You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
CBI vs CBI: ఆరోజు సీబీఐ డైరీ, ఈరోజు డైరెక్టర్ తొలగింపు.. అన్నీ రహస్యాలేనా: అభిప్రాయం
- రచయిత, మాడభూషి శ్రీధర్
- హోదా, మాజీ కేంద్ర సమాచార కమిషనర్, లా ప్రొఫెసర్, బెన్నెట్ యూనివర్సిటీ
సీబీఐ సంస్థ పోలీసు దర్యాప్తులు చేయడానికి ఏర్పడింది. దేశంలో పోలీసు విభాగాలన్నీ సమాచార హక్కు చట్టం పరిధిలోకి వస్తాయి. కాని సీబీఐని ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వమే ఒక నోటిఫికేషన్ ద్వారా మినహాయించింది. ఎందుకు? ఎవరిని దర్యాప్తుచేస్తున్నారు? ఏ కేసుల దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఫలానా కేసులను దర్యాప్తు చేయకుండా ఎవరైనా అడ్డుపడుతున్నారా? అని అడిగితే చెప్పడానికి ఏమిటి సమస్య?
సీబీఐ డైరెక్టర్ ఇంటి గేటు దగ్గర కాపలాదారుడి దగ్గర పెట్టిన సందర్శకుల రిజిస్టర్ పేజీలు సమాచార హక్కు చట్టం కింద అడిగితే ఇవ్వరు. ఎందుకంటే సీబీఐని మినహాయించారంటారు. ఈ విధంగా మినహాయించిన సంస్థల సమాచారం కూడా అవినీతి నిరోధకానికి, మానవహక్కుల ఉల్లంఘన నివారణకుగాను వెల్లడిచేయవచ్చని ఆర్టీఐ చట్టం సెక్షన్ 24లో ఉంది. ఆ విధంగా సమాచారం ఇవ్వవచ్చని ఆదేశించే అధికారం సీఐసీ (కేంద్ర సమాచార కమిషన్)కు ఉందని కూడా ఆ సెక్షన్ స్పష్టంగా వివరిస్తోంది. కాని మాజీ ఐపీఎస్ లేదా ఐఏఎస్ అధికారి ఎవరైనా ఏలిన వారి దయతో సీఐసీగా నియుక్తులైతే, వారు దేశ రక్షణకోసం గాను ఆ సమాచారం ఇవ్వరాదని అభిప్రాయపడే అవకాశాలు ఉన్నాయి.
సుప్రీంకోర్టు న్యాయవాది సీబీఐ డైరెక్టర్ ఇంటి గేట్ విజిటర్ల రిజిస్టర్ కోసం సుప్రీంకోర్టు తలుపు తట్టవలసి వచ్చింది. ఆ రిజిస్టర్ వెల్లడి చేయాలని కోర్టు ఆదేశించింది. తీరా ఆ రిజిస్టర్ తెరచి చూస్తే, నిందితులతో సీబీఐ డైరెక్టర్ రంజిత్ సిన్హా తరచూ అర్థరాత్రి దాటిన తరువాత సమావేశమవుతూ ఉన్నారని తేలింది. వారు సామాన్యులైన నిందితులు కారు. 2జీ, బొగ్గు కుంభకోణాల్లో కీలక నిందితులు.
2014లో సుప్రీంకోర్టు ఈ కుంభకోణాల గురించి కేసులు విచారిస్తోంది, పర్యవేక్షిస్తోంది కూడా. ఆకేసుల్లో నిందితుడితో రహస్యంగా అర్థరాత్రి అనేక సార్లు అనైతికంగా చట్ట వ్యతిరేకంగా సమావేశాలు జరిపారని తేలింది. దర్యాప్తు చేస్తున్న అత్యున్నత సంస్థకు చెందిన అత్యున్నతాధికారి దర్యాప్తును దారి తప్పించడానికి లేదా కేసును భ్రష్టు పట్టించడానికి ప్రయత్నిస్తున్నారనడానికి ఈ రుజువు చాలదా? ఇంతకన్నా అవినీతి ఏదైనా ఉంటుందా?
