వాతావరణ మార్పుతో పక్షులు కుంచించుకుపోతున్నాయి: అధ్యయనంలో వెల్లడి

    • రచయిత, కెల్సీ వ్లామిస్
    • హోదా, బీబీసీ న్యూస్

వాతావరణం వేడెక్కుతుండటంతో పక్షులు కుంచించుకుపోతున్నాయని, వాటి రెక్కల నిడివి పెరుగుతోందని సరికొత్త అధ్యయనంలో గుర్తించారు.

పరిశోధకులు.. గత 40 సంవత్సరాల్లో సేకరించిన 52 జాతుల ఉత్తర అమెరికా వలస పక్షుల నమూనాలను విశ్లేషించారు.

ఈ పక్షులు ఇలినాయీ రాష్ట్రంలోని చికాగోలో భవనాలను ఢీకొని చనిపోయాయి.

ఈ అధ్యయనం ఈ తరహాలో అతి పెద్దదని.. ఇందులో గుర్తించిన విషయాలు వాతావరణ మార్పుకు జంతువులు ఎలా రూపాంతరం చెందుతాయనేది అర్థం చేసుకోవటానికి చాలా ముఖ్యమని పరిశోధకులు చెప్తున్నారు.

''దాదాపు అన్ని జాతులూ చిన్నవిగా మారుతున్నాయని మేం గుర్తించాం'' అని యూనివర్సిటీ ఆఫ్ మిచిగన్‌లో స్కూల్ ఆఫ్ ఎన్విరాన్‌మెంట్ అండ్ సస్టెయినబిలిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్ బ్రియాన్ వీక్స్ తెలిపారు.

''ఇందులో చాలా భిన్నమైన జాతులు ఉన్నాయి.. కానీ అన్నీ ఒకే విధంగా ప్రతిస్పందిస్తున్నాయి. ఈ క్రమబద్ధత దిగ్భ్రాంతికరంగా ఉంది'' అని ఆయన పేర్కొన్నారు.

వాతావరణ మార్పు విషయంలో జంతువుల ప్రతిస్పందనల మీద అధ్యయనాలు ప్రధానంగా భౌగోళిక ప్రాంతాల్లో మార్పు లేదా వలస, ప్రజననం వంటి జీవన ఘటనల సమయంలో మార్పుల మీద దృష్టి కేంద్రీకరిస్తుంటాయని ఆయన చెప్పారు. కానీ ఈ అధ్యయనం.. శరీర నిర్మాణం అనేది మూడో కీలక కోణంగా చూపుతోంది.

''అది ఒక ప్రధాన ప్రభావం. ఈ మూడు అంశాలనూ పరిగణనలోకి తీసుకోకుండా.. జంతువులు ఎలా పరివర్తనం చెందుతాయనేది అర్థం చేసుకోవటం కష్టం'' అంటారు ప్రొఫెసర్ బ్రియాన్.

ఈ పక్షుల దిగువ కాలి ఎముక నిడివి - శరీర నిడివిని కొలిచే సాధారణ కొలత - 1978 నుంచి 2016 మధ్య 2.4 శాతం మేర తగ్గిపోయిందని ఈ అధ్యయనం చెప్తోంది. అదే కాలంలో వీటి రెక్కల నిడివి 1.3 శాతం మేర పెరిగింది.

ఈ పక్షుల శరీర పరిమాణం తగ్గటానికి, వీటి రెక్కల పొడవు పెరగటానికి కారణం.. వేడెక్కుతున్న ఉష్ణోగ్రతలని ఆధారాలు సూచిస్తున్నాయి.

''ఈ పక్షులు వలస పోవటం అత్యంత శ్రమతో కూడుకున్న పని. శరీరం ఎంత చిన్నదిగా ఉంటే.. ఈ పక్షులు తమ సుదీర్ఘ ప్రయాణాలను పూర్తి చేయటానికి అందుబాటులో ఉండే శక్తి కూడా అంత తక్కువగా ఉంటుంది'' అని ప్రొఫెసర్ బ్రియాన్ వివరించారు.

