వరదల్లో చిక్కుకుపోయిన మళయాల నటి మంజువారియర్.. హిమాచల్ ప్రదేశ్ వరదల్లో 24 గంటల్లో 22 మంది మృతి

హిమాచల్ ప్రదేశ్‌లో భారీ వర్షాలు, వరదల కారణంగా 24 గంటల్లో 22 మంది చనిపోయారని ముఖ్యమంత్రి జైరామ్ ఠాకూర్ మంగళవారం చెప్పారని వార్తాసంస్థ ఏఎన్ఐ తెలిపింది.

సిమ్లా జిల్లాలో మరో ఇద్దరు గల్లంతయ్యారు. ఈ రుతుపవన కాలంలో మొత్తం 43 మంది చనిపోయారని, ఇది తీవ్ర ఆందోళనకరమని సీఎం ఠాకూర్ తెలిపారు.

హిమాచల్ వర్షాలు, వరదలతో కాజా ప్రాంతంలో చిక్కుకుపోయిన మంత్రి రామ్‌ లాల్ మార్కండను హెలికాప్టర్లో రాజధాని సిమ్లాకు తరలించారని ఏఎన్ఐ తెలిపింది. లాహౌల్ అండ్ స్పీతి జిల్లాలో కాజా ఉంది.

భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో లాహౌల్ అండ్ స్పీతి జిల్లాలో రామ్ లాల్ మూడు రోజులపాటు చిక్కుకుపోయారు.

ఆగస్టు 14 నుంచి 16 వరకు లాహౌల్‌లో ఉన్నానని, 16న స్పీతికి చేరుకున్నానని, మూడు రోజలపాటు భారీ వర్షాలు పడ్డాయని, కొన్ని ప్రాంతాల్లో పెద్దయెత్తన మంచు కూడా కురిసిందని, దీంతో అన్ని రోడ్లూ మూసుకుపోయాయని మంత్రి చెప్పారు.

మరోవైపు మళయాల సినీ నటి మంజు వారియర్, ఆమెతో పాటు 30 మంది సినీ బృందం చత్రూ ప్రాంతంలో వరదల్లో చిక్కుకుపోయారు. అయితే, వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు, నాయకులు ప్రయత్నించినా వారు అంగీకరించలేదని.. తామున్న ప్రదేశంలో ఇబ్బంది లేదని, సినిమా చిత్రీకరణ పూర్తయిన తరువాత వస్తామని చెప్పారని అధికారులను ఉటంకిస్తూ బీబీసీ పంజాబీ ప్రతినిధి అరవింద్ ఛాబ్రా తెలిపారు.

చంద్రా తాల్‌లో గత కొద్ది రోజుల్లో ఎనిమిది మిల్లీమీటర్ల మంచు కురిసిందని, అక్కడి నుంచి దాదాపు 127 మందిని కాపాడామని రామ్ లాల్ తెలిపారు.

లాహౌల్ అండ్ స్పీతి జిల్లాలో ఇప్పటికీ 300 నుంచి 400 మంది చిక్కుకుపోయి ఉన్నారని, కుండపోత వానలతో ప్రధానమైన లింక్ రోడ్లలో రాకపోకలు సాధ్యం కావడం లేదని ఆయన వివరించారు.

గత మూడు రోజుల్లో కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సుమారు రూ.574 కోట్ల నష్టం వాటిల్లినట్లు అంచనా వేస్తున్నామని సీఎం ఠాకూర్ చెప్పారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)