You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వేలూర్: దేశంలోని తొలిసారి.. నగదు పంపిణీ కారణంగా రద్దయిన లోక్‌సభ ఎన్నిక ఇదే
ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంపిణీ చేస్తున్నారనే కారణంతో తమిళనాడులోని వేలూర్ లోక్‌సభ నియోజకవర్గంలో ఎన్నికలను రద్దు చేస్తూ భారత ఎన్నికల సంఘం నిర్ణయం తీసుకుంది.
నియోజకవర్గంలో గత కొద్ది రోజుల్లో భారీగా నగదు సీజ్ చేసిన నేపథ్యంలో ఈ ఉత్తర్వులు వెలువడ్డాయి.
వేలూర్ లోక్‌సభ స్థానానికి ఏప్రిల్ 18వ తేదీన పోలింగ్ జరగాల్సి ఉంది.
ఎన్నికల సంఘం అధికార ప్రతినిధి స్పందిస్తూ.. ‘‘ఈనెల 14వ తేదీన భారత ఎన్నికల సంఘం చేసిన ప్రతిపాదనలను రాష్ట్రపతి ఆమోదించారు. తమిళనాడులోని వేలూర్ పార్లమెంటరీ నియోజకవర్గం నుంచి లోక్‌సభకు సభ్యుడిని ఎన్నుకోవటాన్ని రద్దు చేశారు’’ అని చెప్పారు.
ఎన్నికల సంఘం నిర్ణయంతో.. భారత దేశంలో నగదు పంపిణీ కారణంగా రద్దయిన తొలి లోక్‌సభ ఎన్నిక వేలూర్‌దే అయ్యింది.
మార్చి 30వ తేదీన రాష్ట్ర మాజీ మంత్రి, డీఎంకే కోశాధికారి దురైమురుగన్ నివాసంపై ఆదాయపు పన్ను శాఖ దాడులు జరిపింది. ఆయన సన్నిహితుల నివాసాల్లోనూ ఏకకాలంలో దాడులు జరిగాయి. దురైమురుగన్ నివాసంలో ఐటీ డిపార్ట్‌మెంట్ రూ.10.5 లక్షలు సీజ్ చేసిందని వార్తలు వెలువడ్డాయి.
వేలూర్ నియోజకవర్గం నుంచి దురైమురుగన్ కుమారుడు కతిర్ ఆనంద్ పోటీలో ఉన్నారు. దీంతో దురైమురుగన్, ఆయన సన్నిహితుల ఇళ్లపై ఐటీ దాడులు చర్చనీయాంశం అయ్యాయి.
కతిర్ ఆనంద్ సన్నిహితుడి నివాసంలో 11 కోట్ల రూపాయలను ఐటీ శాఖ అధికారులు సీజ్ చేశారని దాడులు జరిగిన రెండు రోజుల తర్వాత వార్తలు వెలువడ్డాయి.
ఐటీ దాడుల నేపథ్యంలో దురైమురుగన్ మీడియాతో మాట్లాడుతూ.. ‘‘మేం దాచిపెట్టింది ఏమీ లేదు. ఎన్నికల్లో మమ్మల్ని ఎదుర్కోలేకపోతున్నవాళ్లే ఈ సమస్యలు సృష్టిస్తున్నారు’’ అన్నారు.
ఏప్రిల్ 10వ తేదీన తమిళనాడు పోలీసులు కతిర్ ఆనంద్, శ్రీనివాసన్, దామోదరన్‌లపై కేసు నమోదు చేశారు.
ఈ నేపథ్యంలోనే ఎన్నికల సంఘం వేలూర్ నియోజకవర్గంలో లోక్‌సభ సభ్యుడి ఎన్నికను రద్దు చేయాలని రాష్ట్రపతికి ప్రతిపాదన చేసింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్రపతి ఆమోదం తెలపటంతో, ఈసీ ఉత్తర్వులు వెలువడ్డాయి.
కాగా, వేలూర్ లోక్‌సభ పరిధిలోని అంబూర్, గుడియతం అసెంబ్లీ నియోజకవర్గాలకు ఈనెల 18వ తేదీన ఉప ఎన్నికలు జరగాల్సి ఉండగా.. ఈ ఉప ఎన్నికలు మాత్రం యధాతథంగా జరుగుతాయని ఎన్నికల సంఘం స్పష్టం చేసింది.
గతంలో మూడు అసెంబ్లీ ఎన్నికల్ని రద్దు చేసిన ఈసీ
తమిళనాడు రాష్ట్ర అసెంబ్లీకి 2016లో ఎన్నికలు జరిగినప్పుడు.. అరవకురిచి, తంజావూరు అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎన్నికను కూడా ఓటర్లను ప్రలోభపెట్టేందుకు డబ్బు పంచుతున్నారనే కారణంతో ఈసీ రద్దు చేసింది.
ముఖ్యమంత్రి జయలలిత మరణం తర్వాత 2017లో రాధాకృష్ణ నగర్ నియోజకవర్గానికి ఉప ఎన్నికలు ప్రారంభం కాగా, ఈ ఉప ఎన్నికల్లో కూడా ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు డబ్బులు పంచుతున్నారని ఎన్నికలను ఈసీ రద్దు చేసింది. తర్వాత మళ్లీ ఉప ఎన్నికలు జరిగాయి.
ఇవి కూడా చదవండి:
- మాయావతి, యోగిల ప్రచారంపై ఈసీ ఆంక్షలు
- స్ట్రాంగ్ రూముల్లో ఈవీఎంలకు భద్రత ఎంత...
- మోదీ వ్యతిరేక 'నగ్న నిరసన'ను తమిళ రైతులు ఎందుకు విరమించుకున్నారు...
- ఏపీలో ఏ నియోజకవర్గంలో ఎంత పోలింగ్ నమోదైంది?
- ఏపీలో అర్ధరాత్రి దాటాక కూడా పోలింగ్ ఎందుకు జరిగింది...
- పోలింగ్ శాతం మారినపుడల్లా ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఏం జరిగింది?
- ‘ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన స్థానాలకంటే ఎక్కువ స్థానాల్లో పోటీ చేస్తున్న ఏకైక పార్టీ బీజేపీ మాత్రమేనా?’
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)