You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రాధారవిపై నయనతార ఆగ్రహం: ‘‘మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే‘‘
సినీనటి నయనతారపై నోరుజారిన నటుడు, డీఎంకే నేత రాధారవిపై ఆ పార్టీ సస్పెన్ష్ వేటు వేసింది.
నయనతార ముఖ్యపాత్ర పోషించిన 'కొలైయుదిర్ కాలమ్’ అనే తమిళ చిత్రం టీజర్ విడుదల సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాధారవి మాట్లాడుతూ, ‘‘ఎంజీఆర్, శివాజీ గణేషన్ లాంటి దిగ్గజాలతో నయనతారను పోల్చుతుంటే నాకు బాధగా ఉంది. నయనతార మంచి నటి అని నేను ఒప్పుకుంటా. కానీ, వాళ్లతో పోలికేంటి?. తనే సీత పాత్ర చేస్తుంది. హారర్ సినిమాలో దెయ్యాల పాత్రలూ చేస్తోంది. దేవుళ్ల పాత్రలను గౌరవప్రదమైన వాళ్లతోనూ నటింప చేయొచ్చు. ఎవరెవరితోనో తిరిగేవారితోనూ వేయించవచ్చు. నయనతారను మామూలుగా చూస్తే దెయ్యాలే పారిపోతాయి’’ అని అన్నారు.
రాధారావి వ్యాఖ్యలపై పలువురు నటులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నడిగర్ సంఘం కూడా తప్పుబట్టింది. వివాదం పెద్దదిగా మారడంతో పార్టీ నుంచి ఆయనను సస్పెండ్ చేస్తున్నట్లు డీఎంకే ఒక ప్రకటనలో తెలిపింది.
‘‘మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళే‘‘
తనపై చేసిన అభ్యంతర వ్యాఖ్యలపై స్పందించిన నయనతార పత్రికా ప్రకటన విడుదల చేశారు.
'ప్రేక్షకులు ప్రోత్సహిస్తుంటే రాధారవి లాంటి వారు మహిళలపై ఇలాంటి వ్యాఖ్యలు చేస్తూనే ఉంటారు. ఇలాంటి వ్యాఖ్యలు చేసేవారికే చప్పట్లు కొట్టేవారిని చూస్తేంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. సీతలాంటి దేవత పాత్రలో, దెయ్యం పాత్రలోనూ నేను నటిస్తూనే ఉన్నాను. నాకు తమిళ ప్రజలు మద్దతిస్తూనే ఉన్నారు. అభిమానులకు వినోదం పంచేందుకే ఇలాంటి పాత్రలు చేస్తాను. రాధారవిలాంటి వ్యక్తిని పార్టీ నుంచి తొలగించినందుకు డీఎంకేకు ధన్యవాదాలు. మీకు జన్మనిచ్చింది కూడా ఓ మహిళేనని రాధారవికి చెప్పాలనుకుంటున్నా’’ అని ఆ ప్రకటనలో పేర్కొన్నారు.
మరోవైపు, సహచర నటులు నయన్‌కు మద్దతుగా నిలిచారు.
‘‘విజయవంతమైన నటిని స్టేజ్ మీద రాధారవి తిడుతున్నారు. నడిఘర్ సంఘం ఎటువంటి చర్య తీసుకోవడం లేదు'' అని గాయని, డబ్బింగ్ ఆర్టిస్ట్ చిన్మయి ట్విటర్‌లో పేర్కొన్నారు.
‘‘ఇది మాటల్లో వర్ణించలేనిది. నటించడానికి అర్హతలను ఏంటో చెప్పాలని ఆయనను అడిగారా... వ్యక్తిత్వానికి సర్టిఫికేట్ ఇచ్చే సంఘానికి ఆయన అధ్యక్షుడిగా ఉన్నారా... ప్రముఖ నటికే ఈ పరిస్థితి ఎదురైతే మిగిలిన వారి పరిస్థితి ఏంటో..’’ అని సినీ నటి తాప్సీ పన్ను ట్వీట్ చేశారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)