అయోధ్య తీర్పు: కోర్టు ద్వారానే రామ మందిరం నిర్మించాలనుకుంటే ఉద్యమం ఎందుకు: ప్రవీణ్ తొగాడియా

    • రచయిత, భార్గవ్ పారిఖ్
    • హోదా, బీబీసీ కోసం

అయోధ్యలోని రామ జన్మభూమి, బాబ్రీ మసీదు భూమి గురించి దశాబ్దాల పాటు నడిచిన కేసులో సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగోయ్ శనివారం తీర్పు ఇచ్చారు.

దీని ప్రకారం బాబ్రీ మసీదు ఉన్న వివాదాస్పద భూమి ఇప్పుడు హిందూ పక్షాలకు లభిస్తుంది. దానితోపాటూ సున్నీ వక్ఫ్ బోర్డుకు మసీదు నిర్మించుకోడానికి ఐదు ఎకరాల భూమిని కూడా ఇస్తారు.

దశాబ్దాల పురాతన కేసులో 40 రోజులపాటు జరిగిన విచారణ తర్వాత శనివారం ఐదుగురు జడ్జిల రాజ్యాంగ ధర్మాసనం ఏకగ్రీవంగా తీర్పు ఇచ్చింది.

భారత్‌లోని ఎన్నో రాజకీయ పార్టీలు ఈ తీర్పును స్వాగతించాయి. అందరూ శాంతి, సోదరభావంతో ఉండాలని పిలుపునిచ్చాయి.

450 ఏళ్ల పోరాటం ఫలించింది

విశ్వ హిందూ పరిషత్ రెండో నేత ప్రవీణ్ తొగాడియా రామమందిర ఉద్యమ సమయంలో చాలా చురుగ్గా ఉండేవారు. అశోక్ సింఘాల్ తర్వాత విశ్వ హిందూ పరిషత్ బాధ్యతలు ఆయనే అందుకున్నారు. అయితే ఇటీవల వీహెచ్‌పీ నుంచి విడిపోయిన తొగాడియా అంతర్జాతీయ హిందూ పరిషత్ అనే పేరుతో ఓ సంస్థ ఏర్పాటు చేశారు.

అయోధ్య కేసులో తీర్పు వచ్చిన తర్వాత బీబీసీ ప్రవీణ్ తొగాడియాతో మాట్లాడింది.

సుప్రీంకోర్టు తీర్పుపై ఆయన ఏమన్నారో, ఎలాంటి అభిప్రాయాలు వ్యక్తం చేశారో ఆయన మాటల్లోనే..

హిందువుల కోసం 'గొప్ప ఆలయం' అనే 450 ఏళ్ల పోరాటం ఈరోజు సార్థకమైంది. నాలుగున్నరేళ్లలో నాలుగు లక్షల మంది త్యాగాలు చేశారు. తమ కుటుంబాలు, కెరీర్ వదులుకుని వచ్చిన లక్షల మంది కరసేవకులు, రామ భక్తుల త్యాగాలు ఈరోజు ఫలించాయి. అత్యున్నత న్యాయస్థానం తీర్పును నేను స్వాగతిస్తున్నాను.

కేంద్ర ప్రభుత్వం ట్రస్ట్ ఏర్పాటు చేయాలి. ట్రస్ట్ ఏర్పాటు సమయంలో రామ మందిరం నిర్మాణం కోసం ప్రాణాలు, కుటుంబాలు, కెరీర్ కూడా వదులుకుని వచ్చిన వారి జ్ఞాపకాలను ఆ మందిరంతో జోడించాలని నేను వారిని కోరుతున్నాను. అలా చేసినప్పుడు, హిందువుల ఈ మహత్తర పోరాటం రాబోవు తరాలకు గుర్తుండిపోతుంది.

ఉద్యమం అవసరం ఏముంది?

ఈ ఉద్యమంలో ఇంతమంది ఎందుకు మరణించారా అని నాకు ఈరోజు చాలా బాధగా ఉంది. ఒకే తల్లి ఇద్దరు కొడుకులు, కొఠారీ సోదరులు గోధ్రా రైల్వే స్టేషన్లో చనిపోయిన 59 మందిలో ఉన్నారు. ఎందుకంటే వారు ఉద్యమం చేశారు. కోర్టు ద్వారానే రామ మందిరం నిర్మించాలని అనుకుంటే, మంచి వకీలును పెట్టుకుంటే సరిపోయేది. ఈ ఉద్యమం ఎందుకు? ఎందుకంటే, 1984 నుంచి ఆరెస్సెస్-బీజేపీ.. "ఇది కాంగ్రెస్ ప్రభుత్వం" అని చెబుతూ వచ్చాయి. "మనం సోమ్‌నాథ్ లాగే పార్లమెంటులో చట్టం చేసి, రామ మందిరం నిర్మించాలి. కాంగ్రెస్ ప్రభుత్వం మందిరం నిర్మించదు, ఉద్యమం చేయండి, ఆ ప్రభుత్వాన్ని గద్దె దించండి, మా ప్రభుత్వం తీసుకురండి" అని చెప్పాయి.

