You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
"శ్రీదేవిది హత్యే… సహజ మరణం కానే కాదు": కేరళ మాజీ డీజీపీ - ప్రెస్ రివ్యూ
అందం, అభినయంతో వెండి తెరపై అతిలోక సుందరిగా కోట్లాది మంది ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసిన నటి శ్రీదేవి మరణించి ఏడాది దాటినా ఆమె మరణంపై సందేహాలు వ్యక్తమవుతూనే ఉన్నాయని 'ఆంధ్రజ్యోతి' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. శ్రీదేవిది హత్యేనని, ఆమె మరణంలో కుట్ర కోణం దాగి ఉందని తాజాగా కేరళ జైళ్ల శాఖ మాజీ డీజీపీ రిషిరాజ్ సింగ్ ఆరోపించారు. శ్రీదేవి 'మునిగి చనిపోయి ఉండకపోవచ్చు' అంటూ ఆయన ఓ దిన పత్రికకు వ్యాసం రాశారు. అందులో అనేక ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు.
శ్రీదేవి మరణానికి సంబంధించిన విషయాలను ఫోరెన్సిక్ నిపుణుడైన తన స్నేహితుడు ఉమాదత్తన్ తనతో పంచుకున్నారని వ్యాసంలో పేర్కొన్నారు.
''ఒక మనిషి ఎంత మద్యం మత్తులో ఉన్నా.. అడుగు లోతు ఉండే నీటి తొట్టెలో పడి చనిపోవడం అసాధ్యం. ఎవరైనా శ్రీదేవి కాళ్లను గట్టిగా ఒత్తి పట్టి.. తలను నీటిలో ముంచి ఉంటారు. అలా చేస్తే తప్ప ఆమె చనిపోయే అవకాశం లేదు'' అని ఉమాదత్తన్ తనతో చెప్పినట్లు రిషిరాజ్ సింగ్ పేర్కొన్నారు.
అయితే.. ఉమాదత్తన్ ఇటీవలే మరణించారని తెలిపారు.
గత ఏడాది ఫిబ్రవరి 24న దుబాయ్‌లో ఓ వేడుకకు హాజరైన శ్రీదేవి.. బాత్‌టబ్‌లో మునిగి మరణించిందని యూఏఈ ఫోరెన్సిక్ అధికారులు ప్రకటించిన విషయం తెలిసిందే.
శ్రీదేవి మరణంపై అప్పట్లోనే అనేక సందేహాలు వ్యక్తమయ్యాయి. శ్రీదేవి రా మందు తాగదని సుబ్రహ్మణ్య స్వామి అంటే, శ్రీదేవిది హత్యేనని ఢిల్లీ ఏసీపీ వేద్ భూషణ్ ఆరోపించారు.
తాజాగా కేరళ మాజీ డీజీపీ కూడా.. ఆమె ప్రమాదవశాత్తు చనిపోయి ఉండకపోవచ్చని, హత్య అయి ఉండవచ్చని డాక్టర్ ఉమా దత్తన్ తనతో అన్నట్లు ఆయన తన వ్యాసంలో పేర్కొన్నారు.
అయితే.. శ్రీదేవి మరణంపై వస్తున్న కుట్ర కోణాలను ఆమె భర్త, బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఖండించారు. ఇటువంటివి వస్తూనే ఉంటాయని, ఎటువంటి ఆధారాలూ లేని ఊహాజనిత వార్తలకు స్పందించాల్సిన అవసరం లేదని అన్నారు. ఇలాంటి మూర్ఖ వాదనలను ఎవరో ఒకరు పుట్టిస్తూనే ఉంటారన్నారు.
