You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఉన్నావ్ అత్యాచారం: ఆసుపత్రిలో చికిత్స పొందుతూ బాధితురాలి మృతి
ఉన్నావ్ అత్యాచార కేసు బాధితురాలు దిల్లీలోని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం రాత్రి ప్రాణాలు విడిచారు. తీవ్రమైన కాలిన గాయాలతో గురువారం ఆమె సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో చేరారు.
గురువారం ఉదయం ఆమెను సజీవ దహనం చేసేందుకు కొందరు దుండగులు ప్రయత్నించినట్లు ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తెలిపారు. అత్యాచార కేసుకు సంబంధించి కోర్టు విచారణకు వెళ్తున్న సమయంలోనే ఆమెపై ఈ దాడి జరిగినట్లు వెల్లడించారు.
శుక్రవారం రాత్రి 11.40కి బాధితురాలు మరణించారని సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలోని బర్న్ అండ్ ప్లాస్టిక్ డిపార్ట్‌మెంట్ హెడ్ శలభ్ కుమార్ తెలిపారు.
''ఆమెకు రాత్రి 11.10కి గుండెపోటు వచ్చింది. ఆమెను కాపాడేందుకు తీవ్రంగా ప్రయత్నించాం. కానీ, సాధ్యం కాలేదు'' అని ఆయన అన్నారు.
బాధితురాలు మొదట లఖ్‌నవూలోని ఓ ఆసుపత్రిలో చేరారు. మెరుగైన చికిత్స కోసం ఎయిర్ అంబులెన్స్‌లో ఆమెను దిల్లీకి తరలించారు.
బాధితురాలి శరీరం 90 శాతం వరకూ కాలిపోయిందని, ఆసుపత్రిలో చేరినప్పటి నుంచి ఆమె పరిస్థితి చాలా విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.
ఆమెపై దాడి చేసి, నిప్పంటించిన కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు.
పోలీసులు ఏం చెప్పారంటే?
గురువారం కోర్టు విచారణకు వెళ్తున్న సమయంలో బాధితురాలిని నిందితులు చుట్టుముట్టి, నిప్పు అంటించారని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు తెలిపారు.
ఈ కేసుకు సంబంధించి ఐదుగురు నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వీరిలో నలుగురిని గురువారమే పోలీసులు అరెస్టు చేశారు. మరొకరిని శుక్రవారం అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.
బాధితురాలు గత మార్చిలో ఇద్దరు వ్యక్తులపై అత్యాచార కేసు పెట్టినట్లు ఉన్నావ్ ఎస్పీ విక్రాంత్ వీర్ మీడియాకు చెప్పారు.
ఆ అత్యాచార కేసు నిందితుడు కూడా ఇప్పుడు అదుపులోకి తీసుకున్న ఐదుగురిలో ఉన్నట్లు ఐజీ ఎస్‌కే భగత్ తెలిపారు.
''అతడు జైలుకు వెళ్లి, కొన్ని రోజుల క్రితమే బెయిల్‌పై తిరిగొచ్చాడు. తమకు ముప్పు ఉందని బాధితురాలి కుటుంబం మాకేమీ చెప్పలేదు. మిగతా విషయాలు విచారణలో తెలుస్తాయి'' అని అన్నారు.
‘మరణ శిక్ష వేయాలి’
న్యాయం కోసం తమ పోరాటం కొనసాగిస్తామని, దోషులకు మరణ శిక్ష పడాలని కోరుకుంటున్నామని బాధితురాలి సోదరి బీబీసీతో అన్నారు.
‘‘నా సోదరిపై అత్యాచారానికి పాల్పడినవాళ్లకు మరణ శిక్ష వేయాలని కోరుకుంటున్నా. వాళ్లకు వ్యతిరేకంగా, న్యాయం కోసం కోర్టులో మా పోరాటం కొనసాగిస్తాం’’ అని అన్నారు.
నిందితుడు జైలు నుంచి బయటకు వచ్చాక, తమపై నిత్యం బెదిరింపులకు దిగుతూనే ఉన్నాడని బాధితురాలి తండ్రి అన్నారు. ఇదివరకూ దాడులు చేసేందుకు ప్రయత్నించాడని చెప్పారు.
కనీసం ఓ పన్నెండు సార్లైనా వాళ్లు కేసు వాపసు తీసుకోమని తమను బెదిరించారని, తమ ఇంటిపై దాడి చేసేందుకు ప్రయత్నించారని అన్నారు.
గత మార్చిలో బాధితురాలిపై సామూహిక అత్యాచారం జరిగిందని, ఆ కేసుకు సంబంధించిన వ్యవహారాల కోసం ఆమె గురువారం రాయ్‌బరేలీకి వెళ్లే ప్రయత్నంలో ఉన్నారని స్థానిక పాత్రికేయుడు విశాల్ సింగ్ బీబీసీతో చెప్పారు.
రైల్వే స్టేషన్‌కు వెళ్లే దారిలో బాధితురాలిపై నిందితులు దాడి చేశారని ఆయన అన్నారు.
ఈ ఘటన గురించి మీడియాలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. ఉత్తర్‌ప్రదేశ్ ప్రభుత్వం స్పందించింది.
బాధితురాలి చికిత్సకు అయ్యే మొత్తం ఖర్చును ప్రభుత్వమే భరిస్తుందని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
మరో అత్యాచార కేసుతో ఉన్నావ్ ఇదివరకే వార్తల్లో నిలిచింది. ఆ కేసులో బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగర్ నిందితుడిగా ఉన్నారు.
ఇవి కూడా చదవండి:
- నాడు మూడు అడుగుల లోతులో పాతిపెడితే సజీవంగా బయటపడిన పసిపాప ఆరోగ్యం ఇప్పుడు భేష్
- అత్యాచార కేసు విచారణకు వెళ్తున్న బాధితురాలికి నిప్పు పెట్టిన దుండగులు... మృత్యువుతో పోరాడుతున్న యూపీ మహిళ
- పది రోజులు... 3,000 కిలోమీటర్ల ప్రయాణం: యెమెన్ నుంచి తప్పించుకుని సముద్ర మార్గంలో భారత్‌కు
- ‘నిర్భయ’లపై మళ్లీ మళ్లీ అత్యాచారం
- దిశ అత్యాచారం, హత్య: సోషల్ మీడియాలో అభ్యంతరకర పోస్టులు... నలుగురు అరెస్ట్
- సజ్జనార్: అప్పుడు, ఇప్పుడు ఈయనే...
- సజ్జనార్ ప్రెస్ మీట్: 'చట్టం తన పని తాను చేసింది'
- జీరో ఎఫ్ఐఆర్ అంటే ఏమిటి? దానివల్ల ఉపయోగం ఉంటుందా?
- భారత్‌లో అత్యాచార ఘటనల వెనకున్న కారణాలేంటి?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)