You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
చంద్రయాన్ 2: ఆ 15 నిమిషాలే కీలకం.. చందమామపై ల్యాండింగ్ ఇలా జరుగుతుంది
- రచయిత, శ్రీకాంత్ బక్షి
- హోదా, బీబీసీ ప్రతినిధి
అతి తక్కువ ఖర్చుతో, అందునా తొలి ప్రయోగాలతోనే.. విజయం సాధిస్తున్న ఇస్రో... అంతరిక్ష రంగంలో అగ్రరాజ్యాలను కూడా నివ్వెరపోయేలా చేస్తోంది. మీడియం లిఫ్ట్ హెవీ వెహికల్ అయిన జీఎస్ఎల్వీ మార్క్ త్రీ రాకెట్‌ని ఉపయోగించి కేవలం 978 కోట్ల రూపాయల అతి తక్కువ ఖర్చుతో ఇస్రో చంద్రయాన్ 2 ప్రాజెక్ట్ చేపట్టింది.
చంద్రయాన్ 2 ప్రయోగంలో రెండు కీలక దశలున్నాయి. అవి లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్, రెండోది చంద్రుడి ఉపరితలం మీద సేఫ్ ల్యాండింగ్. వాటిలో మొదటి దశను ఇస్రో దిగ్విజయంగా అధిగమించింది.
జులై 22న నిప్పులు చిమ్ముకుంటూ నింగిలోకి దూసుకెళ్లిన చంద్రయాన్ 2... 13 ఆగస్టున భూ కక్ష్య నుంచి విడిపోయి... చంద్రుడి వైపుగా ప్రయాణం ప్రారంభించింది. అలా ఏడు రోజుల పాటు చంద్రుడి వైపు దూసుకెళ్లిన చంద్రయాన్ 2 కాంపోజిట్ మాడ్యూల్... ఆగస్ట్ 20న చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించింది.
చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, వంటి ప్రయోగాల్లో అత్యంత సంక్లిష్టమైన దశల్లో లూనార్ ఆర్బిట్ ఇన్‌సర్షన్ కీలకమైనది. అంటే భూకక్ష్య నుంచి విడిపోయి.. చంద్రుడి వైపు ప్రయాణించిన చంద్రయాన్ 2 కాంపోజిట్ మాడ్యూల్... చంద్రుడి కక్ష్యలోకి ప్రవేశించడాన్నే లూనార్ ఆర్బిట్ ఇన్‌సెర్షన్ అంటారు.
ఇది అనుకున్నంత సులువైన దశ కాదు. అమెరికా, రష్యాలు తొలినాళ్లలో 14 సార్లు ఈ దశ దగ్గరే విఫలమయ్యాయి. 15వ సారి మాత్రమే ఈ దశ దగ్గర విజయం సాధించాయి. కానీ ఇస్రో మాత్రం రెండు చంద్రయాన్ ప్రయోగాల్లోనూ తొలి ప్రయత్నంలోనే ఈ దశను విజయవంతంగా అధిగమించింది.
చంద్రుడి మీద దిగడానికీ సుదీర్ఘ ప్రయాణమే
ఆగస్ట్ 20న చంద్రుడి కక్ష్యలో ప్రవేశించిన చంద్రయాన్ 2... చంద్రుడి చుట్టూ దీర్ఘ వృత్తాకార కక్ష్యలో తిరుగుతూ.. క్రమంగా తన అపోజీని తగ్గించుకుంది. ఇలా చంద్రుడి చుట్టూ తిరుగుతున్న కాంపోజిట్ మాడ్యూల్ నుంచి 13 రోజుల తర్వాత.. ఆర్బిటర్ నుంచి ల్యాండర్ విక్రమ్ వేరు పడింది.
అంటే సెప్టెంబర్ 2 ఉదయం ఏడు గంటల 45 నిముషాలకు ఆర్బిటర్ నుంచి ల్యాండర్ వేరు పడి... క్రమంగా చంద్రుడి వైపు ప్రయాణం ప్రారంభించింది. ఈ ల్యాండర్ కూడా నేరుగా చంద్రుడి మీదకు దూసుకెళ్లదు. క్రమంగా చంద్రుడి చుట్టూ తిరుగుతూ... దాని గురుత్వాకర్షణ శక్తికి లోనయ్యేలా కదులుతుంది.
ఇందుకోసం చంద్రయాన్ ల్యాండర్‌ను సెప్టెంబర్ 3న నాలుగు సెకెన్ల పాటు... చంద్రుడి ఉపరితలం వైపు దూసుకెళ్లేలా మండించారు. ఆ తర్వాత మరికొన్ని గంటలకు ల్యాండర్ చంద్రుడి వైపు వెళ్లేలా మరో 9 సెకెన్ల పాటు మండించారు. ఇలా నాలుగు రోజుల పాటు చంద్రుడి చుట్టూ తిరుగుతూ ప్రయాణించిన తర్వాత.. ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద ల్యాండయ్యేలా ఇస్రో ప్రోగ్రామ్ చేసింది.
