You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆంధ్రప్రదేశ్: బాల్యవివాహాలను అరికట్టేవారికే నా ఓటు: #MyVoteCounts
- రచయిత, రిపోర్టర్: సంగీతం ప్రభాకర్
- హోదా, షూట్, ఎడిట్: నవీన్ కుమార్ కె
#MyVoteCounts సిరీస్‌లో భాగంగా.. 2019 సార్వత్రిక ఎన్నికల్లో తొలిసారిగా ఓటు వేయబోతున్న యువతుల మనోగతాన్ని, వారు ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్యలు ఏమిటి? ఈ ఎన్నికల నుంచి వాళ్లు ఏం ఆశిస్తున్నారు? అన్న విషయాలను తెలుసుకునేందుకు బీబీసీ ప్రయత్నిస్తోంది.
గుంటూరు జిల్లా దాచేపల్లికి చెందిన సయ్యద్ సైదాబి ఇంటర్ చదువుతున్నారు. ఆమెకు మొదటిసారి ఓటు హక్కు లభించింది. రాబోయే సాధారణ ఎన్నికల్లో ఆమె తన ఓటుహక్కును వినియోగించుకోబోతున్నారు.
ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారు అని బీబీసీ సైదాబీను ప్రశ్నించింది.
"సమాజంలో బాల్యవివాహాలను ఆపేందుకు ఎవరు కృషి చేస్తారో, బాలికల విద్యకు ఎవరు తోడ్పాటునందిస్తారో వారికే నేను ఓటేస్తా" అని ఆమె అంటున్నారు.
చాలామంది ఆడపిల్లలకు చిన్నతనంలోనే పెళ్లి చేసేస్తుంటారు. మా ఇంట్లో కూడా ఇలాంటి ఘటనలు జరిగాయి.
"మా అక్కకు 14 ఏళ్ల వయసులో పదో తరగతి చదువుతుండగా మధ్యలోనే చదువు ఆపేసి పెళ్లి చేసేశారు. కానీ అప్పటికి అక్క శరీరం ఇంకా పెళ్లికి, గర్భధారణకు అవసరమైనంత ఎదగలేదు. దీంతో ప్రసవ సమయంలో ఆమె చాలా ఇబ్బందులు ఎదుర్కొంది. మూడుసార్లు పెద్ద ఆపరేషను చేయాల్సి వచ్చింది. ఆమె ఎంత బాధ అనుభవించిందో నేను ప్రత్యక్షంగా చూశాను. దీంతో ఆమె పనిచేయలేని స్థితిలోకి వెళ్లిపోయింది. మాకు ఎక్కువ బాధ పెట్టిన మరో సంఘటన మా పిన్నిది. ఆమె 10వ తరగతి చదివేటప్పుడే బడి మాన్పించి పెళ్లి చేశారు. ఆమె డెలివరీ సమయంలో చనిపోయింది. అప్పుడు ఆమెకు 17 ఏళ్లే" అని సైదాబీ బాధపడ్డారు.
చదువుకున్న అమ్మాయిలను చదువుకున్న అబ్బాయిలకే ఇవ్వాల్సి ఉంటుంది. అలా చేయాలంటే కట్నం ఎక్కువ ఇవ్వాలి. అందుకే చాలామంది అమ్మాయిల చదువులను చిన్న వయసులోనే ఆపించేసి, పెళ్లిళ్లు చేసేస్తున్నారు అని సైదాబీ అంటున్నారు.
చట్టాలు ఎన్ని ఉన్నా, వాటిని సరిగ్గా అమలుచేయడం లేదు. ఎవరైతే వాటిని సక్రమంగా అమలుచేసేందుకు పాటుపడతారో వారికే నేను ఓటేస్తా.
నాకు లా చదవాలని ఉంది. కానీ మా ఇంట్లో నాకు ఈ పరీక్షలు అయిన వెంటనే పెళ్లిచేయాలనుకుంటున్నారు. మా అమ్మ నన్ను పట్టుకుని బాధపడింది... "నీ భవిష్యత్తును పాడుచేస్తున్నా" అని. అందుకే బాల్యవివాహాలను అరికట్టేవారికి, ఆ చట్టాలను సక్రమంగా అమలుచేసే ప్రభుత్వానికే నా ఓటు అంటున్నారు సైదాబీ.
ఇవి కూడా చదవండి.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)