You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ల వివాదం... ఆ కెమేరాల వాడకంలోని నిబంధనలేంటి?
- రచయిత, వి. శంకర్
- హోదా, బీబీసీ కోసం
ఆంధ్రప్రదేశ్‌లో డ్రోన్ కెమెరాల వాడకంపై పాలక, ప్రతిపక్షాల మధ్య వివాదం నెలకొంది. ఈ అంశంపై సోషల్ మీడియాలోనూ చర్చ సాగుతోంది.
తన నివాసం పరిసరాల్లో డ్రోన్ కెమెరాల వినియోగంపై మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఇప్పటికే అభ్యంతరం చెప్పారు. చంద్రబాబు భద్రతపై తమకు అనుమానాలు ఉన్నాయంటూ రాష్ట్ర గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్‌కు టీడీపీ ఫిర్యాదు చేసింది.
కోర్టులో కేసు దాఖలు చేయబోతున్నట్టు టీడీపీ నాయకులు ప్రకటించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి మీద కూడా కేసు వేస్తామని చెబుతున్నారు.
గుంటూరు రేంజ్ డీఐజీకి కూడా వారు ఫిర్యాదు చేశారు.
టీడీపీ నేతల తీరును పాలక వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎద్దేవా చేస్తోంది.
డ్రోన్ కెమెరాలతో చిత్రీకరణపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఆందోళనకు దిగిన టీడీపీ నేతలపై పోలీసులు ఏడు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
వివాదం ఎక్కడ మొదలైంది?
కృష్ణా నదికి వరదలు ఉప్పొంగడంతో తీర ప్రాంతాలు జలమయమయ్యాయి. అనేక చోట్ల ఇళ్లల్లోకి వరద నీరు చేరింది. మూడు రోజుల పాటు వరద ప్రవాహంతో అనేక గ్రామాలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి.
కృష్ణా కరకట్ట మీద చంద్రబాబు నివాసముంటున్న లింగమనేని ఎస్టేట్స్ భవనం అతి సమీపానికి వరద నీరు చేరింది. అవుట్ హౌస్ దాదాపు జలమయమైంది. ఆ సందర్భంగా చంద్రబాబు ఇంటికి సమీపంలో ఆగస్టు 15,16 తేదీల్లో డ్రోన్ కెమెరాల సహాయంతో ఫొటోలు, వీడియోలు చిత్రీకరించారు. వాటిని పలు మీడియా సంస్థలకు అందించారు.
'హైసెక్యూరిటీ జోన్'లో ఉన్న తన నివాసంపై డ్రోన్లు తిరగడాన్ని చంద్రబాబు తప్పుబట్టారు. 16వ తేదీ ఉదయాన్నే ఆయన పోలీసులతో మాట్లాడారు. తన అభ్యంతరం తెలిపారు. ఆ వెంటనే మీడియాలో పలు రకాల కథనాలు వచ్చాయి.
చంద్రబాబు భద్రతకు సమస్యలు తీసుకొచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని ఆరోపిస్తూ- టీడీపీ కార్యకర్తలు ఆందోళన చేపట్టారు. డ్రోన్ కెమెరాలు వాడుతున్నవారిని నిర్బంధించి, పోలీసులకు అప్పగించారు. అప్పుడు పోలీసులు, టీడీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకొని చివరకు ఉండవల్లి ప్రాంతంలో ఉద్రికత్తకు దారితీసింది.
కొన్ని చోట్ల ఆంక్షలు, కొన్ని చోట్ల అనుమతి
భారత్‌లో డ్రోన్ల వినియోగాన్ని కొన్ని ప్రాంతాల్లో నిషేధించారు. మరికొన్ని చోట్ల ఆంక్షలు ఉన్నాయి. మిగిలిన ప్రాంతాల్లో మాత్రం అనుమతులున్నాయి. 2017 నవంబరులో పౌర విమానయాన డైరెక్టరేట్ జనరల్(డీజీసీఏ) రూపొందించిన నిబంధనల ప్రకారం డ్రోన్లను ఐదు కేటగిరీలుగా విభజించారు. వాటిలో నానో, మైక్రో రకాల డ్రోన్లను అత్యధికంగా వాడుతున్నారు.
డ్రోన్లు వినియోగించాలంటే ఏం కావాలి?
- శిక్షణ పొందిన ఆపరేటర్
- వినియోగానికి 24 గంటల ముందు స్థానిక పోలీసుల అనుమతి
- దేశ సరిహద్దులకు 25 కిలోమీటర్ల పరిధిలో వినియోగించకూడదు.
- విమానాశ్రయాలకు ఐదు కిలోమీటర్లు, కేంద్ర హోం శాఖ గుర్తించిన వ్యూహాత్మక ప్రాంతాలకు 500 మీటర్ల పరిధిలోనూ వాడకూడదు.
- భారత్‌లో విదేశీయులు డ్రోన్లు వినియోగించకూడదు.
నిబంధనలకు విరుద్ధంగా డ్రోన్లు వినియోగిస్తే ఐపీసీ సెక్షన్లు 287, 336, 337, 338లతోపాటు ఎయిర్‌క్రాఫ్ట్ చట్టం 1934 కింద శిక్షార్హులు.
చంద్రబాబు ఇంటి పరిసరాల్లో డ్రోన్ కెమెరాలను వరద నియంత్రణ, పరిస్థితి పర్యవేక్షణ కోసమే ఏపీ నీటిపారుదల శాఖ ఆధ్వర్యంలో వినియోగించినట్లు మంత్రి అనిల్ కుమార్ యాదవ్ ప్రకటించారు.
