలం, అధికారం ఉన్న వారికి ఆయన సన్నిహితుడు. మరోవైపు.. ఆయన సినిమాలు సామాన్యుడిని చేరటంలో విజయం సాధించాయి. ఈ రెండిటి మధ్య ఎలాంటి వారధీ లేదు. ఇప్పుడు రాజకీయాల్లో విజయం సాధించాలంటే ఆయన కష్టపడి పనిచేయాల్సి ఉంటుంది. అది ఆయన చేయలేరు. దీనికి ఆయన వయసుతో కానీ ఆరోగ్యంతో కానీ సంబంధం లేదు. అందులో ఆయనకు ఆసక్తి లేదు.. అంతే'' అని ఆయన విశ్లేషించారు.

మరైతే.. రజినీకాంత్ కేవలం సినిమాలకే పరిమితమైతే ఆయన అభిమానులు అలాగే కొనసాగుతారా?

''కొనసాగవచ్చు. ఆయన రాజకీయాల్లోకి ప్రవేశించినపుడు.. ప్రజల సమస్యలను ఎదుర్కోవటానికి ప్రయత్నం చేసేటపుడు చెప్పబోయే మాటలు.. రాజకీయాల్లోనూ, సినిమాల్లోనూ ఆయన భవిష్యత్తును నిర్ణయిస్తాయి'' అంటారు రాము మణివణ్నన్.

ఈ సంవత్సరం రజినీకాంత్‌కి చాలా కీలకమైన సమయం అవుతుంది. ఆయన చాలా ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆయన ఎంతో ప్రతిభ కనబరిచే, ఆయనకు ప్రఖ్యాతిని అందించిన సినిమాల్లోనే ఉంటారా? లేకపోతే రాజకీయాల్లోకి ప్రవేశించి దాని లోతు తెలుసుకునే ప్రయత్నం చేస్తారా? అనేది రజినీకాంత్ నిర్ణయించుకోవాల్సి ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)