ఆంధ్రప్రదేశ్: కాకినాడ స్మార్ట్ సిటీగా మారిపోయిందా?

    • రచయిత, రాజేశ్ పెదమళ్ల
    • హోదా, బీబీసీ కోసం

'పెన్షనర్స్‌ ప్యారడైజ్‌'గా పిలిచే కాకినాడ నగరం దేశ వ్యాప్తంగా అభివృద్ధి చేస్తున్న 100 స్మార్ట్‌సిటీల్లో ఒకటి. మరి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆశించిన స్థాయిలో నగరం అభివృద్ధి జరిగిందా?

స్మార్ట్‌సిటీల అభివృద్ధిలో భాగంగా కాకినాడ కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రూ.వెయ్యి కోట్లు వెచ్చించాల్సి ఉంది. అందులో, ఇప్పటివరకు రెండు ప్రభుత్వాల నుంచి రూ.400 కోట్లు విడుదలయ్యాయని నగర మేయర్‌ సుంకర్‌ పావని బీబీసీతో చెప్పారు.

నగరంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో కార్పొరేట్‌ స్కూళ్ల తరహాలో సౌకర్యాలు, వర్చువల్‌ తరగతులు, డిజిటల్‌ తరగతులు ఏర్పాటు చేశామన్నారు. పార్కుల సుందరీకరణ పనులు చేశామని మేయర్ చెప్పారు.

అయితే, కేవలం పైపై మెరుగులు దిద్దుతూ, ప్రజలు ఎదుర్కొంటున్న అసలైన సమస్యలను పాలకవర్గం పట్టించుకోవట్లేదని వైకాపా నేతలు ఆరోపిస్తున్నారు. రోడ్లపై రోడ్లు వేస్తున్నారు కానీ, మురికివాడలను పట్టించుకోవడంలేదని వైసీపీ నగర సమన్వయకర్త ద్వారంపూడి చంద్రశేఖర్‌ విమర్శించారు.

"పార్కులు సైతం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దాం. మహిళలకు, పురుషులకు వేర్వేరుగా వ్యాయామ కేంద్రాలు ఏర్పాటు చేశాం. ఖాళీ స్థలాలను క్రీడా ప్రాంగణాలుగా మార్చాం. కళాక్షేత్రం పేరుతో ఆడిటోరియం ఏర్పాటు చేశాం. మొత్తం 54 ప్రాజెక్టులు చేపట్టాం. అందులో 11 పనులు పూర్తయ్యాయి, మరో 33 జరుగుతున్నాయి, మిగతావి డీపీఆర్‌ దశలో ఉన్నాయి" అని మేయర్ పావని వివరించారు.

అయితే, మేయర్ చెబుతున్నట్లు పార్కులను తీర్చిదిద్దారు... కానీ, భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ లేకపోవడంతో దోమలు విపరీతంగా పెరిగిపోయాయని నగరానికి చెందిన గృహిణి భారతి అన్నారు. గతంలో ఉన్న ప్రభుత్వాలు కానీ, ప్రస్తుత సర్కారు కానీ ఆ సమస్యకు పరిష్కారం చూపలేదని ఆమె చెప్పారు.

'పార్కులు పచ్చగా ఉన్నప్పుడే ఆహ్లాదంగా ఉంటాయి. కానీ, సుందరీకరణ పేరుతో మొత్తం కాంక్రీట్‌ మయం చేశారు. ఉన్న రోడ్ల మీదే రోడ్లు వేసి దాన్నే నగర సుందరీకరణ అని చెబుతున్నారు. ఆ రహదార్ల నుంచి ఒక కిలోమీటర్‌ లోపలికి వెళితే మొత్తం మురికివాడలే. పైపై మెరుగులు దిద్ది మసిబూసి మారేడుకాయ చేస్తే స్మార్ట్‌ సిటీ అవుతుందా? నిధులు రెండేళ్ల క్రితమే వచ్చినా దాదాపు రూ.250 కోట్లు బ్యాంకులకే పరిమితం చేశారు. వైసీపీ పోరాటంతోనే ఆదరాబాదరాగా అభివృద్ధి పనులు చేపట్టారు. అందులోనూ భారీగా అవినీతి చోటు చేసుకుంది' అని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్‌ ఆరోపించారు.