రాజకీయం వద్దన్న డీజీపీ గౌతమ్ సవాంగ్
డ్రోన్లు వినియోగిస్తుండటంపై స్థానిక పోలీసులకు సమాచారం లేకపోవడం వల్లే సమస్య ఉత్పన్నమైందని డీజీపీ గౌతమ్ సవాంగ్ మీడియాకు తెలిపారు.
"వరద ఉద్ధృతిని అంచనా వేసేందుకు నీటిపారుదల శాఖ డ్రోన్ కెమెరాలు ఉపయోగించిందని, దీనికి సంబంధించిన సమాచారం స్థానిక పోలీసులకు అందకపోవడంతో కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది. ఇందులో ఎలాంటి కుట్రా లేదు. దీనిని రాజకీయం చేయొద్దు. అధికారుల మధ్య సమన్వయం లేకే సమస్య వచ్చింది. ఇకపై డ్రోన్ ఉపయోగించాలంటే స్థానిక పోలీసుల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలనే ఆదేశాలు ఇచ్చాం" అని ఆయన చెప్పారు.
చంద్రబాబు అభ్యంతరం విచిత్రం: మంత్రి అనిల్
టెక్నాలజీ తానే కనిపెట్టానని చెప్పుకొనే చంద్రబాబు డ్రోన్లకు అభ్యంతరం చెప్పడం విచిత్రంగా ఉందని మంత్రి అనిల్ వ్యాఖ్యానించారు.
"కృష్ణా కరకట్టకు ఇరు వైపులా పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాం. అందుకు డ్రోన్లు ఉపయోగపడ్డాయి. పదేళ్ల తర్వాత 8.1 లక్షల క్యూసెక్కుల నీరు ప్రకాశం బ్యారేజ్ నుంచి వెళ్ళింది. అయినా ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తూ, నష్టం నివారించగలిగాం" అని ఆయన బీబీసీతో చెప్పారు.
చంద్రబాబు రక్షణలో రాజీపడేది లేదు: అచ్చెన్నాయుడు
అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ ఉండే మాజీ సీఎం నివాసాన్ని డ్రోన్ కెమెరాలతో ఎలా ఫోటోలు తీస్తారని టీడీపీ నేతలు అధికారులను ప్రశ్నిస్తున్నారు. దీనికి ముందు అనుమతి తీసుకోరా అని అడుగుతున్నారు.
చంద్రబాబు నివాసంపై డ్రోన్ల వినియోగం విషయంలో న్యాయపోరాటం చేస్తామని, ప్రైవేటు కేసు వేయాలని నిర్ణయించినట్టు మాజీ మంత్రి అచ్చెన్నాయుడు బీబీసీతో చెప్పారు.
"ముఖ్యమంత్రి జగన్‌పైనా కేసు వేస్తున్నాం. డ్రోన్లు ఎగురవేస్తూ పట్టుబడిన వ్యక్తి, సీఎం జగన్ ఇంట్లో ఉంటున్న కిరణ్ అదేశాల మేరకే చిత్రీకరించానని ఇచ్చిన వాంగ్మూలం ఉంది. కోర్టులో కేసు వేసి సమగ్ర దర్యాప్తు కోరతాం. చంద్రబాబు రక్షణ విషయంలో రాజీపడేది లేదు" అని ఆయన చెప్పారు.
డ్రోన్‌తో ఫొటో తీస్తే హత్యకు కుట్ర పన్నినట్టా?: విజయసాయిరెడ్డి
చంద్రబాబు నివాసంపై డ్రోన్ కెమెరా ఫొటో తీస్తే ఆయన హత్యకు కుట్ర పన్నినట్టవుతుందా అని వైసీపీ ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ప్రశ్నించారు.
పరువు గంగ పాలవుతుందని ప్రకాశం బ్యారేజీ గేట్లు తెరవక ముందే సారు ఇంటి నుంచి హైదరాబాద్ పారిపోయారని చంద్రబాబునుద్దేశించి ఆయన ట్విటర్‌లో ఆరోపించారు.
విలులైన వస్తువులన్నీ తరలించారని, చివరకు కృష్ణా నది కావాలనే ప్రవాహాన్ని పెంచుకుంటోందని నిందించేట్టున్నారని విజయసాయి వ్యాఖ్యానించారు.
ఇవి కూడా చదవండి:
- అమెజాన్ ఆదివాసి తెగ: బ్రెజిల్ ప్రభుత్వంతో పోరాడుతున్న ఈ తెగ జనాభా 120 మాత్రమే
- ప్రపంచబ్యాంకు బాటలోనే ఏఐఐబీ.. రాజధాని ప్రాజెక్టు నుంచి వెనక్కు
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
- జెఫ్ బెజోస్: సెకండ్ హ్యాండ్ పుస్తకాలు అమ్ముకునే స్థాయి నుంచి అత్యంత ధనవంతుడయ్యారిలా
- పని చేయాలంటే విసుగొస్తోందా? పరిష్కారాలేమిటి?
- కశ్మీర్: మోదీ ఆర్టికల్ 370 రద్దు నిర్ణయానికి దేశంలో విస్తృతంగా మద్దతు ఎందుకు లభిస్తోంది?
- 'సైనిక విన్యాసాలు చేస్తూ శాంతి చర్చలా...' దక్షిణ కొరియాపై ఉత్తర కొరియా ఆగ్రహం..
- కశ్మీర్‌లోని లాల్ చౌక్‌లో 1992లో ఎగిరిన భారత జెండా.. అప్పడు మోదీ పాత్ర ఏంటి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)