మహారాష్ట్ర, హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు: మహారాష్ట్ర బీజేపీకి.. హరియాణాలో హంగ్

4.11

కార్యకర్తలతో మోదీ, అమిత్ షా సమావేశం

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా పార్టీ ప్రధాన కార్యాలయంలో కార్యకర్తలను ఉద్దేశించి ప్రసంగించనున్నారని ఏఎన్ఐ తెలిపింది.

4.05

మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలపై శివసేన కార్యకర్తల ఆనందోత్సాహాలు

3.55

ప్రజాతీర్పు స్పష్టం. ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు-భూపేంద్ర సింగ్ హుడా

హర్యానా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా బీబీసీతో మాట్లాడారు. ప్రజాతీర్పు స్పష్టంగా ఉందన్నారు. "ప్రజలు ఈ ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందరూ కలిసి రావాలని, ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని నేను అపీలే చేస్తున్నాను" అన్నారు.

3.50

ఉత్తరప్రదేశ్ ఉపఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడంపై సంతోషం-ప్రియాంక

అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై మాట్లాడిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీ ఉత్తరప్రదేశ్‌లోని 11 అసెంబ్లీ స్థానాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ ఓట్ల శాతం పెరగడంపై సంతోషంగా ఉందన్నారు.

3.09

కులదీప్ బిష్ణోయ్, అనిల్ విజ్, నైనా చౌతాలా విజయం

హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నేత కుల్దీప్ బిష్ణోయ్, బీజేపీ నేత, మంత్రి అనిల్ విజ్, జేజేపీ నేత చౌతాలా తమ తమ స్థానాల్లో విజయం సాధించారు.

2.33

బీజేపీపై దీపేంద్ర సింగ్ హుడా ఆరోపణ

హర్యానా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ట్రెండ్స్ వచ్చిన తర్వాత కాంగ్రెస్ నేత దీపేందర్ సింగ్ హుడా బీజేపీ స్వతంత్ర ఎమ్మెల్యేలపై ఒత్తిడి చేస్తోందని చెప్పారు. "తాము కోరుకున్న వారికి మద్దతు ఇచ్చే అవకాశం ఇండిపెండెంట్ ఎమ్మెల్యేలకు లభించాలి" అన్నారు.

1.53

మహారాష్ట్ర ఓటర్లకు శరద్ పవార్ ధన్యవాదాలు

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో 56 స్థానాల్లో ముందంజలో ఉన్న ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ ఓటర్లకు ధన్యవాదాలు చెప్పారు.

"కాంగ్రెస్-ఎన్సీపీ కూటమి చాలా కష్టపడింది. అధికారం వస్తూ-పోతూ ఉంటుంది, కానీ ప్రజలకు అండగా నిలిచేందుకు మేం కట్టుబడి ఉంటాం" అన్నారు.

1.44

కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డీ, ఇండిపెండెంట్లకు మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా అపీల్

హరియాణా మాజీ ముఖ్యమంత్రి భూపేందర్ సింగ్ హుడా కాంగ్రెస్, జేజేపీ, ఐఎన్ఎల్డీ, ఇండిపెండెంట్లు ఒక్కటై ప్రభుత్వం ఏర్పాటు చేయాలని కోరారు.

1.15

హరియాణా నుంచి బీజేపీ తరఫున బరోడా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న ఒలంపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ వెనకబడి ఉన్నారు. ఈ స్థానంలో కాంగ్రెస్ అభ్యర్థి శ్రీకృష్ణ హుడా ఆధిక్యంలో ఉన్నారు.

12.28

సీఎం పదవి కోసం తాను ఎవరితో మాట్లాడలేదని హరియాణాలో కింగ్ మేకర్‌‌గా అవతరించిన జేజేపీ నేత దుశ్యంత్ చౌతాలా అన్నారు. పూర్తి స్థాయిలో ఫలితాలు వెలువడిన తర్వాతే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

12.14

హరియాణాలో బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. రాష్ట్రంలో అతి పెద్ద పార్టీగా అవతరించబోతుంది. అయితే, ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన మెజారిటీ ఆ పార్టీకి వచ్చేలా కనిపించడం లేదు. ఇక్కడ కాంగ్రెస్ 28 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా, జేజేపీ 11 స్థానాల్లో ముందంజలో ఉంది.

