హైదరాబాద్ ఎన్‌కౌంటర్: మహబూబ్ నగర్‌ ప్రభుత్వాసుపత్రికి చేరుకున్న ఎన్‌హెచ్‌ఆర్సీ సభ్యులు

దిశ కేసు నిందితుల ఎన్‌కౌంటర్‌పై జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్‌హెచ్‌ఆర్సీ) విచారణ చేపట్టింది.

కమిషన్ సభ్యులు కొద్దిసేపటి క్రితం దిల్లీ నుంచి శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని అక్కడ నుంచి నేరుగా మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లారు. ఇక్కడ పరిశీలన అనంతరం ఎన్‌కౌంటర్ జరిగిన చటాన్ పల్లి ప్రాంతానికి వెళ్లి పరిశీలించిన అనంతరం నివేదిక అందించనున్నారు.

ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన నలుగురి మృతదేహాలను మహబూబ్‌నగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో భద్రపరచాలని శుక్రవారం రాత్రి తెలంగాణ హైకోర్టు ఆదేశించిన విషయం తెలిసిందే.

ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్

శుక్రవారం జరిగిన ఎన్‌కౌంటర్‌పై సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలైంది. న్యాయవాదులు జీఎస్ మణి, ప్రదీప్ కుమార్ యాదవ్‌లు ఈ ఘటనపై విచారణ చేపట్టాలని సుప్రీం కోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు.

ఎన్‌కౌంటర్ చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని కోరారు. అత్యున్నత న్యాయస్థానం 2014లో ఇచ్చిన మార్గదర్శకాలను పోలీసులు అనుసరించలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు.

ఎన్‌కౌంటర్‌పై కేసు నమోదు

ఎన్‌కౌంటర్ జరిగిన ప్రాంతంలో తనిఖీలు జరిపిన క్లూస్‌ టీం అక్కడ కొన్ని బుల్లెట్లు స్వాధీనం చేసుకుంది. ఈ ఘటనపై షాద్‌నగర్‌ ఏసీపీ సురేందర్‌ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఆయన దిశ హత్య కేసు విచారణ అధికారిగా ఉన్నారు.

మరోవైవు, నిన్న జరిగిన ఎన్‌కౌంటర్‌పై చర్చించేందుకు సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో పౌర హక్కుల కార్యకర్తలు రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు.

సంబరాలు చూసి నిరుత్సాహపడ్డా - గుత్తా జ్వాల

నిన్న ప్రజలు సంబరాలు చేసుకోవడం చూసి చాలా నిరుత్సాహానికి గురయ్యాను. నాకు నిద్ర పట్టలేదు. కానీ, నాలాగే చాలామంది తమ ఆందోళన వ్యక్తం చేయడంతో నాకు కొద్దిగా ఉపశమనం కలిగింది. మనమంతా ఐక్యంగా ఉండాలని, రాజ్యాంగంపైనా, న్యాయవ్యవస్థపైనా విశ్వాసాన్ని కోల్పోకూడదని నేను కోరుకుంటున్నా అని క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)