గిరీష్ కర్నాడ్ మృతి: నటుడు, దర్శకుడు, జ్ఞానపీఠ్ పురస్కార గ్రహీత కన్నుమూత

ప్రముఖ నటుడు, చిత్ర దర్శకుడు, నాటక రచయిత, జ్ఞానపీఠ్ పురస్కార విజేత గిరీష్ కర్నాడ్ మృతిచెందారు. ఆయన వయసు 81 సంవత్సరాలు.

గిరీష్ కర్నాడ్‌కు కన్నడ, ఇంగ్లిష్ భాషల్లో మంచి పట్టుంది.

గిరీష్ కర్నాడ్ తన మొదటి నాటకం కన్నడలో రాశారు, తర్వాత దానిని ఇంగ్లిషులోకి అనువదించారు.

దీనితోపాటు ఆయన నాటకాల్లో 'యయాతిట, 'తుగ్లక్', 'హయవదన్', 'అంజు మల్లిగె', 'అగ్నిమతు మాలె' 'నాగమండల్' చాలా ప్రముఖమైనవి.

గిరీష్ కర్నాడ్‌కు 1994లో సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1974లో పద్మశ్రీ, 1992లో పద్మ భూషణ్ లభించాయి.

1972లో సంగీత నాటక అకాడమీ అవార్డు, 1992లో కన్నడ సాహిత్య అకాడమీ పురస్కారం, 1998లో జ్ఞానపీఠ్ పురస్కారం, 1998లో కాళిదాసు అవార్డుతో ఆయన్ను సత్కరించారు.

1970లో కన్నడ సినిమా సంస్కార్‌ నుంచి గిరీష్ కర్నాడ్ నటుడిగా ప్రయాణం ప్రారంభించారు. ఆయన మొదటి సినిమాకు రాష్ట్రపతి గోల్డెన్ లోటస్ పురస్కారం లభించింది.

ఆర్‌కే నారాయణ్ పుస్తకం ఆధారంగా బుల్లితెరపై వచ్చిన 'మాల్గుడి డేస్' సీరియల్‌లో ఆయన స్వామికి తండ్రి పాత్ర చేశారు.

1990లో మొదలైన సైన్స్ ఆధారిత టీవీ కార్యక్రమం 'టర్నింగ్ పాయింట్‌'ను హోస్ట్‌ చేశారు.

ఆయన ఆఖరి సినిమా కన్నడ భాషలోనే నిర్మించిన అప్నా దేశ్. ఇది ఆగస్టు 26న విడుదలైంది.

గిరీష్ కర్నాడ్ తెలుగులో చేసిన ఆఖరి సినిమా కొమరం పులి, స్కెచ్ ఫర్ లవ్ అనే సినిమా ఈ ఏడాది డిసెంబర్‌లో రిలీజ్ అవుతుంది.

గిరీష్ కర్నాడ్ తెలుగులో ధర్మచక్రం, శంకర్ దాదా ఎంబీబీఎస్‌లో నటించారు. ప్రేమికుడు లాంటి ఎన్నో డబ్బింగ్ సినిమాల్లో కనిపించారు.

బాలీవుడ్‌లో ఆయన ఆఖరి సినిమా టైగర్ జిందాహై(2017).

గిరీష్ కర్నాడ్ మృతిపై సినీ, రాజకీయ, ఇతర రంగాల ప్రముఖులు సోషల్ మీడియాలో నివాళులు అర్పించారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తన ట్విటర్‌లో గిరీష్ కర్నాడ్ మృతికి సంతాపం తెలిపారు.

"గిరీష్ కర్నాడ్‌ బహుముఖ ప్రతిభ అన్ని మాధ్యమాలలో గుర్తుండిపోతుంది. ఆయన తనకు నచ్చిన విషయాలపై చాలా ఉద్వేగంతో మాట్లాడేవారు. ఆయన రచనలు, రాబోవు తరాల వారికి గుర్తుండిపోతాయి" అన్నారు.

ప్రముఖ నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్ గిరీష్ కర్నాడ్ స్క్రిప్ట్స్ తనకు ప్రేరణగా నిలిచాయని అన్నారు.

"ఆయన రచయితలైన ఎంతోమంది అభిమానులను వదిలి వెళ్లిపోయారు. ఆయన రచనలు ఈ విషాదాన్ని కాస్త తట్టుకునేలా చేయగలవని ఆశిస్తున్నాను" అన్నారు.

ప్రముఖ నటి శ్రుతి హాసన్ 'మీ ప్రతిభ, మీ హాస్యం, చురుకైన మీ వివేకం మిస్ అవుతాం' అని ట్వీట్ చేశారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)