You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర సీఎంగా ఉద్ధవ్ ఠాక్రే ప్రమాణం రేపు సాయంత్రం... ఎన్‌సీపీలోనే కొనసాగుతానన్న అజిత్ పవార్
మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా శివసేన అధినేత ఉద్ధవ్ ఠాక్రే గురువారం సాయంత్రం ఆరున్నరకు ముంబయిలోని శివాజీ పార్కులో ప్రమాణం చేయనున్నారు.
బుధవారం ఆయన మహారాష్ట్ర గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీను కలిశారు.
మెజారిటీ ఎమ్మెల్యేల మద్దతు ఉందని తెలిపే లేఖను డిసెంబరు 3లోగా తనకు అందజేయాలని ఉద్ధవ్ ఠాక్రేకు గవర్నర్ ఇంతకుముందు స్పష్టం చేశారు.
మంగళవారం శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ముంబయిలో సమావేశమై, ఉద్ధవ్ ఠాక్రేను తమ కూటమి నేతగా ఎన్నుకున్నారు. కూటమికి ఉద్ధవ్ బాలాసాహెబ్ ఠాక్రే ముఖ్యమంత్రిగా నేతృత్వం వహించాలని కోరుకుంటున్నామపి సమావేశం అనంతరం ఎన్‌సీపీ మహారాష్ట్ర అధ్యక్షుడు జయంత్ పాటిల్ తెలిపారని ఏఎన్ఐ వార్తాసంస్థ చెప్పింది.
ఉపముఖ్యమంత్రి ఎవరనేదానిపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని కాంగ్రెస్ మహారాష్ట్ర అధ్యక్షుడు బాలాసాహెబ్ థొరాట్ బుధవారం చెప్పారని ఏఎన్‌ఐ పేర్కొంది.
సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్న శివసేన, ఎన్‌సీపీ, కాంగ్రెస్ మధ్య మంత్రి పదవుల పంపకం ఓ రెండ్రోజుల్లో ఖరారవుతుందని థొరాట్ తెలిపారు.
మంత్రుల ప్రమాణ స్వీకారం తర్వాత ఉంటుందని జయంత్ పాటిల్ చెప్పారు.
దేవేంద్ర ఫడణవీస్(బీజేపీ) నాయకత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు మద్దతు పలికిన ఎన్‌సీపీ సీనియర్ నేత అజిత్ పవార్, తాను ఎన్‌సీపీలోనే ఉన్నానని, పార్టీలోనే కొనసాగుతానిన చెప్పినట్లు పీటీఐ తెలిపింది. తమ నాయకుడు శరద్ పవార్‌ను కలిశానని ఆయన చెప్పారు.
తాజా పరిణామాల నేపథ్యంలో శివసేన సీనియర్ నాయకుడు సంజయ్ రౌత్ మాట్లాడుతూ- మహారాష్ట్ర ఎన్నటికీ తలవంచదని వ్యాఖ్యానించారు.
మరోవైపు బుధవారం బీజేపీ నేత, ప్రొటెం స్పీకర్ కాళీదాస్ కోలంబ్‌కర్ శాసనసభలో ఎమ్మెల్యేలతో ప్రమాణం చేయిస్తున్నారు. అజిత్ పవార్, ఛగన్ భుజ్‌బల్, ఆదిత్య ఠాక్రే, ఇతర ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం చేశారు.
శాసనసభలో మొత్తం 288 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 145 మంది సభ్యుల బలం కావాలి.
అసెంబ్లీలో ప్రధాన పార్టీల సంఖ్యాబలం ఇదీ
బీజేపీ - 105
శివసేన - 56
ఎన్‌సీపీ - 54
కాంగ్రెస్ - 44
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)