You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పవన్ కల్యాణ్: వైసీపీ మేనిఫెస్టో జనరంజకం... పాలన జనవిరుద్ధం
జనసేనను రెగ్యులర్ పొలిటికల్ పార్టీలా చూడొద్దు.. ఆరోగ్యకరమైన రాజకీయలనే జనసేన చేస్తుంది అని ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ అన్నారు.
కొత్త ప్రభుత్వంపై ఇంత త్వరగా మాట్లాడాల్సి వస్తుందని అనుకోలేదు.. మూడు నెలల్లోనే ప్రభుత్వ నిర్ణయాలు ప్రజలను ఆందోళన కలిగించాయి.. వంద రోజుల పాలనలో పారదర్శకత దార్శినికత లోపించింది అని వైఎస్సార్‌సీపీ 100 రోజుల పాలనపై 33 పేజీల నివేదిక విడుదల చేశారు పవన్ కల్యాణ్.
వైసీపీ మేనిఫెస్టో జనరంజకంగా ఉంది కానీ పాలన జనవిరుద్దంగా ఉందని విమర్శించారు.
ఈ నివేదికను సిద్ధం చేయడానికి తమ పార్టీ బృందం అనేక జిల్లాల్లో పర్యటించి వాస్తవ పరిస్థితులు గమనించిందని పవన్ వెల్లడించారు. 9 ప్రధాన అంశాలతోపాటు ఇతర అంశాలపై కూడా ఈ బృందం అధ్యయనం చెసిందని తెలిపారు.
పవన్ ఇంకేమన్నారు?
- టీడీపీ ఎన్నికల్లో ఓడిపోవడానికి ప్రధాన కారణం ఇసుక మాఫియా. కానీ ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వ ఇసుక పాలసీలో సైతం పారదర్శకత లేదు. ధరల విషయంలో కచ్చితత్వం లేదు. 375 అని చెప్పి.. 900 వసూలు చేస్తున్నారు. ఇసుక దొరక్కుండా చెయ్యడంతో పరిణామాలు తీవ్రంగా ఉన్నాయి. వందరోజుల్లో ఒక సరైన ఇసుక విధానం తీసుకురాలేకపోవడం పరిపాలనై వైఫల్యమే.
- మేనిఫెస్టో అమలు చెయ్యాలంటే రూ.50 వేల కోట్లు కావాలి. అప్పులకు వడ్డీలు కడుతున్న రాష్ట్రానికి అన్ని నిధులు ఎక్కడి నుంచి వస్తాయి?
- నిధుల కోసం పెట్టుబడులను ఆకర్షించే విధానాలు లేవు. పెట్టుబడులు వచ్చే పరిస్థితి రాష్ట్రంలో లేదు. పారిశ్రామికవేత్తలని రానీయకుండా చేస్తున్నారు. కియా మోటర్స్ నుంచి మొదటి కార్ ఓపెన్ కాకుండా సీఈవోని స్థానిక వైసీపీ నేతలు బెదిరించారు.
- పీపీఏలు కొనసాగించాలి. ఏ ప్రాజెక్టులో అయినా అవకతవకలు ఉంటే సరిచెయ్యండి కానీ ఆపేయడం సరికాదు. బందరు పోర్టు రద్దు చేశారు. నిర్మాణం తెలంగాణకు ఇస్తే వచ్చే ఆదాయం తెలంగాణకి వెళ్తుంది. పోలవరంలో అవకతవకలు ఉంటే సరిచేయండి. రివర్స్ టెండరింగ్‌తో అంచనాలు పెరిగిపోయాయని అథారిటీ చెబుతోంది. ప్రజాధనం మీ జేబులో సొమ్ములా వృధా చెయ్యకండి.
- వైసీపీ క్యాడర్ కోసమే విలేజ్ వాలంటీర్ల వ్యవస్థ. ఏర్పాటుచేస్తున్నారు. టీడీపీని జన్మభూమి కమిటీలు ఎంత దెబ్బతీశాయో వైసీపీని వాలంటీర్ల వ్యవస్థ అంతకంటే పెద్ద దెబ్బతీస్తుంది.
- వంద రోజుల్లో సరైన ఆరోగ్య పాలసీ లేదు. రాష్ట్రంలో జ్వరాలు విచ్చలవిడిగా విజృంభిస్తున్నాయి. ప్రజారోగ్యం అధ్వానంగా ఉంది.
- రాజధాని అంటే ఐదుకోట్ల ప్రజల ఆత్మ గౌరవం. రాజధానిపై గెజిట్ ఇవ్వకుండా టీడీపీ తప్పు చేసింది. అది చంద్రబాబు అసమర్థత. అధికారంలో ఉన్నారుగా క్యాపిటల్‌పై గెజిట్ నోటిఫికేషన్ మీరు ఇవ్వండి. మీ సమర్ధత చూపించండి. రూ. 8218 కోట్ల పెట్టుబడులు పెట్టిన తరువాత మార్చేస్తే ఆ డబ్బులు ఎవరు కడతారు?
- జలవనరుల నిర్వహణలో ప్రభుత్వం విఫలమైంది. కృష్ణా వరదను సక్రమంగా వినియోగించుకోలేకపోయారు. వరద సహాయక చర్యలు వదిలేసి.. మంత్రులు చంద్రబాబు ఇంటి చుట్టూ తిరిగారు. మంత్రులు బాధ్యతలను వదిలేశారు.