12.01

గుజరాత్ ఉపఎన్నికల పోరులో బీజేపీ, కాంగ్రెస్ హోరాహోరీగా పోరాడుతున్నాయి. ఇక్కడ ఆరు అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగాయి. బీజేపీ మూడు, కాంగ్రెస్ మూడు స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

11.22

మహారాష్ట్రలో బీజేపీ కూటమి 164 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. బీజేపీ 101 స్థానాల్లో, శివసేన 63 స్థానాల్లో ముందంజలో ఉన్నాయి. ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ 11000 ఓట్ల ఆధిక్యంలో ఉన్నారు. ఇక కాంగ్రెస్ 39 సీట్లలో ఆధిక్యంలో ఉంది. M.I.M మూడు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. స్వతంత్రులు 15 చోట్ల ఆధిక్యంలో ఉన్నారు.

హరియాణా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ, కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ కనిపిస్తోంది. బీజేపీ 38 చోట్ల ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 31 స్థానాల్లో, జన్‌నాయక్ జనతా పార్టీ 11 సీట్లలో ముందంజలో ఉన్నాయి.

10.50

మహారాష్ట్రలో బీజేపీ కూటమి ఆధిక్యంలో కొనసాగుతోంది. ఉదయం 10.50 నిమిషాలకు బీజేపీ కూటమి 178 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 89 స్థానాల్లో ముందంజలో ఉంది. ఇతరులు 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు.

ఇక హరియాణాలో బీజేపీ - కాంగ్రెస్ కూటమి మధ్య హోరాహోరీ కనిపిస్తోంది.. బీజేపీ 41 స్థానాల్లో ఆధిక్యంలో ఉండగా.. కాంగ్రెస్ కూటమి 35 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది.

10:20

మహారాష్ట్రలో బీజేపీ కూటమి 181 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 87 స్థానాల్లో ముందంజలో ఉంది. M.I.M రెండు స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతోంది. ఇక హరియాణాలో బీజేపీ 45 స్థానాల్లో కాంగ్రెస్ 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నాయి. ఇతరులు 13 స్థానాల్లో ఆధీక్యంలో ఉన్నారు.

9:47

మహారాష్ట్రలో బీజేపీ కూటమి 178 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 89 స్థానాల్లో ముందంజలో ఉంది. హరియాణాలో బీజేపీ 47 స్థానాల్లో కాంగ్రెస్ 29 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

9: 03

మహారాష్ట్రలో బీజేపీ కూటమి 157 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 61 స్థానాల్లో ముందంజలో ఉంది. హరియాణాలో బీజేపీ 53 స్థానాల్లో కాంగ్రెస్ 21 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

8:41

ఉత్తర ప్రదేశ్‌లో ఏడు అసెంబ్లీ స్థానాలకు జరుగుతున్న ఉప ఎన్నికల్లో తొలి రౌండు ఫలితాల్లో ఒక స్థానంలో సమాజ్‌వాదీ పార్టీ ముందంజలో ఉంది.

8:30

పోలింగ్ ఏజెన్సీ సీ ఓటర్ ప్రకారం, మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల తొలి రౌండ్ ఫలితాల్లో బీజేపీ ఆధిక్యంలో ఉంది.

మహారాష్ట్ర‌లో 288 సీట్లకు గాను బీజేపీ కూటమి 64 స్థానాల్లో, కాంగ్రెస్ 22 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. హరియాణాలో బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. ఇక్కడ కాంగ్రెస్ 7 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది.

8: 00

మహారాష్ట్ర, హరియాణా రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలతో పాటు, తెలంగాణలోని హుజూర్‌నగర్ నియోజకవర్గ ఉప ఎన్నికలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది.

మహారాష్ట్రలోని 288, హరియాణాలోని 90 శాసనసభ స్థానాలకు ఎన్నికలతో పాటు, మరో 18 రాష్ట్రాల్లో 51 అసెంబ్లీ సీట్లకు, రెండు లోక్‌సభ స్థానాలకు ఈనెల 21న ఉప ఎన్నికలు జరిగాయి.