"రాముడిపై ప్రమాణం చేసేవారే మందిరం నిర్మిస్తారు" అని చెప్పిన లాల్‌కృష్ణ అడ్వాణీ సోమనాథ్ నుంచి అయోధ్య వరకూ రథయాత్ర ప్రారంభించారు. రామ మందిరం నిర్మించాలి, దానిని ఎలా నిర్మించాలి అనే దానికే ఉద్యమం చేశాం, బీజేపీ ప్రభుత్వం వస్తే, పార్లమెంటులో చట్టం చేసి రామ మందిరం నిర్మిస్తాం అన్నారు. 2014లో పూర్తి మెజారిటీ ఉన్న ప్రభుత్వం వచ్చింది. అప్పుడు, ట్రిపుల్ తలాక్ చట్టం చేశారు. కానీ రామ మందిరం చట్టం కాలేదు. రామ మందిరాన్ని సుప్రీం కోర్టు తీర్పుతో నిర్మిస్తున్నారు.

రామ మందిరం పేరుతో, అధికారం కోసం ఎంతోమంది బిడ్డల ప్రాణాలు తీశారు అని నా మనసులో కూడా బాధ ఉంది. అలా అది జరిగిందంటే అది పాపమే. దేవుడు ఆ పాపాలకు శిక్ష వేస్తాడు.

1992 డిసెంబర్ 6

డిసెంబర్ ఆరున బాబ్రీ నిర్మాణం కూలింది. బాబ్రీ నిర్మాణం కూలకపోయుంటే ఈరోజు రామ మందిరం కట్టాలనేవారా? రామ మందిరం కోసం బాబ్రీ నిర్మాణాన్ని కూల్చాల్సిందే. కానీ బాబ్రీ నిర్మాణం ఎప్పటివరకూ ఉంటుందో, అప్పటివరకూ దాన్ని చూపించి ఓట్లు రాబట్టవచ్చని, అది కూలితే ఓట్లు రావని కొందరు అనుకున్నారు.

వారు బాబ్రీ నిర్మాణాన్ని ముస్లింల కోసం కాపాడాలని అనుకోలేదు, ఓట్ల కోసమే దానిని అలా ఉంచారు. కానీ డిసెంబర్ 6 ఉదయం లక్షలాది కరసేవకులు బాబ్రీ నిర్మాణాన్ని కూల్చేశారు. కానీ, కల్యాణ్ సింగ్ అనే వ్యక్తి, తన ప్రభుత్వాన్ని కూడా త్యాగం చేశాడు. ఈరోజు అదే కల్యాణ్ సింగ్ ఒంటరి అయిపోయాడు. ఆయనపైన కేసు కూడా నడుస్తోంది. అందుకే కొందరు ప్రభుత్వం కోసం బాబ్రీని కాపాడాలనుకుంటే, కల్యాణ్ సింగ్ రాముడి కోసం తన ప్రభుత్వాన్నే వదులుకున్నాడు.

2018లో మళ్లీ అయోధ్య ఎందుకు

2014లో ప్రభుత్వం వచ్చినపుడు మాట నిలబెట్టుకోడానికి మేం మళ్లీ మళ్లీ సమావేశం అయ్యాం. మన ప్రభుత్వం వస్తే సోమనాథ్ లాగే చట్టం తీసుకొస్తాం అన్నారు అని అడిగాను. అలా చాలా సమావేశాలు జరిగాయి. కానీ, చట్టం మాత్రం రాలేదు. తర్వాత 'మీరు ఆ విషయం వదిలేయండి' అని నాతో అన్నప్పుడు, నేను వాళ్లనే వదిలేశాను.

వదిలిన తర్వాత నాకు వారు 'క్రమశిక్షణ'గా చెప్పే దాన్నుంచి విముక్తి లభించింది. అక్టోబర్ 21న నేను కొన్ని వేల మందిని తీసుకుని లక్నో నుంచి అయోధ్య వెళ్లాను. 1992 తర్వాత ఆరోజు మొదటిసారి అయోధ్య వీధుల్లో రామభక్తులు మాత్రమే కనిపించారు. కానీ, ఆ రామభక్తుల ద్వారా ఏర్పడిన ప్రభుత్వం అక్కడ మా పొట్ట కొట్టింది.