నగరంలో ఇప్పటి వరకు ప్రజా రవాణా సౌకర్యం లేదని దానిపై దృష్టిపెట్టాలని స్థానికుడు విజయ్‌ సూచించారు.

స్మార్ట్‌సిటీ అభివృద్ధి మొదటి విడత పథకంలోనే కాకినాడ స్థానం సంపాదించుకుందని, ఇప్పుడు ప్రారంభించిన పనులన్నీ పూర్తయితే నగరం రూపురేఖలు మారిపోతాయని నగరపాలక సంస్థ కమిషనర్‌ రమేష్‌ అంటున్నారు.

"కాకినాడ స్మార్ట్‌సిటీ కార్పోరేషన్‌ ఏర్పాటు చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం. రూ.117కోట్లతో 11 ప్రాజెక్టులు ఇప్పటికి పూర్తి చేశామని, రూ.518 కోట్లతో 33 ప్రాజెక్టుల పనులు ప్రస్తుతం కొనసాగుతున్నాయి. 10 పనులు రూ.250 కోట్ల విలువతో డీపీఆర్‌ దశలో ఉన్నాయి.

మురికివాడల్లో సౌకర్యాలను మెరుగుపరిచేందుకు ప్రణాళికలు వేస్తున్నామని కమిషనర్ రమేశ్ చెప్పారు.

"10 మురికివాడలను ఎంపిక చేసి కనీస అవసరాలు కల్పించబోతున్నాం. ప్రస్తుతం నాలుగు చోట్ల పనులు జరుగుతున్నాయి. భూగర్భ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు, ఫైలెట్‌ ప్రాజెక్టుగా కొంత ప్రాంతాన్ని ఎంపిక చేసి చేయబోతున్నాం. ఎలక్ట్రికల్‌ బస్సులు తీసుకొచ్చి ప్రధానంగా నాలుగు రూట్లల్లో ఆర్టీసీ సాయంతో నడపాలని ప్రణాళిక ఉంది. ఇవన్నీ డీపీఆర్‌ దశలో ఉన్నాయి" అని వివరించారు.

నగరవాసి మిత్తిపాటి రమణ మాట్లాడుతూ... తాను చిన్నప్పటి నుంచీ నగరాన్ని చూస్తూనే ఉన్నానని, ప్రస్తుతం చాలా అభివృద్ధి చెందిందన్నారు. అయితే, పెరిగిన జనాభా అవసరాలకు అనుగుణంగా సౌకర్యాల కల్పన కూడా జరగాలని, చాలా ప్రాంతాల్లో తాగు నీటి సమస్య ఉందన్నారు.

అభివృద్ధి కేవలం రోడ్లు, లైటింగ్‌ ఏర్పాటుకే పరిమితం కాకుండా తాగునీరి సరఫరా, ప్రభుత్వ ఆసుపత్రుల్లో సౌకర్యాల కల్పన కూడా జరగాలని విశ్రాంత ఉద్యోగి సుబ్రహ్మణ్యం కోరుతున్నారు.

"470 చోట్ల ఉచిత వైఫై సౌకర్యం కల్పించాం. ప్రజలను అప్రమత్తం చేసేందుకు 30 ప్రధాన కూడళ్లలో ఒకేసారి సమాచారం చేరవేసే వ్యవస్థను కూడా ఏర్పాటు చేశాం. పెథాయి తుపాను వచ్చిన సమయంలో ఈ వ్యవస్థ ద్వారానే ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండేలా చేయగలిగాం. 350 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన వారిని కూడా ఆ కెమారాల్లో ఉండే ఫేస్‌ రికగ్నైజేషన్‌ ద్వారా గుర్తించొచ్చు. ఇలా ట్రాఫిక్‌ సక్రమంగా ఉండేలానూ, నేరాలు ట్రాక్‌ చేయడంలో ఉపయోగంగా ఉంటుంది" కమిషనర్ రమేశ్ వివరించారు.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)