You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
'భారత ఎడిసన్' శంకర్ ఆబాజీ భిసేను చరిత్ర విస్మరించిందా...?
- రచయిత, దిన్యార్ పటేల్
- హోదా, చరిత్రకారుడు, సౌత్ కరోలినా యూనివర్సిటీ
భారతదేశంలో అందరూ ఆయనను 'ఇండియా ఎడిసన్' అని ప్రశంసించేవారు.
అంతర్జాతీయ పెట్టుబడిదారులు ఆయన ఆవిష్కరణలు ప్రపంచవ్యాప్తంగా ప్రింటింగ్ పరిశ్రమలో విప్లవం తీసుకొస్తాయని భావించారు. ఆయనకు అప్పట్లో ప్రముఖ భారత జాతీయవాదుల సహకారం, ప్రశంసలు కూడా లభించాయి.
ఆ ప్రముఖుడే శంకర్ ఆబాజీ భిసే, ఈయన 19వ శతాబ్దంలో ఒక ప్రముఖ భారత ఆవిష్కర్త. కానీ, ఇప్పుడు చాలామందికి ఆయన గురించి తెలీదు.
భిసే ఏం చేశారు, ఆయనకు గుర్తింపు ఎందుకు మసకబారింది.
భారతదేశంలో శాస్త్రవేత్తలు, అన్వేషకులు, ఇంజనీర్లకు ఎలాంటి సంస్థలూ లేని కాలంలో భిసే ప్రముఖ ఆవిష్కర్తగా మంచి పేరు తెచ్చుకున్నారు.
ఆయన స్వయంగా శిక్షణ పొందారు. ఒక అనామకుడి నుంచి ఆవిష్కర్తగా ఎదిగారు. అయితే, తన మరణం తర్వాత ఆయన మళ్లీ అనామకుడుగా మిగిలిపోయారు.
చాలా దశాబ్దాల క్రితం బ్రూక్లిన్ న్యూస్ పేపర్‌తో మాట్లాడిన భిసె "ఆ అమెరికా మ్యాగజీన్‌లో వచ్చిన మెకానికల్ సమాచారానికి నేను చాలా రుణపడి ఉంటాను, దాని వల్లే నేను ఇవన్నీ నేర్చుకోగలిగాను" అన్నారు.
భిసే బాంబే(ప్రస్తుతం ముంబయి)లో పుట్టిపెరిగారు. ఆయన ఒక అమెరికా సైంటిఫిక్ మ్యాగజీన్ చదువుతూ గడిపేవారు. తర్వాత 20 ఏళ్ల వయసులో ఆయన సైంటిఫిక్ క్లబ్ తెరిచారు. అందులో గాడ్జెట్లు, మెషిన్లు తయారుచేసేవారు. వాటిలో టాంపర్ ప్రూఫ్ బాటిల్, ఎలక్ట్రానిక్ సైకిల్ కాంట్రాప్షన్స్, బాంబే సబర్బన్ రైల్వే వ్యవస్థ కోసం ఒక స్టేషన్ సిగ్నల్ లాంటివి ఉన్నాయి.
'బ్రిటిష్ ఇన్వెంటర్స్ జనరల్' నిర్వహించిన ఒక పోటీ గురించి విన్నప్పుడు 1890లో ఆయన ఒక ఘనతను సాధించారు. ఈ పోటీ కోసం ఆయన సామాన్ల బరువు తూచే వెయింగ్ మెషిన్ తయారుచేశారు.
లండన్ వెళ్లిన భిసే
ఈ పోటీకి ముందు ఒక ఉదయం భిసెకు వెయింగ్ మెషిన్ డిజైన్ ఐడియా వచ్చింది. ఆయన వెంటనే ఆ మెషిన్ డిజైన్ రూపొందించారు. బ్రిటన్‌కు చెందిన పోటీదారులందరినీ ఓడించి ఆ పోటీలో విజేతగా నిలిచారు.
ఆ తర్వాత బాంబే అధికారుల దృష్టి ఈ భారత ఆవిష్కర్తపై పడింది. వారు లండన్ వెళ్లి పెట్టుబడిదారుల కోసం ప్రయత్నించాలనుకున్న భిసెకు సహకరించారు.
"అనుకున్నది నెరవేరేవరకూ లేదంటే తన చేతిలో ఉన్న చివరి పౌండ్ ఖర్చు అయ్యేవరకూ తిరిగి దేశానికి వచ్చేది లేదు" అని భిసె బాంబేలో తన స్నేహితుల ముందు ప్రతిజ్ఞ చేశారు.
భిసే అసాధారణ కెరీర్‌కు అదే ప్రారంభం.