మా పొట్టపై కొట్టారు

మొదట్లో, అక్కడ ఆశ్రమాల్లో ఉండడానికి ఏర్పాట్లు ఉండేవి. కానీ మమ్మల్ని లోపలికి రానీయకుండా వాటిపై ఒత్తిడి తెచ్చారు. అందరూ సరయూ నది ఒడ్డునే పడుకున్నారు. అక్కడి వార్తాపత్రికలు, టీవీలు దాని కవరేజీ ఇచ్చాయి. ఏ ప్రభుత్వాన్ని నిలబెట్టామో వారి కుర్చీ ఇవ్వమని రామభక్తులు అడగడం లేదు, అయోధ్యలో రామ మందిరం కట్టాలనే అడుగుతున్నారు. వారికే తిండి లేకుండా చేస్తారా... అని బాధపడ్డాను. 90లో ములాయం సింగ్ కాల్పులు జరిపిస్తే, వీళ్లు ఇప్పుడు పొట్టగొట్టారు. ఓట్లవర్షం కురిసి, అధికారంలోకి వచ్చేలా చేసిన నా సోదరుల్లో ఒకరు రామ మందిరం కట్టాలనుకుంటే, మరో సోదరుడు మసీదును కాపాడాలని అనుకునేవాడు.

కొందరు రామ మందిరం నిర్మించడానికి అయోధ్యలో ఏవో చేస్తుంటే, ఎవరో వారికి తిండి లేకుండా చేస్తున్నారు. ఇంకెవరో రాముడి పేరుతో అధికారం చెలాయిస్తూ ఉద్యమాలు నడిపించి జనాలను చంపిస్తున్నారు. ఈలోపు రామ మందిర యాత్రలు నడుస్తూ వచ్చాయి. ప్రజల మనసులో మందిరం కావాలనే కోరిక ఉండేది. చివరికి కోర్టు తీర్పు ఇచ్చింది. 450 ఏళ్ల పోరాటం ఒక విజయంగా మారింది. కానీ సోమనాథ్ లాగే ఈ ఆలయం నిర్మించి ఉంటే, ఎక్కువ ఆనందించేవాళ్లం. ఇది లాయర్ల పోరాటానికి ఫలితం కదా.

1989లో అవకతవకల ఆరోపణ

1989లో నేను కేంద్ర నాయకత్వంలో లేను, అప్పుడు గుజరాత్ అధ్యక్షుడిగా ఉండేవాడిని. అందుకే అధికారాలు-నిధులు అన్నీ దిల్లీ వాళ్ల చేతుల్లోనే ఉండేవి. వారిని ఏమైందని అడిగాను. నా దగ్గర 88 నుంచి 98 వరకూ ఎలాంటి లెక్కలు లేవు. 1998 తర్వాత నుంచి ఆ లెక్కలన్నీ నా దగ్గరుండేవి. అన్నీ సరిగ్గా ఉండేవి.

నేను ప్రతిరోజూ ఐదారు ఆపరేషన్లు చేసే, క్యాన్సర్ ఆస్పత్రి నుంచి బయటికొచ్చిన క్యాన్సర్ సర్జన్‌ని. అప్పట్లో నేను ఎలాంటి హిందుత్వ మూవ్‌మెంట్‌లో ఉండేవాడ్ని కాదు. మిగతా డాక్టర్లలాగే, మతవిశ్వాసాలు, భక్తి ఉండేవి. పరిస్థితులు మెల్లమెల్లగా మారుతూ మొదట గుజరాత్ హిందూ లీడర్ అయ్యాను. తర్వాత దేశ, ప్రపంచ హిందూ లీడర్ అయ్యాను.

తర్వాత 1998లో నా ఆస్పత్రిని తెరిచాను. రెండేళ్ల తర్వాత నా ఇల్లు, కుటుంబం, మొత్తం ఆస్తులు వదిలేశాను. ఆ తర్వాత నా దగ్గర సంపద, ఉండడానికి ఇల్లు, ఒక్క రూపాయి కూడా లేదు. నా దగ్గర మూడు సంచులే ఉన్నాయి. ఒకదాన్లో బట్టలు, ఒకదాన్లో పుస్తకాలు, ఒకదాన్లో దేవుళ్లు ఉంటారు.

దేశ విభజన సమయంలో జరిగినట్లు, హిందువులు మళ్లీ అభద్రతా భావంలో పడకూడదు. ఏ గ్రామం, ఏ వీధీ రక్షణ లేకుండా ఉండకూడదు. హిందూ సమాజం సుభిక్షంగా ఉండాలి. అక్కడ ఎవరూ పస్తులతో, నిరక్షరాస్యతతో, అనారోగ్యంతో, ఉపాధి లేకుండా ఉండకూడదు. అదే సంకల్పంతో నేను 1998లో అన్నీ వదిలేసి వచ్చాను. దానికోసమే పనిచేస్తున్నాను. అలాగే ముందుకెళ్తున్నాను.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)