You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ: ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి శాసనసభకు వచ్చిన జగన్
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు బుధవారం ఉదయం ప్రారంభమయ్యాయి.
ప్రొటెం స్పీకర్‌గా శంభంగి చిన వెంకట అప్పలనాయుడు బాధ్యతలు స్వీకరించి.. ఆ తరువాత ఎమ్మెల్యేలతో ప్రమాణ స్వీకారాలు చేయించారు.
కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం నుంచి ఎన్నికైన ముఖ్యమంత్రి జగన్ తొలుత ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
ఆ వెంటనే ప్రతిపక్ష నేత, చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఎన్నికైన చంద్రబాబు ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు.
అనంతరం ఉప ముఖ్యమంత్రులు అయిదుగురు, వారి తరువాత మిగతా మంత్రులు, ఎమ్మెల్యేలు వరుసగా ప్రమాణం చేశారు.
సీఎంగా హోదాలో జగన్
ఎమ్మెల్యేగా ఇంతకుముందు అసెంబ్లీకి హాజరైనప్పటికీ ముఖ్యమంత్రి హోదాలో జగన్ తొలిసారి శాసనసభకు వచ్చారు.
గురువారం కొత్త సభాపతిని ఎన్నుకుంటారు. తమ్మినేని సీతారాం పేరును ఇప్పటికే పాలక వైసీపీ స్పీకర్ పదవికి నిర్ణయించడంతో ఆయన ఎన్నిక ఏకగ్రీవం కానుంది.
14న సభను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగిస్తారు. ఆపై శని, ఆదివారాలు సభకు సెలవు దినాలు.
తర్వాత శాసన సభను కొనసాగించాలా వద్దా అన్న విషయాన్ని, శాసన సభ వ్యవహారాల సలహా కమిటీ సమావేశంలో నిర్ణయం తీసుకుంటారు.
'జగన్‌ను అవమానించింది మనసులో పెట్టుకోం.. చంద్రబాబును గౌరవిస్తాం'
ప్రస్తుతం శాసన సభలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు 151 మంది ఉండగా, తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు 23, జనసేనకు ఒక ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్నారు.
తొలి శాసన సభ సమావేశాలను ప్రజాస్వామ్య పద్దతిలో నిర్వహిస్తామని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు.
గత ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని పూర్తిగా వంచించిందని, ప్రతిపక్ష నేత జగన్ అసెంబ్లీలోకి వస్తున్నారంటే టీడీపీ వాళ్లు వ్యంగ్యంగా వ్యవహరించేవారని శ్రీకాంత్ అన్నారు. కానీ అవేవీ మనసులో పెట్టుకోకుండా ప్రతిపక్ష పార్టీకి సముచిత గౌరవం ఇస్తామని ఆయన అన్నారు.
''ఉదయం 10:30గంటలకు అందరూ అసెంబ్లీలో హాజరవుతారు. 11 గంటల ప్రాంతంలో ముఖ్యమంత్రిగా జగన్మోహన రెడ్డి తొలిసారి అసెంబ్లీలోకి అడుగుపెడుతారు. 11:05 గంటలకు హౌస్ ప్రారంభమవుతుంది'' అని శ్రీకాంత్ రెడ్డి మీడియాతో అన్నారు.
ఎన్నికల సంధర్భంగా రాష్ట్రంలో చెలరేగిన ఘర్షణల్లో ఇరుపార్టీలకు చెందిన ఇద్దరు కార్యకర్తలు మరణించారు. ఎన్నికల అనంతరం కూడా ఆ వేడి చల్లారలేదు. రాష్ట్రంలో పలు చోట్ల టీడీపీ, వైసీపీ కార్యకర్తల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో తొలి అసెంబ్లీ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.
శాసన సభలో ఎలా వ్యవహరించాలన్న అంశంపై ఇప్పటికే వైసీపీ, టీడీపీ వ్యూహరచన చేశాయి. మొదట్లో, కొత్త ప్రభుత్వానికి 6 నెలల సమయం ఇద్దామని టీడీపీ ఆలోచించిందని, ప్రస్తుతం తమ కార్యకర్తలపై జరుగుతున్న దాడుల నేపథ్యంలో మౌనం వీడాలని టీడీపీ భావిస్తున్నట్లు మీడియా కథనాలు పేర్కొన్నాయి.
‘వైసీపీ గెలిచిన మొదటి రోజు నుంచే లా అండ్ ఆర్డర్ సమస్య’
‘‘టీడీపీ శ్రేణులు లక్ష్యంగా రాష్ట్రంలో దాడులు జరుగుతున్నాయి. వైసీపీ గెలిచిన మొదటి రోజు నుంచే లా అండ్ ఆర్డర్ సమస్య ఉంది. ఈ విషయంపై అవసరమైతే ప్రస్తావిస్తాం. కానీ 6 నెలల పాటు ప్రభుత్వానికి సమయం ఇవ్వాలన్నది మా ఆలోచన. కానీ పరిస్థితులు డిమాండ్ చేస్తే, రాజకీయంగా ఎలా వ్యవహరించాలో అలా చేస్తాం. అసెంబ్లీలో జగన్‌ను అవమానించడం అంతా వారి ఊహ. చంద్రబాబు నాయుడికి ప్రజాస్వామ్యం మీద గౌరవం ఉంది. అసెంబ్లీలో ఆంధ్రప్రదేశ్ ప్రజల స్వరం వినిపిస్తాం’’ అని ఉరవకొండ టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ బీబీసీతో అన్నారు.
టీడీపీ నుంచి..
టీడీపీ శాసన సభ ఉపనేతలుగా అచ్చెన్నాయుడు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, రామానాయుడును చంద్రబాబు ఖరారు చేశారు.
శాసన సభలో టీడీపీ విప్‌గా వీరాంజనేయ స్వామి, శాసన మండలి పక్ష నేతగా యనమల రామకృష్ణుడు, ఉపనేతలుగా డొక్కా మాణిక్యవరప్రసాద్, సంధ్యారాణి, శ్రీనివాసులు, మండలి విప్‌గా బుద్దా వెంకన్నను పార్టీ నిర్ణయించింది.
ఇవి కూడా చదవండి
- ఏపీలో మద్య నిషేధం సాధ్యమేనా?.. అమెరికా నేర్పిన పాఠాలేంటి?
- "ప్రవాస భారతీయులను భారత్‌తో మమేకం చేసేది క్రికెటే"
- ఆంధ్రా సరిహద్దులో ‘ప్రపంచంలోనే అరుదైన’ ఆదివాసీ తెగ 'బోండాలు’
- కల్నల్ గడాఫీ: ఒకప్పటి అమెరికా పవర్ఫుల్ మహిళ వెంటపడిన నియంత
- ఆంధ్రప్రదేశ్ గవర్నర్ నియామకం ఎందుకంత వైరల్ అయింది
- ఆస్ట్రేలియాలో విరాట్ కోహ్లీ చెప్పిన మర్యాద కథ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)