హుజూర్‌నగర్ ఉప ఎన్నిక

తెలంగాణలోని హుజూర్‌నగర్‌లో 84.75 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 28మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

అధికార పార్టీ టీఆర్ఎస్ నుంచి సైదిరెడ్డి, కాంగ్రెస్ నుంచి పద్మావతి, టీడీపీ నుంచి చావా కిరణ్మయి, బీజేపీ నుంచి కోట రామారావు పోటీ చేశారు.

ఇక్కడ 2014 సార్వత్రిక ఎన్నికలలో 81.18 శాతం, 2018లో 86. 38 శాతం పోలింగ్ నమోదైంది.

2018లో అసెంబ్లీ ఎన్నికలు జరగ్గా హుజూర్‌నగర్ నుంచి తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఎన్.ఉత్తమ్‌కుమార్ రెడ్డి గెలిచారు.

అనంతరం జరిగిన లోక్‌సభ ఎన్నికల్లో ఆయన నల్గొండ లోక్‌సభ నియోజకవర్గం నుంచి పోటీ చేసి గెలవడంతో హుజూర్‌నగర్ అసెంబ్లీ సీటు ఖాళీ అయింది. దాంతో, ఇప్పుడు ఉప ఎన్నిక వచ్చింది.

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు

మహారాష్ట్రలో 60.46 శాతం పోలింగ్ నమోదైంది. అసెంబ్లీలోని మొత్తం 288 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో 3,237 మంది అభ్యర్థులు పోటీ పడ్డారు. వారిలో 3,001 మంది పురుషులు కాగా, 235 మంది మహిళా అభ్యర్థులు, ఒకరు ఇతరులు ఉన్నారు.

నాగ్‌పూర్ పశ్చిమ నియోజకవర్గం నుంచి వరుసగా మూడోసారి బరిలో నిలిచారు ప్రస్తుత ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్.

ముంబయిలోని వర్లి నుంచి ఆదిత్య ఠాక్రే బరిలో నిలిచారు. ఠాక్రే కుటుంబం నుంచి ఎన్నికల్లో పోటీ చేసిన మొదటి వ్యక్తి ఆదిత్యనే. 1966లో శివసేన పార్టీని ఏర్పాటు చేసిన తర్వాత ఠాక్రే కుటుంబం నుంచి ఎవరూ కూడా ఎన్నికల్లో పోటీ చేయలేదు.

మాజీ ముఖ్యమంత్రి పృధ్వీరాజ్ చౌహాన్ కరాడ్ దక్షిణం నుంచి పోటీలో ఉన్నారు.

మహారాష్ట్ర:ఎగ్జిట్ పోల్స్ ఏం చెప్పాయి?

  • ఇండియా టుడే-యాక్సిస్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీకి 109-124 స్థానాలు లభించవచ్చు. అటు శివసేనకు 57-60 సీట్లు రావచ్చు. రెండు పార్టీలకు మొత్తం 166-194 స్థానాలు లభించవచ్చు. కాంగ్రెస్, దాని మిత్రపక్షం ఎన్సీపీకి 72 నుంచి 90 స్థానాలు రావచ్చు. మిగతా పార్టీలకు 22 నుంచి 34 సీట్లు రావచ్చు.
  • టైమ్స్ నౌ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-శివసేనకు 230 స్థానాలు, కాంగ్రెస్-ఎన్సీపీ కూటమికి 48, మిగతా పార్టీలకు 10 స్థానాలు లభించవచ్చు.
  • సీఎన్ఎన్ న్యూస్ 18 ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-శివసేన కూటమికి 243 స్థానాల దాకా రావచ్చు. కాంగ్రెస్- ఎన్సీపీలకు కలిపి 41, మిగతా పార్టీలకు 4 నుంచి 6 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
  • ఏబీపీ-సీఓటర్స్ ఎగ్జిట్ పోల్: బీజేపీ-శివసేన కూటమి 288లో 204 స్థానాలు సాధించవచ్చు. కాంగ్రెస్-ఎన్సీపీకి 69, మిగతా పార్టీలకు 15 స్థానాలు లభించవచ్చు.
  • టీవీ9 మరాఠీ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ కూటమికి 197 స్థానాలు, కాంగ్రెస్-ఎన్సీపీకి 75, మిగతా పార్టీలకు 16 స్థానాలు లభించవచ్చు.
  • జన్ కీ బాత్ ఎగ్జిట్ పోల్స్: బీజేపీ-శివసేన కూటమికి 223, కాంగ్రెస్-ఎన్సీపీకి 54, మిగతా పార్టీలకు 14 స్థానాలు రావచ్చు.