అయితే.. శరీర పరిమాణం చిన్నదిగా ఉన్న పక్షులకు ఆ లోటు మరింత పెద్ద రెక్కలతో భర్తీ అయినట్లయితే ఆ పక్షులు ఈ వలస ప్రయాణాన్ని విజయవంతంగా పూర్తిచేయగలవని ఆయన అంటారు.

ఈ పక్షులు కుంచించుకుపోవటానికి వేడి ఉష్ణోగ్రతలు ఎందుకు కారణమవుతున్నాయనే అంశం మీద శాస్త్రవేత్తలు ఖచ్చితంగా ఒక నిర్ధారణకు రాలేదు. జంతువులు ఎంత చిన్నవిగా ఉంటే అవి చల్లబడటం, శరీర ఉష్ణోగ్రతను మరింత వేగంగా తగ్గించుకోవటం అంత ఎక్కువగా ఉంటుందని ఒక సూత్రీకరణ.

ఈ అధ్యయన సహ పరిశోధకుడు, చికాగోలోని ఫీల్డ్ మ్యూజియంలో పక్షిశాస్త్రవేత్త డేవ్ విలార్డ్ 'భగీరథ ప్రయత్నం' వల్ల ఇంత పెద్ద మొత్తంలో పక్షి నమూనాలు లభ్యమయ్యాయని ప్రొఫెసర్ బ్రియాన్ తెలిపారు.

డేవ్ విలార్డ్.. 1978 వసంత కాలం, శరత్కాలాలలో ఉదయం పూట భవనాల చుట్టూ నడుస్తూ.. ఆయా భవనాలను ఢీకొని పడిపోయిన పక్షులను సేకరించటం ప్రారంభించారు.

పక్షులు సాధారణంగా రాత్రిపూట వలస పోతాయి. భవనాల నుంచి వెలువడే కృత్రిమ వెలుతురుకు ఆకర్షితమవుతుంటాయి. దానివల్ల కిటికీలను ఢీకొని నేలరాలి చనిపోతుంటాయి. ఇలా భవనాలను ఢీకొని ప్రతి ఏటా కోట్లాది పక్షులు చనిపోతున్నాయని అంచనా.

''అప్పుడు ఈ అధ్యయనం ఆయన ఆలోచనలో లేదు. భవిష్యత్తులో ఈ సేకరణ ఉపయోగపడవచ్చని మాత్రమే ఆయన అనుకున్నారు'' అని ప్రొఫెసర్ బ్రియాన్ పేర్కొన్నారు.

అనంతర కాలంలో ఈ సేకరణ కృషికి చాలా మంది స్వచ్ఛంద కార్యకర్తలు, శాస్త్రవేత్తలు సాయం చేశారు.

డేవ్ విలార్డ్ స్వయంగా 70,716 పక్షుల నమూనాలను ఒకే పద్ధతిని ఉపయోగించి కొలిచారు. ఈ తరహా సమాచారానికి 'అత్యుత్తమ ప్రమాణం' అంటారు ప్రొఫెసర్ బ్రియాన్.

ఈ అధ్యయన పత్రాన్ని ఎకాలజీ లెటర్స్ జర్నల్‌లో ప్రచురించారు.

వాతావరణం వేడెక్కుతున్న కొద్దీ జంతువులు కుంచించుకుపోతున్నాయని చెప్తున్న ఆధారాలను ఇది బలపరుస్తోంది.

ఉష్ణోగ్రతలు పెరుగుతుండటం వల్ల ఆల్పైన్ మేకలు కుంచించుకుపోతున్నట్లు కనిపిస్తోందని శాస్త్రవేత్తలు 2014లో గుర్తించారు.

అదే ఏడాది నిర్వహించిన మరొక అధ్యయనంలో.. వాతావరణ మార్పు వల్ల సాలమాండర్లు (నలికండ్ల పాములు) వేగంగా కుంచించుకుపోయాయని కనిపెట్టారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)