You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఈ రైతు కుటుంబం ఐదు ఆత్యహత్యలు ఎందుకు చూడాల్సి వచ్చింది
- రచయిత, సుఖ్‌చరణ్ ప్రీత్
- హోదా, బీబీసీ కోసం
దేశానికి రైతే వెన్నెముక అని అంటుంటారు. అలాంటి రైతులు ఎదుర్కొంటున్న దుస్థితికి అద్దం పట్టే కథ ఇది.
పంజాబ్‌లోని బర్నాలా జిల్లాలో భోత్నా అనే గ్రామం ఉంది. సెప్టెంబర్ 10న ఆ ఊరిలో ఉంటున్న లవ్‌ప్రీత్ అనే యువ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. అతడి వయసు 22 ఏళ్లే.
అప్పుల భారం తాళలేక అతడు ఈ చర్యకు ఒడిగట్టినట్లు అతడి కుటుంబ సభ్యులు చెబుతున్నారు.
అయితే, లవ్‌ప్రీత్ కుటుంబానికి ఇలాంటి విషాదం ఇది మొదటిదేమీ కాదు. నాలుగు తరాల్లో ఐదు ఆత్మహత్యలను ఆ కుటుంబం చూడాల్సి వచ్చింది.
ఏడాదిన్నర క్రితం లవ్‌ప్రీత్ తండ్రి కుల్వంత్ సింగ్ అప్పుల భారంతోనే ఉరి వేసుకున్నారు.
కుల్వంత్‌కు 20 ఏళ్లుండగా, ఆయన తండ్రి నాహర్ సింగ్ కూడా ఇదే కారణంతో ప్రాణాలు తీసుకున్నారు.
నాహర్ సింగ్ సోదరుడు భగవాన్ సింగ్ కూడా ఇదే దారిని ఎంచుకున్నారు.
వీరందరి కన్నా ముందు కుల్వంత్ తాత జోగిందర్ సింగ్ కూడా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు.
తాజాగా లవ్‌ప్రీత్ కూడా వారి మార్గంలోనే నడిచాడు.
కొండంత బాధలో కూరుకుపోయిన లవ్‌ప్రీత్ కుటుంబానికి ధైర్యం చెప్పేందుకు బంధువులు, ఇరుగుపొరుగువారు వారి ఇంటికి వచ్చారు.
వారిలో సచ్చియార్ కౌర్ అనే ఓ ముసలావిడ కూడా ఉన్నారు. ఆమె లవ్‌ప్రీత్‌కు అమ్మమ్మ.
లవ్‌ప్రీత్ కుటుంబంలోని నాలుగు తరాల్లో జరిగిన ఐదు ఆత్యహత్యలకు ఆమె సాక్షిగా ఉన్నారు.
''లవ్‌ప్రీత్ కుటుంబానికి ఒకప్పుడు 16-17 ఎకరాల భూమి ఉండేది. క్రమంగా వాళ్లు పేదరికంలో కూరుకుపోయారు. అప్పులు పెరిగిపోయాయి. ఇప్పుడు వాళ్లకు మొత్తంగా ఒక ఎకరం భూమి ఉందంతే. అప్పులు రూ.8లక్షల దాకా ఉన్నాయి'' అని సచ్చియార్ చెప్పారు.
లవ్‌ప్రీత్ వేరే వాళ్ల భూమిని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఇప్పుడు అతడు పురుగుల మందు తాగి చనిపోయింది ఆ భూమిలోనే.
''లవ్‌ప్రీత్ తండ్రి పద్నాలుగు ఎకరాలు కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసేవాడు. ఓసారి వడగళ్లు పడటంతో పంట నాశనమైంది. ఆ బాధతో అతడు ఉరి వేసుకుని చనిపోయాడు. అంతకుముందు లవ్‌ప్రీత్ ముత్తాత, ఇద్దరు తాతలు కూడా ఆర్థిక ఇబ్బందులతో ఆత్మహత్య చేసుకున్నారు. అతడి చిన్నాన్న అనారోగ్యంతో చనిపోయాడు. మొత్తం కుటుంబమే నాశనమైపోయింది'' అంటూ సచ్చియార్ కన్నీళ్లు పెట్టుకున్నారు.
''నా కొడుకుతో కలిసి లవ్‌ప్రీత్ చదువుకునేవాడు. ఇద్దరూ కలిసిమెలిసి ఉండేవారు. లవ్‌ప్రీత్ మరణం విషయం తెలిసినప్పటి నుంచి వాడిని ఓదార్చడం నా వల్ల కావట్లేదు'' అని అక్కడున్న మంజీత్ కౌర్ అనే మహిళ అన్నారు.
''లవ్‌ప్రీత్ తన బాధలు నాతో చెప్పుకుంటుండేవాడు. అవసరమైనప్పుడు డబ్బులు అడిగి తీసుకునేవాడు. వాళ్ల ఇంట్లో ఏదీ మిగల్లేదని, సోదరి పెళ్లి చేయడం ఎలాగో అర్థం కావడం లేదని బాధపడుతుండేవాడు'' అని ఆమె వివరించారు.