16న అర్ధరాత్రి చంద్రగ్రహణం.. దేశంలో అందరూ వీక్షించొచ్చు
ఈ నెల 16వ తేదీన అర్ధరాత్రి పాక్షిక చంద్రగ్రహణం సంభవించనున్నదని.. దాదాపు మూడు గంటలు సాగే ఈ చంద్రగ్రహణాన్ని దేశప్రజలందరూ వీక్షించవచ్చని శాస్త్రవేత్తలు చెప్తున్నారని 'నమస్తే తెలంగాణ' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. అరుణాచల్‌ప్రదేశ్‌లోని మారుమూల ప్రాంతాలు మినహా దేశంలోని ఏ ప్రాంతం నుంచైనా గ్రహణం ఆద్యంతం స్పష్టంగా కనిపిస్తుందని వారు పేర్కొన్నారు. ఈ ఏడాదిలో ఇదే చివరి చంద్రగ్రహణమని చెప్పారు.
16వ తేదీ అర్ధరాత్రి తర్వాత 12:12 గంటలకు చంద్రుడు భూమి ఉపచ్ఛాయలోకి ప్రవేశిస్తాడు. ఆ సమయంలో చందమామ చుట్టూ పలుచని నల్లటి పొర ఆవరించినట్టు కనిపిస్తుంది.
చంద్రుడు 1:31 గంటల సమయంలో భూమి ప్రచ్ఛాయలోకి ప్రవేశించడంతో గ్రహణం ప్రారంభమవుతుంది. ఉదయం 3 గంటల ప్రాంతంలో గరిష్ఠ గ్రహణం కనిపిస్తుంది. తర్వాత మెల్లిగా బయటికి రావడం ప్రారంభం అవుతుంది.
ఉదయం 4:30 గంటలకు ప్రచ్ఛాయ నుంచి బయటకు రావడంతో గ్రహణం పూర్తవుతుంది. ఉదయం 5:49 గంటలకు చందమామ భూమి ఉపచ్ఛాయ నుంచి బయటికి వస్తుంది.
జైలు బిర్యానీ.. కాంబో ధర రూ. 127.. ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేయొచ్చు
కేరళలోని వియ్యూరు సెంట్రల్ జైలు అధికారులు ఖైదీలతో నోరూరించే వేడి వేడి బిర్యానీలను తయారుచేయించి స్థానిక ప్రజలకు ఆన్‌లైన్‌లో అమ్మకానికి పెట్టే సరికొత్త ఆలోచనకు శ్రీకారం చుట్టారని 'సాక్షి' ఒక కథనంలో తెలిపింది.
ఆ కథనం ప్రకారం.. తొలి దశలో బిర్యానీ కాంబో ధరని 127 రూపాయలుగా నిర్ణయించారు. నాణ్యతకు నాణ్యత, రుచికరమైన బిర్యానీ అతి తక్కువ ధరలో అందుబాటులోకి రావడంతో కేరళలోని వియ్యూరు ప్రజలు జైలు బిర్యానీ కోసం ఎగబడుతున్నారు.
ఒక రోస్టెడ్ చికెన్ లెగ్ పీస్, 300 గ్రాముల బిర్యానీ, మూడు చపాతీలు, ఒక కప్ కేక్, సలాడ్, పచ్చడి, ఒక లీటర్ వాటర్ బాటిల్‌తో పాటు సంప్రదాయబద్ధంగా అరిటాకుని కూడా ప్యాక్ చేసి కాంబో ప్యాక్‌లో ఇస్తారు.
ఆన్‌లైన్ ఫుడ్ డెలివరీ సంస్థ స్విగ్గీతో ఒప్పందం చేసుకుని జైలు నుంచి పార్శిళ్లను వినియోగదారుల ముంగిళ్లలోకి చేర్చే ఏర్పాటు చేశారు జైలు అధికారులు. కేరళ జైళ్లలోని ఖైదీలు తయారు చేసిన వివిధ ఆహార పదార్థాలను ఫ్రీడం ఫుడ్ ఫ్యాక్టరీ ఎంటర్‌ప్రైజెస్ ద్వారా 2011 నుంచే అమ్మకానికి పెడుతున్నారు.
