You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాజస్తాన్- పెహ్లూ ఖాన్: ఆల్వార్ మూక హత్య కేసులో నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించిన కోర్టు
రాజస్తాన్‌లో పాడి రైతు పెహ్లూ ఖాన్‌ను కొట్టి చంపిన కేసులో మొత్తం ఆరుగురు నిందితులను న్యాయస్థానం బుధవారం నిర్దోషులుగా ప్రకటించింది.
వారికి వ్యతిరేకంగా ఆధారాలు లేవని ఆల్వార్‌లోని అదనపు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి సరితా స్వామి చెప్పారు.
నిందితుల్లో విపిన్ యాదవ్, రవీంద్ర కుమార్, కాలూరామ్, దయానంద్, యోగేశ్ కార్, భీమ్ రాఠీ ఉన్నారు.
2017 ఏప్రిల్ 1న ఆల్వార్ జిల్లాలో 55 ఏళ్ల పెహ్లూ ఖాన్‌ను స్వయం ప్రకటిత గోసంరక్షకులు తీవ్రంగా కొట్టారు.
ఆయన రెండు రోజుల తర్వాత ఆస్పత్రిలో ప్రాణాలు కోల్పోయారు.
హరియాణాలోని నూహ్ ప్రాంతానికి చెందిన పెహ్లూ ఖాన్ రాజస్తాన్ నుంచి తన ఆవులతో సొంతూరికి వెళ్తుండగా దిల్లీ-ఆల్వార్ జాతీయ రహదారిలోని బెహ్రోర్ సమీపాన ఈ దాడి జరిగింది.
నాడు పెహ్లూ ఖాన్ తన ఇద్దరు కొడుకులు ఇర్షాద్, ఆరిఫ్, మరో ఇద్దరు గ్రామస్థులతో కలిసి ఒక అద్దె వాహనంలో వెళ్తున్నారు.
రాజస్థాన్‌లో ఒక పశువుల సంతలో కొన్న ఆవులను ఆయన అందులో స్వగ్రామానికి తరలిస్తున్నారు.
నాటి మూక దాడిలో పెహ్లూ ఖాన్‌తోపాటు ఆయన ఇద్దరు కుమారులూ గాయపడ్డారు.
కొన్ని చెక్ పాయింట్లు దాటిన తర్వాత ఆరుగురు వ్యక్తులు మోటార్ సైకిళ్ల మీద తమను వెంబడిస్తున్నట్టు పెహ్లూ ఖాన్ తదితరులు గమనించారు.
ఈలోగా వారు పెహ్లూ ఖాన్ వాహనాన్ని దాటి ముందుకెళ్లి వారిని ఆపారు. ఆ తర్వాత దాడి జరిగింది.
దాడితో అపస్మారక స్థితిలోకి వెళ్లిన పెహ్లూ ఖాన్ చనిపోవడానికి ముందు కొద్దిగా స్పృహలోకి వచ్చారు. తనపై దాడికి పాల్పడిన ఆరుగురి పేర్లను వెల్లడించారు.
వారిని అరెస్టు చేయడానికి ముందే పోలీసులు పెహ్లూ ఖాన్, ఇతర బాధితులపై కేసు నమోదు చేశారు. అక్రమంగా ఆవులను తరలిస్తున్నారనేది వారిపై మోపిన అభియోగం.
ఇవి కూడా చదవండి:
- గోదావరి వరదలు: 12 రోజులుగా వరద ముంపులో ‘రంగస్థలం’ గ్రామం
- 'అమెజాన్ చాయిస్' లేబుల్ ఎలా ఇస్తారు?'
- మోదీ 'మ్యాన్ వర్సెస్ వైల్డ్'లో కనిపించడం వల్ల జిమ్ కార్బెట్కు వచ్చే లాభం ఏంటి...
- ఆర్టికల్ 370 రద్దుకు వ్యతిరేకంగా శ్రీనగర్‌లో నిరసనలు.. అలాంటిదేమీ లేదన్న ప్రభుత్వం
- కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలిగా సోనియా గాంధీ
- భారతదేశానికి స్వతంత్రం వచ్చినప్పుడు... మహాత్మాగాంధీ ఎక్కడ ఏం చేస్తున్నారు?
- షార్క్‌లు మనుషులపై ఎందుకు దాడులు చేస్తాయంటే...
- కశ్మీరీ యువతి డైరీలో ఆ అయిదు రోజులు
- కశ్మీర్: 'భారత్ మాతాకీ జై' అనే నినాదాలతో ఉన్న ఈ వీడియో ఎక్కడిది?- Fact Check
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)