గురునామ్ సింగ్ అనే మరో గ్రామస్థుడికి లవ్‌ప్రీత్ కుటుంబంతో 60 ఏళ్లుగా అనుబంధం ఉంది.
''వాళ్లు చాలా కష్టపడుతుండేవారు. లవ్‌ప్రీత్ తాత, తండ్రి వ్యవసాయం చేస్తూనే.. హార్వెస్టర్, ట్రాక్టర్ నడపడం వంటి పనులూ చేసేవారు. ఇందుకోసం వేరే రాష్ట్రాలకూ వెళ్తుండేవారు. అయితే కుటుంబ అవసరాల కోసం చేసిన అప్పులు పెరిగిపోయాయి. ప్రభుత్వం ఆదుకుంటే, వాళ్లు బతికుండేవారేమో. ఏ సాయమూ అందకపోవడంతో అప్పుల నుంచి బయటపడటం వారి వల్ల కాలేదు'' అని గురునామ్ చెప్పారు.
తమ కుటుంబంలో మగవాళ్లంతా చనిపోయారని.. తాను, తన కోడలు, మనవరాలు మాత్రమే మిగిలున్నామని లవ్‌ప్రీత్ నానమ్మ గురుదేవ్ కౌర్ వాపోయారు.
''ప్రభుత్వం మాకు ఎలాంటి సాయమూ చేయలేదు. నాది ఒక్కటే కోరిక. నా మనవరాలికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలి. కనీసం, ఆమె జీవితాన్నైనా కాపాడండి'' అని ఆమె విజ్ఞప్తి చేశారు.
బీబీసీకి అందిన సమాచారం ప్రకారం... రుణ మాఫీ పథకం కింద లవ్‌ప్రీత్ కుటంబానికి రూ.53 వేల రుణం మాఫీ అయ్యింది. లవ్‌ప్రీత్ తాత నాహర్ సింగ్ చనిపోయినప్పుడు రూ.2లక్షల పరిహారం కూడా వచ్చింది.
అయితే, లవ్‌ప్రీత్ తండ్రి కుల్వంత్ సింగ్ మరణానికి మాత్రం ఎలాంటి పరిహారమూ రాలేదు.
ఆ సమయంలో లవ్‌ప్రీత్ కుటంబంపై రూ.1.5 లక్షల బ్యాంకు రుణం ఉంది. తమకున్న భూమి తాకట్టు పెట్టి మరో రూ.3 లక్షలు అప్పు తీసుకున్నారు. ఆ తర్వాత చేసిన అప్పులు కూడా కలిపి మొత్తం రూ.8లక్షల దాకా వాళ్లు బాకీలు పడ్డారు.
పంజాబ్ ఆర్థికవ్యవస్థ చాలా వరకూ వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. అయితే, రాష్ట్రంలో గత రెండేళ్లలో 900 మంది రైతులు, వ్యవసాయ కూలీలు ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిబ్రవరిలో విడుదలైన ఓ నివేదిక వెల్లడించింది.
ఐదు పంజాబీ దినపత్రికల వార్తలను అధ్యయనం చేసి భారతీయ కిసాన్ యూనియన్ (ఉగ్రహణ్) ఈ నివేదిక రూపొందించింది.
''ఆత్మహత్యలకు రకరకాల కారణాలుంటాయి. నిరుద్యోగం కూడా వాటిలో ఒకటి. ఆత్మహత్య చేసుకున్నవారి కుటుంబ సభ్యులు నిరాశ, నిస్పృహల్లో కూరుకుపోతే, బయటపడేసేందుకు నిపుణుల సూచనలు, సలహాలు అవసరం. కానీ, ఇలాంటివాటికి నిపుణులను సంప్రదించే అలవాటు మన సమాజంలో పెద్దగా లేదు'' అని మానసిక వైద్య నిపుణుడు కమలేశ్ కుమార్ సాహూ అభిప్రాయపడ్డారు.
ఇవి కూడా చదవండి:
- ‘బంగాళాదుంపలు’ పండించారని రైతులపై వేసిన కేసును వెనక్కి తీసుకుంటున్న పెప్సీకో
- 9/11 దాడులకు 18 ఏళ్లు: తీవ్రవాదంపై పోరాటంలో అమెరికా విఫలం - అభిప్రాయం
- ఇస్రో చైర్మన్ కె శివన్ కథ: ఒకేసారి 104 ఉపగ్రహాలను అంతరిక్షంలోకి పంపిన నిరుపేద రైతు కొడుకు
- భారత్‌లో సోషల్ మీడియాను ఒక వ్యక్తి సగటున ఎన్ని గంటలు వాడుతున్నారో తెలుసా?
- పాకిస్తాన్‌వన్నీ తప్పుడు ఆరోపణలు.. ఐరాస మానవ హక్కుల మండలిలో స్పష్టం చేసిన భారత్
- 9/11 దాడులను అమెరికా కావాలనే అడ్డుకోలేదా? కుట్ర సిద్ధాంతాలు ఏమంటున్నాయి, నివేదికలు ఏం చెబుతున్నాయి?
- ఆత్మహత్యల ఆలోచనలను గుర్తించడమెలా, వారితో ఎలా మాట్లాడాలి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)