అయితే ఆన్‌లైన్‌లో అమ్మకాలు మాత్రం ఇదే తొలిసారి అని వియ్యూరు సెంట్రల్ జైలు సూపరింటెండెంట్ నిర్మలానందన్ నాయర్ వెల్లడించారు. 2011 నుంచి ఖైదీలు చపాతీలు తయారు చేసి అమ్మడం మొదలుపెట్టారు. ప్రస్తుతం 100 మంది ఖైదీలు రోజుకి 25,000 చపాతీలు, 500 బిర్యానీలు తయారు చేస్తున్నారు.
ఎస్‌బీఐ గుడ్‌న్యూస్.. ఆ ఛార్జీల ఎత్తివేత
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా గుడ్ న్యూస్ చెప్పిందని.. ఐఎంపీఎస్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ప్రకటించిందని 'ఈనాడు' ఒక కథనంలో పేర్కొంది.
ఆ కథనం ప్రకారం.. ఇంటర్నెట్, మొబైల్ బ్యాంకింగ్, యోనో యాప్ వినియోగదారులు ఆగస్టు 1 నుంచి ఈ ఛార్జీలు చెల్లించాల్సిన అవసరం లేదని ఎస్‌బీఐ ఓ ప్రకటనలో తెలిపింది.
రోజులో ఏ క్షణంలోనైనా డబ్బులు పంపేందుకు ఐఎంపీఎస్ ఉపయోగపడుతుది. ప్రస్తుతం రూ. వెయ్యి రూపాయల వరకు లావాదేవీలపై ఎస్‌బీఐ ఎలాంటి ఛార్జీలూ వసూలు చేయడం లేదు.
రూ. 1000 - 10,000 వరకు 1 + జీఎస్టీ, రూ. 10,001 - 1,00,000 వరకు రూ. 2 + జీఎస్‌టీ, రూ.1,00,001-2,00,000 వరకు లావాదేవీలపై రూ. 3 + జీఎస్టీ వసూలు చేస్తోంది.
ఇకపై ఈ ఛార్జీలను ఎస్‌బీఐ వసూలు చేయదు. గత నెల ఎన్‌ఈఎఫ్‌టీ, ఆర్‌టీజీఎస్ లావాదేవీలపై ఛార్జీలను ఎత్తివేస్తున్నట్లు ఆర్‌బీఐ ప్రకటించిన నేపథ్యంలో జులై 1 నుంచి ఎస్‌బీఐ వాటిపై ఛార్జీలను ఎత్తివేసింది.
ఇవి కూడా చదవండి:
- "ఇక్కడున్న ప్రతి మగవాడు మీతో సెక్స్ కోరుకుంటాడు"
- ఈ ఊరి బావి నీళ్ళు తాగితే కవలలు పుడతారా...
- దొరసాని: తెలంగాణ దొరతనానికి బలైన పేదోడి ప్రేమకథ -సినిమా రివ్యూ
- మోదీ-షాల కాలంలో కాంగ్రెస్: పునర్వైభవం కోసం కాదు, మనుగడ కోసం పోరాటం
- ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ 2019: జగన్ తొలి బడ్జెట్లో 30 ముఖ్యాంశాలు
- సెమీ ఫైనల్స్‌లో భారత జట్టు ఓటమిపై రవిశాస్త్రి ఈ ప్రశ్నలకు బదులివ్వగలరా...
- 'నందాదేవి' పర్వతారోహణలో చనిపోయినవారు తీసుకున్న చివరి వీడియో
- విమానం ఎగిరేముందు చక్రాల చాటున దాక్కున్నాడు, పైనుంచి కిందపడి మరణించాడు
- హైటెక్ వ్యవసాయం... వందేళ్లలో ఎంత మారింది?
- ఎస్సీఎస్టీ అట్రాసిటీస్ కేసులో మోజో టీవీ మాజీ సీఈవో రేవతి అరెస్ట్
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)