You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జగన్ నామస్మరణ తప్ప.. ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదు - విజయమ్మ: ప్రెస్ రివ్యూ
ఎన్నికల్లో విలువలకు, విశ్వసనీయతకు పట్టం కట్టాలని యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ అన్నారని ఈనాడు తెలిపింది. వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి ఒక్క అవకాశం ఇవ్వాలని ఆమె ప్రజలను కోరారని చెప్పింది.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రచారానికి వెళ్లే ముందు శుక్రవారం ఆమె కడప జిల్లా ఇడుపులపాయలోని వైఎస్‌ఆర్ ఘాట్‌ను సందర్శించి నివాళులర్పించారు.
ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్ర ప్రజలకు ఏం చేస్తారో చెప్పే స్థితిలో లేరని విజయమ్మ విమర్శించారు. ఆయన ఇన్నాళ్లూ జగన్ నామజపం చేస్తున్నారే తప్ప ప్రజలకు చేసిందేమీ లేదన్నారు. వైఎస్‌ఆర్ పాలన రావాలంటే అది జగన్‌తోనే సాధ్యమని చెప్పారు.
''తెలుగుదేశం పార్టీ అరాచకాలకు దీటైన జవాబు చెప్పాలన్నా, ఈ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా జగన్‌ను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రజలందరికీ చేతులెత్తి నమస్కరించి చెబుతున్నా... ఒక్కసారి జగన్మోహన్‌రెడ్డికి అవకాశం ఇవ్వండి'' అని ఆమె కోరారు.
ఇదే రోజు విజయమ్మ ఇడుపులపాయ నుంచి ప్రకాశం జిల్లాకు బయల్దేరి కందుకూరు, కనిగిరి, మార్కాపురం పట్టణాల్లో రోడ్‌షోలు, బహిరంగ సభల్లో పాల్గొన్నారు.
సర్జికల్ స్ట్రైక్స్‌పై మోదీ డొల్ల ప్రచారం: కేసీఆర్
సర్జికల్ స్ట్రయిక్స్‌ను రాజకీయం చేసి ప్రయోజనం పొందాలని ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ నేతలు నీచ రాజకీయాలు చేస్తున్నారని టీఆర్‌ఎస్ అధ్యక్షుడు, తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విమర్శించారని ఆంధ్రజ్యోతి తెలిపింది.
మిర్యాలగూడలో శుక్రవారం జరిగిన ఎన్నికల బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు.
''యూపీఏ హయాంలో నేను కేబినెట్ మంత్రిగా ఉన్నా. అప్పుడు కూడా 11 సార్లు సర్జికల్ స్ట్రయిక్స్ జరిగాయి. సాధారణంగా సర్జికల్ స్ట్రయిక్స్ చేసిన విషయాన్ని బయటకు చెప్పరు. ఎందుకంటే అవి వ్యూహాత్మక దాడులు. కానీ ఇవాళ సర్జికల్ స్ట్రయిక్స్‌లో ఒక్క దెబ్బకు 300 మంది చచ్చిపోయారని ప్రధాని నరేంద్ర మోదీ డొల్ల ప్రచారం చేసుకుంటున్నారు. (జైషే మొహమ్మద్ చీఫ్) మసూద్ అజార్ ఏమో చీమ కూడా చావలేదని అంటున్నాడు. ఇదేం ప్రచారం!? స్ట్రయిక్స్ ఫొటోలు చూపించి ప్రచారం చేసుకుంటారా? ఇదేనా మీ పాలన? దేశాన్ని నడిపించేది ఇలానేనా?'' అంటూ మోదీని కేసీఆర్ ప్రశ్నించారు.
దేశంలో పేదరికం, రైతులకు గిట్టుబాటు ధరలు, దేశ ఆర్థిక వ్యవస్థ పురోగమించకపోవటం తదితర సమస్యలు అనేకం ఉన్నాయని, బీజేపీ, కాంగ్రెస్ వీటిపై ప్రచారం చేయడం లేదని ఆయన విమర్శించారు. ఇప్పటివరకు ఏలిన కాంగ్రెస్, బీజేపీల్లో ఈసారి మళ్లీ ఎవరు దిల్లీ గద్దెనెక్కినా ప్రజల జీవితాల్లో మార్పు రాదని వ్యాఖ్యానించారు.
