You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
లోక్‌సభ ఎన్నికలు 2019: నరేంద్ర మోదీపై వారణాసి నుంచి 111 మంది తమిళ రైతుల పోటీ
ప్రధాని నరేంద్ర మోదీ ప్రత్యర్థులుగా 111 మంది తమిళ రైతులు వారణాసిలో నామినేషన్ వేయనున్నారు. మోదీ పోటీ చేసే వారణాసి నగర వీధుల్లో బిచ్చమెత్తుకుని, రైతుల దుస్థితిని వారణాసి ప్రజలకు తెలియజేస్తామని వీరంటున్నారు.
ఈ రైతులంతా, జాతీయ దక్షిణ భారత రైతు సంఘానికి చెందినవారు. 2017, 2018 సంవత్సరాల్లో దిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద వీరు.. రెండు విడతల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టారు.
పార్లమెంట్ సమీపంలో నగ్నప్రదర్శనలు, ఒంటిపై కపాలాలు ధరించి, ఎలుకలు, మలం తింటూ.. తమనుతాము చెప్పులతో కొట్టుకుంటూ, అరగుండు గీయించుకుని పెద్దఎత్తున నిరసనలు చేశారు. వీరి నిరసన కార్యక్రమాలు జాతీయ, అంతర్జాతీయ మీడియాలో ప్రధాన వార్తలుగా నిలిచాయి.
రైతు రుణమాఫీ, పంటలకు కనీస మద్దతు ధర పెంపు మొదలైనవి వారి ప్రధాన డిమాండ్లు. తమ డిమాండ్ల సాధన కోసం ప్రధానిని కలవాలనుకున్న వారి ప్రయత్నం అప్పట్లో ఫలించలేదు.
పంట దిగుబడి ఆదాయం పెంచుతామని, రైతు రుణమాఫీ, నదుల అనుసంధానం చేస్తామని 2014లో బీజేపీ హామీ ఇచ్చినా, వాటిని నెరవేర్చలేకపోయిందని రైతు సంఘం అధ్యక్షుడు, వారణాసి అభ్యర్థుల్లో ఒకరైన అయ్యకన్ను 'బీబీసీ తమిళం' ప్రతినిధి అపర్ణ రామమూర్తితో అన్నారు.
''తమిళనాడువ్యాప్తంగా అన్ని జిల్లాల నుంచి వందలాది మంది రైతులు ఏప్రిల్ 24న వారణాసి చేరుకుంటారు. ఎన్నికల డిపాజిట్ డబ్బు కోసం వారణాసి వీధుల్లో భిక్షాటన చేసి, ఏప్రిల్ 25న మేం నామినేషన్లు దాఖలు చేస్తాం'' అని అయ్యకన్ను తెలిపారు.
ఇతర రాష్ట్రాల రైతుల నుంచి తమకు మద్దతు ఉందని, రైతుల దుస్థితి వారణాసి ప్రజలకు వివరించేందుకు తాము బిచ్చమెత్తుకుంటామని అయ్యకన్ను వివరించారు.
దిల్లీలో నిరసనలు చేసినపుడు తమిళనాడుకు చెందిన కేంద్రమంత్రి రాధాక్రిష్ణన్ మమ్మల్ని ఐదుసార్లు కలిసి, సాయం చేస్తానని హామీ ఇచ్చినా, ఇంతవరకూ ఒరిగిందేమీలేదని అయ్యకన్ను అన్నారు.
ఇవి కూడా చదవండి
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- మహారాష్ట్ర: రైతుల లాంగ్ మార్చ్ వెనుక 7 కారణాలు!
- ఇడుపులపాయ: గసగసాలు సాగు చేశారు.. పోలీసులు జైల్లో పెట్టారు
- గుడ్లు ఎక్కువగా తింటే గుండె జబ్బులు వస్తాయా...
- సిత్రాలు సూడరో: సీటివ్వలేదని టీఆర్ఎస్కు టాటా చెప్పిన వివేక్... బాబు గూటికి బైరెడ్డి
- తెలంగాణలో ఆంధ్రావాళ్లను కొడుతున్నారన్న పవన్ వ్యాఖ్యలపై విమర్శలు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)