అమెరికా, రష్యా వంటి దేశాలతో పోలిస్తే అత్యంత తక్కువ ఇంధన సామర్థ్యంతో, అత్యధిక సక్సెస్ రేట్ తో ఇస్రో అంతరిక్షంలో దూసుకుపోతోంది. ఇంధన వినియోగంలోనే కాదు... సమాచార సేకరణలో కూడా అమెరికా కన్నా భిన్నంగా ముందుకెళ్తోంది. ఇప్పటి వరకూ అమెరికా సహా మరే ఇతర దేశమూ చంద్రుడి మీద కాలు మోపని ప్రాంతంలో తన ల్యాండర్‌ను, రోవర్‌ను దింపి పరిశోధనలు చేయబోతోంది.
అత్యంత సంక్లిష్టం... ల్యాండింగ్
చంద్రయాన్ ప్రయోగంలో అత్యంత సంక్లిష్టమైన దశ... ల్యాండింగ్. చంద్రుడి మీద అత్యంత పలుచనైన వాతావరణం ఉంటుంది. సాధారణంగా వాతావరణం ఉంటే దాన్ని అట్మాస్ఫియర్ అంటారు. కానీ అత్యంత పలుచని వాతావరణం కాబట్టి దీన్ని సాంకేతికంగా ఎక్సోస్పియర్ అంటారు.
ఇది ఎంత పలుచగా ఉంటుందంటే... దాదాపుగా వాతావరణం ఉండదనే చెప్పుకోవచ్చు. అంటే భూమ్మీద పారాషూట్‌తో సేఫ్ గా ల్యాండ్ అయినట్లుగా... చంద్రుడి మీద పారాషూట్ సాయంతో సేఫ్ ల్యాండింగ్ సాధ్యం కాదు. ఇంకా చెప్పాలంటే గాలి ఆధారంగా ప్రయాణం చేసే హెలికాప్టర్, డ్రోన్లు వంటివి చంద్రుడి మీద పనిచేయవు. కాబట్టి ల్యాండర్ చంద్రుడి మీద సేఫ్‌గా ల్యాండవ్వడానికి న్యూటన్ మూడో గమన నియమాన్ని ఆధారం చేసుకుని, ల్యాండర్‌కి కింది వైపుగా రాకెట్లను మండించడం ద్వారా వేగాన్ని నియంత్రించుకుంటూ దిగేలా ఏర్పాట్లు చేశారు. కానీ ఇది అనుకున్నంత సులువైన విషయమేమీ కాదు.
ల్యాండవ్వడానికీ రాకెట్లు కావాల్సిందే..
భూమ్మీద ఉన్న గురుత్వాకర్షణతో పోలిస్తే చంద్రుడి గురుత్వాకర్షణ ఆరో వంతు ఉంటుంది. అంటే భూమ్మీద 66 కిలోల బరువు ఉన్న మనిషి... చంద్రుడి మీద పదకొండు కిలోలే ఉంటాడు. చంద్రుడి గురుత్వాకర్షణ భూమితో పోలిస్తే ఆరో వంతే అయినా... అది వాస్తవంగా అనుకున్నంత తక్కువ కూడా కాదు.
ఆ గ్రావిటీని నిరోధిస్తూ... ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద ల్యాండవ్వడానికి అందులో ఉన్న రాకెట్లను కిందివైపు నుంచి మండించడం ద్వారా నెమ్మదిగా దిగేలా ఏర్పాట్లు చేశారు. చంద్రుడి గురుత్వాకర్షణ కన్నా.. కాస్త తక్కువ శక్తి విడుదల చేసేలా ల్యాండర్లో రాకెట్లు మండించారు. దీంతో అది నెమ్మదిగా చంద్రుడి ఉపరితలం వైపు కిందకు దిగుతుంది.
ఇలా కింది వైపు నుంచి రాకెట్లు మండిస్తూ ల్యాండ్ అవ్వడం చాలా కష్టమైన విషయం. ఆ సమయంలో ల్యాండర్ ను భూమ్మీద నుంచి నియంత్రించడం కూడా కష్టమే. అంటే ల్యాండర్ చంద్రుడి మీద దిగేటప్పుడు ఏదైనా అవరోధం ఏర్పడితే... అది భూమ్మీదకు దానికి సంబంధించిన సమాచారాన్ని రేడియో సిగ్నళ్ల రూపంలో పంపడానికి కనీసం మూడు సెకెన్లు పడుతుంది. ఇక దానికి ప్రతిగా మనం ఇచ్చే సిగ్నల్... దానిని చేరాలంటే మరో మూడు సెకెన్లు పడుతుంది. అంటే వెరసి ఆరు సెకెన్లు పడుతుంది.