ఎల్బీ స్టేడియం సభకు హాజరుకాని కేసీఆర్
మిర్యాలగూడ సభ తర్వాత కేసీఆర్ హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో టీఆర్‌ఎస్ బహిరంగ సభకు రావాల్సి ఉందని, ఆయన హాజరుకాలేదని 'నవ తెలంగాణ' తెలిపింది.
హైదరాబాద్, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి, చేవెళ్ల లోక్‌సభ నియోజకవర్గాలకు సంబంధించి ఎల్‌బీ స్టేడియంలో ఈ సభ ఏర్పాటు చేశారు.
సభకు జనం తక్కువగా వచ్చినట్టు తెలుసుకుని, కేసీఆర్ తాను రానని నాయకులకు చెప్పారని నవ తెలంగాణ రాసింది. జనసమీకరణ చేయడంలో విఫలమయ్యారని మంత్రులు, పార్టీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలపై కేసీఆర్ సీరియస్ అయ్యారని టీఆర్‌ఎస్ వర్గాలు చెబుతున్నాయని పేర్కొంది.
నాకూ సీమ పౌరుషం ఉంది: పవన్ కల్యాణ్
‘‘రాయలసీమ ప్రాంతానికి చెందిన వాడిని కానప్పటికీ నాకూ సీమ పౌరుషం ఉంది. ఆ పౌరుషాన్ని రెచ్చగొట్టవద్దు. మాట్లాడే ముందు ఆచితూచి మాట్లాడు’’ అని వైసీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్‌రెడ్డికి జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ హితవు పలికారని ఈనాడు తెలిపింది.
ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం ఆయన కర్నూలు జిల్లా నంద్యాల, ఆదోని, నందికొట్కూరు పట్టణాల్లో పర్యటించారు.
రాయలసీమలో పరిశ్రమలు పెట్టేందుకు పారిశ్రామికవేత్తలు భయపడుతున్నారని, అలాంటి వారికి భయం లేకుండా పాలన తీసుకొస్తామని పవన్ తెలిపారు.
ముచ్చుమర్రి ఎత్తిపోతల పథకాన్ని జాతీయ పథకంగా ప్రకటిస్తామని, రాయలసీమలోని కేసీ కాల్వకు ముచ్చుమర్రి పథకం నుంచి రెండు సార్లు నీరు అందేలా చూస్తామని ఆయన చెప్పారు.
జనసేన అధికారంలోకి వస్తే బనవాసిలో టెక్స్‌టైల్ పార్కును ఏర్పాటు చేస్తానని, చేనేతలకు స్పెషల్ హ్యాండ్‌లూమ్ జోన్ ఏర్పాటు చేస్తామని పవన్ హామీ ఇచ్చారు. ఆదోని జామియా మసీదుకు జాతీయ స్థాయిలో గుర్తింపు తీసుకురావడంతో పాటు రూ.100 కోట్లతో ఆదోని నుంచి కడప దర్గా వరకు పర్యాటకంగా అభివృద్ధి చేస్తామన్నారు.
ఆ మూడు పార్టీలది రాజకీయ రాక్షస క్రీడ: మల్లు భట్టి విక్రమార్క
టీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎంలు కలసి రాజకీయ రాక్షస క్రీడ ఆడుతున్నాయని, వీరందరి లక్ష్యం నరేంద్ర మోదీని తిరిగి ప్రధానిని చేయడమేనని తెలంగాణ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క ఆరోపించారని సాక్షి రాసింది.
శుక్రవారం హైదరాబాద్‌లో సీఎల్పీ సమావేశం అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.
''లోక్‌సభ ఎన్నికల్లో టీఆర్‌ఎస్ 16 సీట్లు గెలిచినా కేంద్రంలో చేసేదేమీ ఉండదు. 16 సీట్లు తెచ్చుకున్న పార్టీలను దిల్లీలో కనీసం పలకరించే వారుండరు. కేవలం ఎంపీల సంఖ్యను చూపి కేసుల నుంచి బయటపడొచ్చని కేసీఆర్ భావిస్తున్నారు'' అని భట్టి విమర్శించారు.
ఎమ్మెల్యేలను కొంటూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న కేసీఆర్‌కు ఈ పార్లమెంటు ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ప్రజలను కోరారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)