- స్కూళ్లలో కనీస సదుపాయాలు లేవు. మరుగుదొడ్లు లేవు. ప్రభుత్వ స్కూళ్లకి వెళ్లడానికి ఆడపిల్లలు భయపడుతున్నారు.
- అమ్మ ఒడి అని రూ.15 వేలు ఒక్కరికి ఇస్తే ఇంకో బిడ్డకి ఎవరిస్తారు? ఒక బిడ్డ చదువుకుంటే చాలా?
- ఓవైపు మద్యపాన నిషేధం అంటున్నారు.. మరోవైపు మద్యం అమ్మకాలు పెరిగాయి. ఈ పరిస్థితుల్లో మద్యపాన నిషేధం ఎంతవరకూ అమలు చేస్తారో అనుమానంగా ఉంది.
- రాష్ట్రంలో రైతులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. విత్తనాల కోసం లైన్లలో నిలబడి చనిపోయే పరిస్థితి ఉంది.
- రాష్ట్రంలో శాంతిభద్రతలు సక్రమంగా లేవు. సొంత చిన్నాన్న హత్య కేసులో ఏం చర్యలు తీసుకున్నారు? సీబీఐ విచారణకు ఆదేశించొచ్చుగా. కోడికత్తి కేసులో నిందితుడు జగన్ ప్రమాణ స్వీకారం నాడు బయటకి వచ్చాడు. ఆ కేసు విచారణను ఎందుకు వేగవంతం చేయడం లేదు? ఈ రెండు కేసులపై త్వరగా తేల్చకపోతే అఖిలపక్షం వేసి సీబీఐ విచారణకు డిమాండ్ చేస్తాం.
- హోదా విషయంలో ఏపీ ప్రజలు ముందుకి రావాలి. ప్రజలు వస్తే ఉద్యమం విజయం సాధిస్తుంది. కర్నూలును రాజధాని చేయాలని నేనెప్పుడూ చెప్పలేదు. అమరావతికి దీటైన నగరంగా చెయ్యాలనే చెప్పాను.
ఇకపై ప్రభుత్వ ప్రతి నిర్ణయాలని క్షుణ్ణంగా పరిశీలిస్తుంటామని, తమ నివేదికపై ప్రభుత్వం నుంచి సరైన వివరణ కావాలని పవన్ అన్నారు.
అర్థం చేసుకోకుండా విమర్శలు సరికాదు: మంత్రి బొత్స
జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై మంత్రి బొత్స సత్యనారాయణ తీవ్రంగా స్పందించారు. అర్థం చేసుకోకుండా విమర్శలు చేయడం సరికాదని బీబీసీతో అన్నారు.
"పవన్ వ్యాఖ్యల్లో అర్థం లేదు. అవి చంద్రబాబు మాటలకు కొనసాగింపులా ఉన్నాయి. జగన్ ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలతో ముందుకెళ్తోంది. వివిధ వర్గాల అందించే పథకాలను షెడ్యూల్ ప్రకటించి దాని ప్రకారం ప్రజల ముందుకు తెస్తున్నాం. రాజధాని అమరావతి సహా ఏపీలోని అన్ని నగరాల అభివృద్ధికి కమిటీ ఏర్పాటు చేశాం. ఇసుక, మద్యం అంశాల్లో ప్రభుత్వం పారదర్శకంగా నిర్ణయాలు తీసుకుంది. ఇవన్నీ గుర్తించకుండా విమర్శలు చేయడం అర్థరహితం. ఎన్నికల ముందు కూడా పవన్ కల్యాణ్ వైసీపీపై ఇలాంటి విమర్శలు చేసినా జనం స్వీకరించలేదు. ఇప్పటికైనా అర్థం చేసుకోకపోతే జనసేన మరింత పతనమవుతుంది" అని బొత్స వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి.
- పవన్ కల్యాణ్ ఎప్పుడూ కాపులకు మద్దతు తెలపలేదు. కానీ..
- నల్లమలలో యురేనియం సర్వే: "ఇక్కడ తవ్వితే మా ఊళ్లు నాశనమైపోతాయి.. మేం తవ్వనివ్వం"
- BBC Special: భారత బీచ్‌లలో అణు ఇంధనం... అందాలంటే 30 ఏళ్లు ఆగాలి
- ఐఫోన్ 11 కెమెరాలను చూస్తే భయమేస్తోందా... అయితే మీకు ట్రైపోఫోబియా ఉన్నట్లే
- ఐఫోన్11: భారత మార్కెట్లో యాపిల్ ఫోన్ల ఆధిపత్యం సాధ్యమేనా
- మోదీ వల్ల పాకిస్తాన్లో కశ్మీర్‌పై చర్చ స్వరూపమే మారిపోయిందా...
- మలేరియా వ్యాధి నిరోధక టీకా.. ప్రపంచంలోనే మొదటిసారి అందుబాటులోకొచ్చిన వ్యాక్సిన్
- 'నన్ను రేప్ చేశారు... ఇప్పుడు నా కూతుళ్లనూ అలా చేస్తారేమోనని భయపడుతున్నా'
- మానవ నివాసయోగ్యమైన ఆ గ్రహం మీద తొలిసారిగా గుర్తించిన నీటి జాడలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)