ఆయన భారత జాతీయ కాంగ్రెస్ బాంబే కార్యదర్శి దిన్షా వాచా నుంచి 'లెటర్ ఆఫ్ ఇంట్రడక్షన్' తీసుకుని లండన్ చేరుకున్నారు.
వాచా రాజకీయ నేతే కాదు, నైపుణ్యం ఉన్న పారిశ్రామికవేత్త కూడా. టెక్నాలజీ ప్రతిభ ఉన్నవారికి ఆయన ప్రాధాన్యం ఇచ్చేవారు.
వాచా ఇచ్చిన లెటర్ తీసుకుని లండన్ వెళ్లిన భిసె, దానిని దాదాబాయి నౌరోజీకి ఇచ్చారు. భిసె అంతర్జాతీయ పేటెంట్ల జాబితా అంతకంతకూ పెరగడం నౌరోజీని ఆకట్టుకుంది. భిసెతో ఒక ఒప్పందం చేసుకున్న నౌరోజీ ఆయనకు భారత జాతీయవాద ఎజెండా గురించి ఒక జాబితాను అందించారు.
భిసె ఉత్తర లండన్‌లో చలి, తేమ ఎక్కువగా ఉండే ఒక ప్రయోగశాలలో పనిచేయడం ప్రారంభించారు.
వరుస ఆవిష్కరణలు
భిసె ఒక ఎలక్ట్రానిక్ సైన్ బోర్డ్ డిజైన్ చేశారు. దానిని లండన్‌లోని క్రిస్టల్ ప్యాలెస్‌లో ప్రదర్శించారు. అంతే కాదు, దానిని సెంట్రల్ లండన్, వేల్స్, పారిస్ స్టోర్స్‌లో కూడా పెట్టారు.
భిసె దాదాబాయి నౌరోజీకి తన ఆవిష్కరణల గురించి చెప్పారు. వాటిలో కిచెన్ గాడ్జెట్, టెలిఫోన్, తలనొప్పి తగ్గించే డివైస్, స్వయంగా ఫ్లష్ అయ్యే టాయిలెట్ లాంటివి ఉన్నాయి.
ఆయన 1905లో 'ప్రొటోటైప్ పుషప్ బ్రా', 'బస్ట్ ఇంప్రూవింగ్ డివైస్' కూడా తయారు చేశారు. అయితే దాదాబాయి నౌరోజీకి వాటి గురించి చెప్పడానికి వెనకాడారు.
కానీ, భిసె ఆవిష్కరణల్లో అత్యంత ముఖ్యమైనది ప్రింటింగ్‌కు సంబంధించినవి. 'భిసోటైప్', 'టైప్‌కాస్టర్'. ఇవి ప్రింటింగ్ పరిశ్రమలో విప్లవం సృష్టించుండేవి.
ఆయన రూపొందించిన సాంకేతికతతో ప్రింటింగ్ చాలా చౌకగా, చాలా త్వరగా అయిపోతుంది. దీనిని వార్తాపత్రికలు, పుస్తకాలను ముద్రించడానికి ఉపయోగించేవారు. ఈ మెషిన్లు చాలా వేగంగా, చాలా సులభంగా ముద్రించేవి.
నౌరోజీ ఆ సమయంలో మీకు ఇంకా ఎక్కువ డబ్బు పెట్టుబడి పెట్టేవారు అవసరం అని భిసేకు చెప్పారు. ఆయన్ను తన స్నేహితుడు, బ్రిటన్ 'సోషలిజం పితామహుడు' హెన్రీ హిండ్‌మెన్ దగ్గరికి పంపించారు.
హిండ్‌మెన్ కార్ల్ మార్క్స్ శిష్యుడు. భారత వలసవాదం గురించి విమర్శించేవారు. పెట్టుబడిదారీ వ్యతిరేకి అయిన హిండ్‌మెన్ స్వయంగా ఒక ప్రముఖ పారిశ్రామికవేత్త. ఆయనకు ప్రింటింగ్ పరిశ్రమలో మంచి పట్టుండేది. ఆయన భిసోటైప్ కోసం 15 వేల పౌండ్లు సేకరిస్తానని మాటిచ్చారు.
భిసె కష్టాలు అక్కడి నుంచి మొదలయ్యాయి.
పెద్ద అవకాశం చేజారింది
హిండ్‌మెన్‌ను కలిసిన తర్వాత ప్రింటింగ్ రంగంలోనే ప్రముఖ కంపెనీ అయిన లినోటైప్ నుంచి వచ్చిన ఒక ఆఫర్‌ను భిసే తిరస్కరించారు. కంపెనీ ఆయనకు బిసోటైప్‌ను కోనుగోలు చేస్తామని అడిగింది. కానీ ఆయన హిండ్‌మెన్ మాటపై పూర్తి నమ్మకం ఉంచాడు.
