మసూద్ అజర్‌: ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించింది, తర్వాతేం జరుగుతుంది.

ఐక్యరాజ్యసమితి మసూద్ అజర్‌ను అంతర్జాతీయ ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్ దీనిని తమ దౌత్య విజయంగా చూస్తోంది.

ఈ విషయంపై స్పందించిన ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ తీవ్రవాదంపై భారత్ చేస్తున్న యుద్ధంలో దీనిని ఒక పెద్ద విజయంగా పేర్కొన్నారు.

మొట్టమొదట 2009లో ముంబయిలో జరిగిన 26/11 దాడుల తర్వాత ఐక్యరాజ్యసమితిలో ఈ ప్రతిపాదన ఉంచారు. కానీ భారత్‌ పదేళ్ల తర్వాత దానిని సాధించగలిగింది.

కానీ మసూద్ అజర్‌ను అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించడం వల్ల ఇప్పుడు ఏం జరుగుతుంది? ఏ మారుతుంది?

మూడు రకాల నిషేధం

"ఇలాంటి విషయాల్లో మూడు రకాల నిషేధం అమలవుతుంది. మొదట అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటించిన వ్యక్తి ఆస్తులను జప్తు చేస్తారు. ప్రపంచవ్యాప్తంగా అతడికి ఉన్న ఆస్తులు, ఆదాయం మూలాలను అడ్డుకుంటారు. అతడికి ఎట్టి పరిస్థితుల్లో ఆయుధాలు అందకుండా ప్రభుత్వం చూసుకోవాల్సి ఉంటుంది. అంటే అలా ప్రకటించిన వ్యక్తి దగ్గరకు ఆయుధాలు చేరకుండా పూర్తిగా అడ్డుకుంటారు" అని ఈ ప్రశ్నకు రక్షణ అంశాల నిపుణులు సుశాంత్ సరీన్ అన్నారు.

"అంతర్జాతీయ టెర్రరిస్టుగా ప్రకటిస్తే, ఆ వ్యక్తి తను ఉన్న ప్రాంతం వదిలి బయటకు వెళ్లలేడు. అంటే స్వదేశం నుంచి బయటకు వెళ్లకుండా అతడిని పూర్తిగా అడ్డుకుంటారు. ఈ మూడు నిషేధాలతో ఎలాంటి ఉగ్రవాదులకైనా తన తీవ్రవాద కార్యకలాపాలు అమలు చేయడం అసాధ్యం అవుతుంది."

"ఇలాంటి వారిపై దర్యాప్తు చేయాలని పాకిస్తాన్‌పై ఎప్పుడు ఒత్తిడి వచ్చినా అది అంతా కాగితాలపైనే చూపించేసేది. ఎప్పుడూ వాస్తవ విచారణ జరిగేది కాదు. కానీ ఇప్పుడు పాకిస్తాన్ దర్యాప్తు చేయకపోతే, తాము ఎందుకు ఐక్యరాజ్యసమితి ఆదేశాలను పాటించలేదో చెప్పాల్సి ఉంటుంది".

పాకిస్తాన్‌పై పెరగనున్న ఒత్తిడి

దీనిపై మాట్లాడిన జేఎన్‌యూ ప్రొఫెసర్ స్వరణ్ సింగ్ "ఒబామా అధ్యక్షుడుగా ఉన్నప్పుడు 2012లో హఫీజ్ సయీద్ గురించి పక్కా ఆధారాలు అందించిన వారికి (అతడికి శిక్ష వేసేలా) కోటి డాలర్ల బహుమతి ఇస్తామని అమెరికా ప్రకటించింది. కానీ హఫీజ్ సయీద్ పాకిస్తాన్‌లో బహిరంగంగా తిరగడమే కాదు, అక్కడ ఒక రాజకీయ పార్టీ కూడా స్థాపించాడు" అని చెప్పారు.

కానీ దీనిపై సుశాంత్ సరీన్ అభిప్రాయం వేరుగా ఉంది. ఆయన ఈ రెండు విషయాలనూ వేరువేరుగా చెప్పారు. "అమెరికా.. హఫీజ్ సయీద్ ఎక్కడున్నాడు అనేది తెలుసుకోవాలని ఆ బహుమతి ప్రకటించలేదు. అతడికి వ్యతిరేకంగా కోర్టులో తమ వాదన బలంగా వినిపించాలని, అతడిని అప్పగించేలా లేదంటే శిక్ష వేసేలా పాకిస్తాన్‌పై ఒత్తిడి తీసుకురావాలని అలా చెప్పింది. ఈ రెండు విషయాలు వేరు వేరు. ఈ నిషేధం ప్రభావం మసూద్ అజర్‌పై కచ్చితంగా ఉంటుంది" అన్నారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)