నిందితులతో దర్యాప్తు అధికారికి అర్థరాత్రి మంతనాలేమిటి? వారు ఆ సమావేశాల్లో అవినీతి రహిత సమాజాన్ని నిర్మించడానికి అత్యవసరంగా చర్చలు జరిపారని నమ్మవలసిన బాధ్యత జనం పైన ఉందా? అసలు ఈ విషయాలను దర్యాప్తు జరిపించాలా వద్దా? అసలు కుంభకోణాల దర్యాప్తు కన్నా ఆ దర్యాప్తులు దారి తప్పించే అవినీతిని దర్యాప్తు చేయించవలసిన దశ ఏర్పడింది. కానీ ఆ దర్యాప్తు జరిపించనేలేదు. లంచం రుజువు కాకపోవచ్చు. కానీ నేరగాళ్లతో పోలీసు ఉన్నతాధికారి అర్థరాత్రి సమావేశమై నమ్మక ద్రోహం చేశారనక తప్పదు.
సరిగ్గా అయిదేళ్ల తరువాత సీబీఐ డైరెక్టర్ స్వయంగా స్వతంత్రంగా దర్యాప్తు జరపలేని స్థితి. అతని మీదే దర్యాప్తు జరిపించే ఆరోపణలు. ఆ ఆరోపణలు చేస్తున్న సీబీఐ అధికారిపైన సీబీఐ డైరెక్టర్ ప్రత్యారోపణలు. పత్రికలు, టీవీలు సీబీఐ వర్సెస్ సీబీఐ అని విమర్శించడం. ఇద్దరు సీబీఐ అధికారుల తొలగింపు, వారిద్దరితోపాటు ఒక దర్యాప్తు బృందంలోని అధికారులందరినీ బదిలీచేయడం, చకచకా జరిగిపోతున్న ఆశ్చర్యకర పరిణామాలు.. ఎందుకో ఏమిటో జనానికి తెలియదు. తొలగింపుకు గురైన సీబీఐ డైరెక్టరుకు తెలియదు. అతనిపైన దర్యాప్తును పర్యవేక్షించే సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పట్నాయక్‌కు తెలియదు. పట్నాయక్ నివేదిక ఏమిటో తెలియదు.
డైరెక్టరును తొలగించే కమిటీలో ముగ్గురు సభ్యులు. ఒకాయన సాక్షాత్తూ ప్రధాన మంత్రి. ఇంకొకాయన దేశ ప్రధాన న్యాయమూర్తి. మూడో వ్యక్తి ప్రతిపక్ష నాయకుడు. సీవీసీ ఇచ్చిన నివేదిక, జస్టిస్ పట్నాయక్ నివేదిక, ఇతరపత్రాలు ఇవ్వండి అని ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున్ ఖర్గే అడిగారు. అంటే ఆయనకు ఈ పత్రాలు ఇవ్వలేదన్నమాట. ముందు ఇవ్వకపోతే పోనీ, ఇప్పుడైనా ఇవ్వండి అని ప్రధాన న్యాయమూర్తి అడగలేదు, కనీసం ఇప్పించలేదు. ప్రధాన మంత్రికైనా ఈ వివరాలు తెలిసి ఉండవచ్చు అని అనుకోవాలి. కానీ ఆయనా ఈ పత్రాలు ఇవ్వరు.
ఆర్టీఐ చట్టం కింద మామూలు జనులకు తెలుసుకునే హక్కు ఉందా లేదా అనే విషయం అటుంచితే, కనీసం ఉన్నతాధికార సంఘం సభ్యులకైనా ఆ హక్కు లేదా? సీబీఐ డైరెక్టరుకు ఇవ్వరు, కాని ఆ డైరెక్టరును తొలగించాలని నిర్ణయం తీసుకోవలసిన సంఘం సభ్యుల ముందు ఆ పత్రాలు ఉంచడానికి వీల్లేదా? స్వయంగా ప్రధానికి తెలిసి ఉండవచ్చు. కానీ మిగతా సభ్యులకు తెలియనవసరం లేదా? ప్రధాన న్యాయమూర్తి లేదా వారి ప్రతినిధిగా వచ్చిన న్యాయమూర్తి ఎవరైనా మేం చూస్తాం మాకివ్వండి అని అడగవచ్చు కదా? కొందరు తెలుసుకొనే హక్కు అమలు చేయాలని అడుగుతారు. మరికొందరు కనీసం ఆ మాటే ఎత్తరు? వారు ఎంత పెద్ద పదవిలో ఉంటేనేం?