అంటే ఈలోగానే ల్యాండర్ తనకెదురైన అవరోధాన్ని దాటి వెళ్లలేకపోతే... అది ప్రమాదానికి గురి కావచ్చు. గతంలో కూడా ఇజ్రాయెల్ పంపిన ల్యాండర్ కూడా.. చంద్రుడి మీద దిగే సమయంలోనే నియంత్రణ కోల్పోయి క్రాష్ ల్యాండ్ అయ్యింది. ఈ ప్రయోగంలో ల్యాండర్ క్రాష్ ల్యాండ్ అయితే... దాని పరికరాలు విఫలమవుతాయి. ఈ ప్రమాదాన్ని నివారించడానికి ఇస్రో వినూత్న ఆలోచనలు చేసింది. ల్యాండర్ చంద్రుడి మీద దిగేటప్పుడు తనంతట తానే నిర్ణయాలు తీసుకునేలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాయంతో ప్రోగ్రామ్ చేసింది ఇస్రో.
చంద్రయాన్‌లో ఏమున్నాయి..?
చంద్రయాన్ 2లో ప్రధానంగా మూడు భాగాలున్నాయి. మొదటిది చంద్రుడి కక్ష్యలోనే తిరిగే ఆర్బిటర్. రెండోది జాబిల్లి మీద దిగే ల్యాండర్. దీనిపేరే విక్రమ్. ఇక మూడోది ఆ ల్యాండర్ నుంచి బయటకొచ్చి చంద్రుడిపై కలియ తిరిగే రోవర్.. దీని పేరు ప్రజ్ఞాన్. ఈరోవర్ ను పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారు చేసింది.
వీటిల్లో మొత్తం ఇస్రో 13 పరిశోధన పరికరాలు అమర్చింది. ఇప్పటి వరకూ చంద్రుడి మీదకు నాసాతో సహా వెళ్లిన ల్యాండర్లన్నీ... చంద్రుడి మధ్య రేఖ మీదే దిగాయి. కానీ ఇప్పటివరకూ ఏ అంతరిక్ష నౌక కూడా చంద్రుడి ధృవం సమీపంలో దిగలేదు. కానీ ఇస్రో మాత్రం ఆ సాహసం చేసింది
ల్యాండర్ చంద్రుడి మీద దిగి, పరిశోధనలు చేసేలా ఇస్రో అంతా ముందుగానే ప్రోగ్రామ్ చేసింది. ఒక్కసారి చంద్రయాన్‌లో ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దిగిన తర్వాత, అందులో వివిధ రకాల సెన్సర్లు చంద్రుడిపై పరిశోధనలు చేసి, ఆ సమాచారాన్ని భూమ్మీదకు పంపేలా ఏర్పాట్లు చేశారు. ఇక ల్యాండర్ నుంచి బయటకు వచ్చే రోవర్ ప్రజ్ఞాన్... చంద్రుడి మీద తిరుగుతూ... అక్కడి నేలను విశ్లేషించడంతో పాటు, మరిన్ని పనులు చేస్తుంది.
చంద్రయాన్ 2 ప్రయోగం విజయవంతం చేయడం ద్వారా.. ఇలా చంద్రుడి మీద వాహకనౌకను సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుంది. వాస్తవానికి చంద్రయాన్ 1 ప్రయోగంలోనే ఆర్బిటర్ తో పాటు.. మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ అనే పరికరాన్ని చంద్రుడి ఉపరితలం మీద క్రాష్ ల్యాండ్ చేసింది ఇస్రో.
దీని ద్వారా... చంద్రుడి మీద దిగడానికి ఎలాంటి పరిస్థితులు అవసరమన్నది తెలుసుకుంది. ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ కి నాలుగు వైపులా భారతీయ జెండాను ముద్రించింది. ఈ మూన్ ఇంపాక్ట్ ప్రోబ్ ఇచ్చిన సమాచారంతోనే... ఇస్రో చంద్రుడి మీద నీటి జాడల్ని కనుగొంది. ఇప్పుడు చంద్రయాన్ 2 ద్వారా మరింత సమాచారంతో పాటు, భవిష్యత్ అంతరిక్ష ప్రయోగాల్ని మరో మెట్టు ఎక్కించనుంది ఇస్రో.
ఇవి కూడా చదవండి:
- చంద్రుడిపై దిగడానికి అపోలో మిషన్‌కు 4 రోజులు పడితే, చంద్రయాన్-2కు 48 రోజులెందుకు
- శ్రీహరి కోట నుంచి అంతరిక్షంలోకి మనిషిని పంపడానికి భారత్ సిద్ధంగా ఉందా?
- ఇస్రో: 'మానవ సహిత వ్యోమనౌక' ప్రాజెక్ట్ సారథి లలితాంబిక
- రాకెట్లను శ్రీహరి కోట నుంచే ఎందుకు ప్రయోగిస్తారు?
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- భారత్ సున్నాను ఎలా ఆవిష్కరించింది?
- చంద్రయాన్-2: చంద్రుడి మీద దిగబోయే భారతదేశ అంతరిక్షనౌక ఇదే
- వ్యోమగాములను సురక్షితంగా కిందకు తెచ్చే శక్తి భారత్ సొంతం
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)