You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సిత్రాలు సూడరో: పార్టీ మారింది... మాటా మారింది
ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పార్టీల మధ్య నేతల రాకపోకలు భారీగా జరుగుతున్నాయి. గత కొన్ని వారాలుగా నేతల వలసలకు సంబంధించి పెద్దఎత్తున వార్తలు వస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు పార్టీలు మారుతున్న నాయకులు గతంలో ప్రత్యర్థి పార్టీల నాయకుల గురించి, సొంత పార్టీ నాయకుల గురించి ఏమన్నారు? ఇప్పుడు కండువా మార్చుకున్న తర్వాత ఏమంటున్నారు? చూద్దాం.
కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి
కేంద్ర మాజీ మంత్రి, కర్నూలు జిల్లాకు చెందిన సీనియర్ నేత కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఇటీవల కాంగ్రెస్ నుంచి బయటకొచ్చి టీడీపీలో చేరారు.
2018 అక్టోబర్‌లో
కర్నూలు జిల్లాకు అన్యాయం చేసి అనంతపురానికి నీటిని తరలిస్తే ఊరుకోబోమని, తుంగభద్ర డ్యాం, హంద్రీనీవా ద్వారా వచ్చే నీటిని అనంతపురం జిల్లాకు తీసుకెళ్తే కాలువలు పగలగొడతామని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి ఏపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
2014 ఎన్నికల్లో కర్నూలు జిల్లాలో టీడీపీకి తక్కువ ఓట్లు వచ్చాయని చంద్రబాబు ఇలాంటి పనులు చేస్తే తాము ఊరుకోబోమన్నారు.
"గత ఎన్నికల్లో టీడీపీకి ఓట్లు పెద్దగా రాలేదు, వైసీపీనే ఎక్కువ సీట్లు గెలుచుకుందన్న కక్షతో చంద్రబాబు ఈ పనులు చేస్తున్నారా? అలా చేస్తే మీకు ప్రజలు తప్పకుండా బుద్ధి చెబుతారు" అని కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి అన్నారు.
2019 మార్చిలో
ఇటీవల చంద్రబాబు సమక్షంలో కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి టీడీపీలో చేరారు.
ఆ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. "కాంగ్రెస్ నుంచి బయటకు వస్తానని అనుకోలేదు. కానీ, ఆ పార్టీ పరిస్థితి బాగోలేదు కాబట్టి వాళ్లే నన్ను బయటకు పంపించారు. నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు వ్యతిరేకి అన్నాను. కానీ, ఆయన మహత్తర కార్యక్రమం చేశారని ఇప్పుడు అర్థమైంది. జిల్లాకు ప్రాజెక్టులను మంజూరు చేశారు. గత ఎన్నికల్లో వైసీపీ 11 సీట్లు గెలుచుకుంది, టీడీపీకి మూడు సీట్లు వచ్చాయి. ఇప్పుడు 14 స్థానాలనూ టీడీపీనే గెలుస్తుందన్న నమ్మకం నాకుంది" అన్నారు.
అవంతి శ్రీనివాసరావు: అప్పుడు, ఇప్పుడు
ఎంపీ అవంతి శ్రీనివాసరావు ఇటీవల టీడీపీకి రాజీనామా చేసి, వైసీపీలో చేరారు.
2017 సెప్టెంబర్
ఒక బహిరంగ సభలో అవంతి శ్రీనివాసరావు ప్రసంగిస్తూ ఇలా అన్నారు...
"అభివృద్ధిలో దేశంలోనే రాష్ట్రం ప్రథమ స్థానంలో ఉంది. చంద్రబాబులా ఎవరూ ఇంత బాగా పనిచేయరు. వైఎస్ జగన్ తనకు వచ్చిన అవకాశాన్ని కూడా దుర్వినియోగం చేస్తారు. ఆయన ప్రతిపక్ష నేతగా ప్రజలు ఇచ్చిన గౌరవాన్ని కాపాడుకోకుండా, ఎప్పుడూ ముఖ్యమంత్రికి అడ్డుపడుతున్నారు" అని అన్నారు.
2019 ఫిబ్రవరి
వైసీపీలో చేరిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ఇలా అన్నారు.
"రాష్ట్రానికి కేంద్రం నుంచి రావాల్సిన ప్రయోజనాలు రాకపోవడానికి కారణం.. రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి, విచ్చలవిడి తనం, బంధుప్రీతి, కొంతమందికే చంద్రబాబు న్యాయం చేయడం.
ఏవో పథకాలు పెట్టాం ఇక మేం ఏం చేసినా ప్రజలు మమ్మల్ని అడగరన్న అతివిశ్వాసం చంద్రబాబుకు ఉంది. కానీ, రాష్ట్ర ప్రజల్లో చైతన్యం వచ్చింది. మంచి ఆలోచనతో, ఆశయంతో, ప్రజలకు మంచి చేయాలన్న తపనతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేయాలని ప్రజలు నిర్ణయించుకున్నారు.
ఇప్పుడు ఎలాంటి పథకాలతో ప్రజలను మభ్యపెట్టేందుకు ప్రయత్నించినా చంద్రబాబును ప్రజలు నమ్మరు. కులాల మధ్య చిచ్చు పెడుతున్నది చంద్రబాబే. ఆయనకు అనుభవం ఉంది రాష్ట్రాన్ని బాగు చేస్తారనుకున్నాం. కానీ, ఆయన రాష్ట్రాన్ని బాగు చేయలేదు, ఆయన, ఆయన మంత్రులు బాగుపడ్డారు. రాష్ట్రంలో దుర్మార్గమైన పాలన జరుగుతోంది."
ఇవి కూడా చదవండి:
- మసీదుల్లో కాల్పుల అనుమానితుడు ఇతడే.. కోర్టులో ప్రవేశపెట్టిన పోలీసులు
- ‘అమరజీవి’ పొట్టి శ్రీరాములు: చనిపోయే దాకా దీక్షను కొనసాగించటానికి కారణాలేంటి?
- న్యూజీలాండ్ కాల్పుల బాధిత తెలుగు కుటుంబాలతో BBC Exclusive ఇంటర్వ్యూ
- జనసేన పార్టీ అభ్యర్థులు వీరే
- స్తంభించిన ఫేస్‌బుక్... ఇన్‌స్టాగ్రామ్, వాట్సప్ సేవల్లోనూ అంతరాయం
- ఉత్తర భారతదేశ మహిళలను రాహుల్‌గాంధీ అవమానించారా
- భారత నగరాలు స్మార్టుగా మారుతున్నాయా
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)