బదిలీ చేయడం అంటే తొలగించడమనే అర్థం. అర్థరాత్రి హఠాత్తుగా సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని, సీబీఐ చట్టం కింద కాకుండా నియామకాలు, తొలగింపుల కోసం ఏర్పాటైన అత్యున్నత అధికార కమిటీకి మాత్రమే ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు వెలువడితే న్యాయం బతికిందనుకున్నాం. ప్రధాన మంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నతాధికార కమిటీ వెంటనే సమావేశమైంది. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హాజరైన ఈ సమావేశంలో తొలిరోజు ఏ నిర్ణయానికీ రాలేదు.
మరునాడు మళ్లీ కమిటీ సమావేశమైంది. ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు ఉన్నారు. ప్రధాన న్యాయమూర్తి రాకుండా తన ప్రతినిధిగా జస్టిస్ ఏకే సిక్రీని పంపారు. సీబీఐ డైరెక్టర్ పదవిలో ఉన్న అలోక్ వర్మను అగ్నిమాపక శాఖకు బదిలీ చేశారు. ఆ పదవిలో ఉండాల్సిన వయసును వర్మ దాటిపోయారు. కనుక ఆ బదిలీ చెల్లదు. కమిటీలోని ముగ్గురిలో ప్రతిపక్ష నాయకుడుగా ఉన్న మల్లిఖార్జున ఖర్గే ఒక్కరే తొలగింపు చర్యను వ్యతిరేకించారు. జనవరి 10వ తేదీనాటి అత్యున్నతాధికార కమిటీ సమావేశంలో జరిగిన చర్చలు, నిర్ణయాన్ని వివరించే మినట్స్ పత్రాల ప్రతులు కావాలని ఆయన అడిగారు.
కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ డైరెక్టర్‌ను తొలగించారని అంటున్నారు. మొదటి సారి వర్మను తొలగించినప్పుడు సుప్రీంకోర్టులో ఆయన సవాలు చేశారు. తొలగింపునకు కారణాలని భావిస్తున్న అంశాలను సీవీసీ పరిశోధించాలని, ఆ పరిశోధనను మాజీ న్యాయమూర్తి ఏకే పట్నాయక్ పర్యవేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పట్నాయక్.. వర్మను తొలగించేంత తీవ్రమైన అవినీతి అక్రమాల ఆరోపణలకు ఏ విధమైన సాక్ష్యాలూ తన ముందు లేవని, కనుక వర్మ తొలగింపు చాలా తొందరపాటు చర్య అని విమర్శించారు.
ఒకవేళ సీవీసీ దర్యాప్తు జరిపి నివేదిక ఇచ్చినప్పటికీ ఆ నివేదిక చదవకుండా, సొంతంగా ఆలోచించకుండా తొలగించాలని నిర్ణయించడం సరికాదని మల్లికార్జున ఖర్గే ప్రధాన మంత్రికి రాసిన లేఖలో విమర్శించారు. కమిటీ సీవీసీ నివేదికను, పట్నాయక్ నివేదికను చదివిన తరువాత, అలోక్ వర్మ వివరణను కూడా విని సొంత బుర్ర ఉపయోగించి నిర్ణయం తీసుకోవలసిన బాధ్యత కమిటీ పైన ఉందని ఖర్గే అన్నారు. అంటే సొంతంగా నిర్ణయం తీసుకోగల శక్తి ఉన్న డైరెక్టర్‌గా అలోక్ వర్మ పదవిలో కొనసాగితే తమకు ఏం ముప్పు వస్తుందో అని ప్రభుత్వం భయపడుతున్నట్టు స్పష్టమైందని ఖర్గే విమర్శించారు.