హరియాణా అసెంబ్లీ ఎన్నికలు

రాష్ట్ర అసెంబ్లీలోని 90 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఎన్నికల్లో 65 శాతం పోలింగ్ నమోదైంది. 1,169 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు.

బీజేపీ, కాంగ్రెస్, ఇండియన్ నేషనల్ లోక్ దళ్, జననాయక్ జనతా పార్టీ ఇక్కడ బరిలో ఉన్నాయి.

ప్రస్తుత ముఖ్యమంత్రి మనోహర్ లాల్ ఖట్టర్ కర్నాల్ స్థానం నుంచి పోటీ చేశారు. బీజేపీ తరపున హరియాణాలో మొదటి ముఖ్యమంత్రి ఈయనే. ఆయనపై కాంగ్రెస్ తరపున త్రిలోచన్ సింగ్ బరిలో నిలిచారు.

సీనియర్ కాంగ్రెస్ నేత, మాజీ ముఖ్యమంత్రి భూపిందర్ సింగ్ హుడా పోటీ చేసిన గర్హిసంపాల కిలోయ్ స్థానంలో బీజేపీ తరపున సతీశ్ నాందాల్ పోటీ పడ్డారు.

నార్నౌడ్ నుంచి బీజేపీలో శక్తిమంతమైన నేతగా భావిస్తున్న కెప్టెన్ అభిమన్యు బరిలో ఉన్నారు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణ విజేత బబితా ఫొగట్ బీజేపీ తరపున చార్కీ దాద్రి స్థానంలో పోటీ చేశారు. ఒలింపిక్ పతక విజేత యోగేశ్వర్ దత్ బరోడా నుంచి బీజేపీ తరపున నిలబడ్డారు.

హరియాణా ఎగ్జిట్ పోల్స్

  • టైమ్స్ నౌ: బీజేపీకి 71 స్థానాలు రావచ్చు. కాంగ్రెస్‌కు 11, మిగతా పార్టీలకు 8 సీట్లు వచ్చే అవకాశం ఉంది.
  • రిపబ్లిక్ టీవీ-జన్ కీ బాత్: బీజేపీకి 57, కాంగ్రెస్‌కు 17, మిగతా పార్టీలకు 16 స్థానాలు దక్కవచ్చు.
  • న్యూస్ ఎక్స్: బీజేపీకి 77, కాంగ్రెస్‌కు 11, మిగతా పార్టీలకు 2 స్థానాలు రావచ్చు.
  • టీవీ9-భారత్ వర్ష్: బీజేపీ 47, కాంగ్రెస్ 23, మిగతా పార్టీలు 20 సీట్లు గెలుచుకునే అవకాశం ఉంది.
  • సీఎన్ఎన్-న్యూస్ 18: బీజేపీకి 75, కాంగ్రెస్‌కు 10, మిగతా పార్టీలకు 5 స్థానాలు లభిస్తాయి.

51 స్థానాల్లో ఉపఎన్నికలు

దేశవ్యాప్తంగా మరో 17 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతాల్లోని 51 అసెంబ్లీ స్థానాలకు, 2 లోక్ సభ స్థానాలకు కూడా అక్టోబర్ 21న ఉపఎన్నికలు జరిగాయి.

వాటిలో తెలంగాణలోని హుజూర్ నగర్ కూడా ఒకటి. ఉత్తర్‌ప్రదేశ్‌లో 11, గుజరాత్‌లో 6, బిహార్‌లో 5, కేరళలో 5, అస్సాంలో 4, పంజాబ్‌లో 4, సిక్కింలో 3, రాజస్థాన్‌, హిమాచల్ ప్రదేశ్‌, తమిళనాడు, అరుణాచల్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్, ఒడిశాలలో రెండేసి స్థానాలు, ఛత్తీస్‌గఢ్, పుదుచ్ఛేరి, మేఘాలయాల్లో ఒక్కో స్థానంలో ఉపఎన్నికలు జరిగాయి. అలాగే, బిహార్‌లోని సమస్తీపూర్, మహారాష్ట్రలోని సతారా లోక్‌సభ స్థానాలకు కూడా ఉపఎన్నికలు జరిగాయి.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)