అంతర్జాతీయ క్రికెట్‌కు అంబటి రాయుడు గుడ్ బై, ప్రపంచ కప్‌లో చోటు దక్కకపోవడమే కారణమా?

భారత క్రికెటర్ అంబటి రాయుడు అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. అన్ని ఫార్మాట్ల నుంచి తాను రిటైర్ అవుతున్నట్లు రాయుడు బుధవారం వెల్లడించాడు.

తన రిటైర్మెంట్ గురించి రాయుడు బీసీసీఐకి లేఖ రాశాడు. రాయుడు ఇప్పటికే టెస్టుల నుంచి రిటైర్ అయ్యాడు. టీ20లు, వన్డేలపై పూర్తి స్థాయిలో దృష్టి సారించేందుకే తాను ఫస్ట్ క్లాస్ క్రికెట్ నుంచి వైదొలగుతున్నట్లు అప్పట్లో చెప్పాడు.

వరల్డ్ కప్ జట్టులో చోటు దక్కకపోవడం, అతని స్థానంలో విజయ్ శంకర్‌కు అవకాశం రావడంపై రాయుడు కొంత అసంతృప్తికి గురయ్యాడు.

"చాంపియన్స్ ట్రోఫీ తర్వాత మిడిల్ ఆర్డర్‌లో కార్తీక్‌తో సహా చాలామందిని ప్రయత్నించాం. రాయుడుకు చాలా అవకాశాలిచ్చాం. కానీ శంకర్ బౌలింగ్, బ్యాటింగ్, ఫీల్డింగ్... ఇలా మూడు విభాగాల్లో సరైన ప్రత్యామ్నాయంగా భావిస్తున్నాం. పరిస్థితులు అనుకూలిస్తే, శంకర్ ఓ ఆల్‌రౌండర్ పాత్ర పోషించగలడు. నాలుగో స్థానంలో శంకర్‌ను ఆడించాలనుకుంటున్నాం" అని జట్టును ప్రకటించే సమయంలో చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ ప్రకటించారు.

తనను పరిగణనలోకి తీసుకోకపోవడంతో రాయుడు, "వరల్డ్ కప్ మ్యాచ్‌లను చూడ్డానికి ఇప్పుడే కొత్త త్రీడీ కళ్లజోడు ఆర్డర్ చేశాను" అంటూ వ్యంగ్యంగా ట్వీట్ చేశాడు.

ప్రపంచ కప్‌లో శిఖర్ ధావన్‌, విజయ్ శంకర్‌లిద్దరూ గాయాల బారిన పడినా రాయుడుకు బీసీసీఐ నుంచి పిలుపు రాలేదు. వీళ్లద్దరి స్థానాల్లో రిషబ్ పంత్, మయాంక్ అగర్వాల్‌లకు సెలక్టర్లు చోటు కల్పించారు.

రాయుడు గత సంవత్సర కాలంగా భారత జట్టులో సభ్యుడిగా ఉన్నాడు. గత సంవత్సరం ఆసియా కప్ నుంచి రాయుడు నాలుగో స్థానంలో రాయుడు బ్యాటింగ్ చేస్తున్నాడు. ఆ తర్వాత కాలంలో ఓ సెంచరీ, నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు.

కానీ ఇటీవల కాలంలో ఆశించిన స్థాయిలో ఆటతీరు కనబర్చకపోవడంతో రాయుడుకు ప్రపంచ కప్‌లో చోటు దక్కలేదు.

రాయుడు మొత్తం 55 వన్డేలాడి 47.06 సగటుతో 1694 పరుగులు చేశాడు.

ఇవి కూడా చదవండి.

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)