కానీ, 1907లో భిసె కోసం నగదు సేకరించలేనేమో అని హిండ్‌మెన్‌కు అనిపించింది. మరో ఏడాది తర్వాత నౌరోజీ ఇచ్చిన నిధులు కూడా ఖర్చైపోయాయి.
1908 డిసెంబర్‌లో ఫండ్స్ అయిపోవడంతో భిసె నైరాశ్యంతో తన పనులన్నీ మధ్యలో ఆపేసి తిరిగి బాంబే వచ్చేశారు. ఆయన తన ప్రతిజ్ఞ చేసినట్లే 'ఆఖరి పౌండ్' ఖర్చు చేసిన తర్వాతే దేశానికి తిరిగొచ్చారు.
బాంబే రాగానే భిసేకు మరో షాక్ తగిలింది.
భిసోటైప్‌కు గుర్తింపు లభించలేదు
బాంబే వస్తున్నప్పుడు ఆయనతోపాటు స్టీమర్‌లో ప్రముఖ కాంగ్రెస్ నేత గోపాల కృష్ణ గోఖలే ఉన్నారు. ఆయన భిసె టైప్‌కాస్టర్ చూసి ఆశ్చర్యపోయారు.
గోఖలే బాంబేలో టాటా గ్రూప్‌కు చెందిన రతన్ టాటాను కలిశారు. భిసె కోసం ఫండ్ సేకరించారు. అయితే, 1917 నాటికి భిసె దగ్గర టాటా గ్రూప్ ఇచ్చిన ఫండ్ కూడా ఖర్చైపోయింది. కానీ అది భిసెకు అమెరికాలో కెరీర్ ఏర్పరచుకునే అవకాశం అందించింది.
కానీ భిసె తన 'భిసోటైప్'ను బాగా మార్కెటింగ్ చేసుకోలేకపోయారు. అయితే, న్యూయార్కులో ఆయన తన అయోడిన్ సొల్యూషన్ ద్వారా చాలా డబ్బు సంపాదించారు.
చివరి రోజుల్లో భిసె దృష్టి సైన్స్ నుంచి సూపర్ పవర్స్ వైపు మళ్లింది. ఆయన ఆవిష్కరణల్లో చివరిది 'స్క్రిప్ట్ టైప్‌రైటర్'. దానికి మెరుగైన వీజా బోర్డ్ ఉండేది. భిసోటైప్ వైఫల్యం ఈ 'భారతీయ ఎడిసన్' కెరీర్‌కు ముగింపుగా మారింది. ఆయన ఎవరికీ తెలీకుండా పోవడానికి బహుశా అది ఒక కారణం కావచ్చు.
అయినా భిసె వారసత్వంలోని ఒక కోణం మాత్రం చిరస్మరణీయంగా ఉండిపోయింది.
ఈ లోకాన్ని వదిలి వెళ్లేవరకూ తన మాజీ పెట్టుబడిదారుల వలసవాద వ్యతిరేక భావనలను భిసె సజీవంగా ఉంచారు.
లండన్‌లో జరిగిన ఎన్నో వ్యతిరేక ప్రదర్శనల్లో, సభలలో ఆయన నౌరోజీ, హిండ్‌మెన్‌తో కలిసి పాల్గొన్నారు. న్యూయార్క్‌లో ఆయన గాంధీ ఆలోచనలను సమర్థించారు. భారత జాతీయవాదులను స్వాగతించారు.
భిసే భారత్ నుంచి బ్రిటన్, అమెరికా వరకూ ప్రగతిశీల రాజకీయాలను విజ్ఞానంతో కలిపేశారు.
ఇవి కూడా చదవండి:
- అపోలో-11 మిషన్: చంద్రుడి మీదకు అమెరికా మనిషిని ఎందుకు పంపించింది...
- చంద్రయాన్ 2: చందమామపై ఎందుకింత మక్కువ
- చెన్నై వాటర్‌మ్యాన్: ఆయన నల్లా తీసుకోరు... నీళ్ళు కొనుక్కోరు
- శాంసంగ్ వాటర్ ప్రూఫ్ మొబైల్‌పై వివాదం.. కేసు వేసిన ప్రభుత్వం
- గురు గోల్వల్కర్ : 'విద్వేష' దూతా లేక 'హిందూ జాతీయవాద' ధ్వజస్తంభమా...
- అంతరిక్షం నుంచి సంపూర్ణ సూర్య గ్రహణం ఇలా ఉంటుంది
- అల్యూమినియం బ్యాట్: క్రికెట్ చరిత్రలో వివాదాస్పదమైన, క్రికెట్ నిబంధనలు తిరగరాసిన ఒక బ్యాట్ కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)