You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోక్‌సభ ఎన్నికలు 2019: అడవులను అమ్మేవాళ్లు కాదు, కాపాడేవాళ్లు కావాలి
- రచయిత, జాహ్నవీ మూలే, శరద్ బఢే
- హోదా, బీబీసీ ప్రతినిధులు
వాతావరణ మార్పులతో తలెత్తుతున్న కాలుష్యం, ప్రకృతి విపత్తుల కారణంగా భారత్‌లో ఏటా వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. లాన్సెట్ ప్లానెటరీ హెల్త్ ఇటీవల విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2017లో భారత్‌లో కేవలం వాయు కాలుష్యం కారణంగానే దాదాపు 12.4 లక్షల మంది ప్రాణాలు విడిచారు.
అయినప్పటికీ రాజకీయ చర్చల్లో మాత్రం పర్యావరణపరమైన అంశాలకు ఎప్పుడూ తగినంత చోటు దక్కడం లేదు. అందుకే, ముంబయిలో 27 స్వచ్ఛంద సంస్థలతో కూడిన ఒక బృందం ఈ ధోరణిని మార్చాలని ప్రయత్నిస్తోంది.
"యునైటెడ్ ఫర్ చేంజ్" అనే బ్యానర్‌తో ముంబయికి చెందిన కార్యకర్తలు, పౌరులు కలిసి ఒక 'గ్రీన్ మేనిఫెస్టో' తయారు చేశారు. రోజురోజుకీ పెరిగిపోతున్న పర్యావరణ సమస్యలపై దృష్టి పెట్టాలని రాజకీయ పార్టీలకు విజ్ఞప్తి చేశారు.
"పర్యావరణ సమస్యలపై ప్రభుత్వం దృష్టి పెట్టేలా చెయ్యాలనేదే మా ప్రయత్నం. పర్యావరణం మన జీవితాలకు సంబంధించింది. అందుకే రాజకీయ వాదప్రతివాదాల్లో ఇవి కూడా భాగం కావాలి" అని యూర్ ఎన్విరాన్‌మెంట్ సొసైటీ సభ్యుడు రోహిత్ జోషి అన్నారు.
అడవుల నరికివేతను అడ్డుకుని, పర్యావరణాన్ని కాపాడేందుకు నాయకులు కృషి చేయాలని ఆదివాసీ కార్యకర్త ఆశా భోయే కోరుతున్నారు.
"ప్రాజెక్టులు, పరిశ్రమల పేరుతో విచ్చలవిడిగా అడవులను నరికివేస్తున్నారు. అది ఎన్నో రకాల సమస్యలకు దారితీస్తోంది. పర్యావరణానికి హాని చేస్తున్న పరిశ్రమలను, ప్రాజెక్టులను అటవీ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తరలించాలి" అని ఆమె అంటున్నారు.
"మహాసముద్రాలు, కాల్వలు, మడ అడవులు, చిత్తడి నేలలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. మనకు ఆహారం, ఉపాధి లభించాలంటే వీటిని సంరక్షించుకోవడం చాలా అవసరం" అని స్థానిక మత్స్యకారుడు ఒకరన్నారు.
అభివృద్ధి పేరిట పర్యావరణాన్ని దెబ్బతీసే ఆలోచనలను, ప్రకృతి వనరుల మీద ఆధారపడి జీవించే ప్రజలను నిర్వాసితుల్ని చేసే విధానాలను పాలకులు విడనాడాలని స్వచ్ఛంద సంస్థలు కోరుతున్నాయి.
"నగరాన్ని బాగు చేయాలన్నా, పౌరులకు రక్షణ కల్పించాలన్నా ప్రకృతిని కాపాడాలి. ఇది ప్రభుత్వ బాధ్యత. కానీ, రాజకీయ పార్టీలేవీ దీన్ని తమ అజెండాలో భాగం చేయడం లేదు" అని అటవీ సంరక్షకులు అమృత భట్టాచార్య విమర్శించారు.
"ఎటు చూసినా అభివృద్ధి, అభివృద్ధి, అభివృద్ధి అనే నినాదమే వినిపిస్తోంది. కానీ, పర్యావరణ అంశం మాత్రం అజెండాలో అట్టడుగు భాగాన ఉంది" అని 'ఘర్ బచావో ఘర్ బనావో ఆందోళన్' సభ్యుడు బిలాల్ ఖాన్ ఆవేదన వ్యక్తం చేశారు.
మన వ్యవస్థ నిర్మాణంలో భాగంగా అడవులన్నీ ప్రభుత్వ ఆస్తిగా మారిపోయాయి. ప్రభుత్వాన్ని నడిపించేది రాజకీయ నాయకులు. కాబట్టి, వాళ్లు అడవుల్ని బేరానికి పెట్టేవాళ్లుగా కాకుండా, వాటి సంరక్షకులుగా మారాల్సిన అవసరం ఉందని ఈ స్వచ్ఛంద సంస్థల కార్యకర్తలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి
- మసీదుల్లో పురుషులతో కలిసి మహిళల నమాజ్‌కు అనుమతించాలంటూ పిటిషన్.. కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు
- IPL: విరాట్ కోహ్లీ నాయకత్వంలోని రాయల్ చాలెంజర్స్ ఎందుకు విఫలమవుతోంది
- మోదీ ఈ మహిళల కాళ్లు కడిగారు.. మరి, వారి జీవితాలు ఏమైనా మారాయా
- అభినందన్ బీజేపీకి మద్దతు పలికారా
- ఎడిటర్స్ కామెంట్: ఆంధ్రలో ఏ పార్టీది పైచేయి?
- ‘నల్లగా వంకాయలా ఉన్నావు.. నీకు మొగుడిని ఎలా తేవాలి అని వెక్కిరించారు’
- చదువుకునే రోజుల్లోనే 2 శతకాలు.. సమాజం వెలివేసినా 40 వితంతు వివాహాలు
- అత్యంత భారీ ఎయిర్పోర్ట్.. అంతా ఒక్క బిల్డింగ్‌లోనే
- సముద్రంలోని ఇంట్లో కాపురం చేస్తున్న ప్రేమజంటకు మరణ శిక్ష పడనుందా...
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)