అప్పటికే వర్మ తొలగింపు, ఆయన స్థానంలో మరొకరి నియామకం గురించి ప్రభుత్వం ఒక నిర్ణయానికి వచ్చేసినా, ఆ కమిటీ ముందుకు మరొక డైరెక్టర్ తాత్కాలికంగా నియామక ప్రతిపాదనను ఎందుకు తీసుకురాలేదని కూడా ఆయన నిలదీశారు.
''సీవీసీ నివేదిక మీకు ముందే అంది ఉంటుంది. కేవలం ఆ నివేదికపైనే ఆధారపడి నిర్ణయం తీసుకోవడానికే సమావేశం ఏర్పాటు చేశారు'' అంటూ ఖర్గే విమర్శించారు. జస్టిస్ పట్నాయక్ ఆ సీవీసీ నివేదికతో తనకు ఏ ప్రమేయమూ లేదని, అది కేవలం సీవీసీకి మాత్రమే చెందిన నివేదిక అని, సీవీసీ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తి స్వయంగా వివరిస్తూ ఉంటే ఆ నివేదికను కమిటీ సభ్యులకు ఇవ్వకుండా, పట్నాయక్ నివేదికను కమిటీలో పరిశీలించకుండా, ఇంత తీవ్ర నిర్ణయాలు ఏ విధంగా తీసుకుంటారనేది అసలు ప్రశ్న.
న్యాయ వ్యవస్థ ప్రతిష్ఠకు, విశ్వసనీయతకు సంబంధించిన కీలక అంశాలు కూడా ఇందులో ఉన్నాయి. ఈ పరిణామాల్లో ఎక్కడా పారదర్శకత మచ్చుకైనా లేదు. జస్టిస్ పట్నాయక్ నివేదికను, సీవీసీ నివేదికను ఎవరు చూశారు? అందులో ఏముంది? వాటి ప్రతులు మల్లిఖార్జున ఖర్గేకు ఎందుకు ఇవ్వలేదు. ప్రధాన మంత్రి, న్యాయమూర్తి ఎవరైనా ఆ నివేదికలు చదివారా? అర్థం చేసుకున్నారా? అందులో కొంపముంచే ఆరోపణలు ఏమున్నాయి? డైరెక్టర్‌ను తొలగించవలసినంత తీవ్ర ఆరోపణలైతే వాటిని ఎవరు విచారిస్తారు? డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు, విచారణ జరిపించిన వివరాలు, ఆ నివేదిక, సుప్రీంకోర్టు నిర్ణయించిన పర్యవేక్షకుడైన మాజీ న్యాయమూర్తి జస్టిస్ పట్నాయక్ నివేదికలో ఏ వివరాలు ఉన్నాయో చెప్పడానికి ఎందుకు వెనుకాడుతున్నారు?
సీబీఐ వంటి అత్యున్నత సంస్థలో చాలా పెద్ద పదవుల్లో ఉన్న వారి అవినీతి నేరాల ఆరోపణల సాక్ష్యాలను సేకరించేందుకు దర్యాప్తు చేస్తూ ఉంటారని వేరే చెప్పనవసరం లేదు. ఆ సంస్థలో అర్థరాత్రి దర్యాప్తు చేస్తున్న బృందంలోని పోలీసు దర్యాప్తు అధికారులను ఉన్నట్టుండి, ఏ కారణమూ చెప్పకుండా, దేశంలోని మారు మూల ప్రాంతాలకు చెల్లాచెదురుగా విసిరేస్తూ బదిలీలు జరపడం, అందుకోసం నెంబర్ వన్ , నెంబర్ టూ స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను పదవిలోంచి తప్పించడం ఆశ్చర్యకరమైన పరిణామాలు. ఆ బృందం దర్యాప్తు చేస్తున్న కేసులు ఏమిటి? ఆ కేసుల్లో ఇరుక్కున్న పెద్దలెవరు?
సమాచార హక్కుకే కాదు, సమపాలనకు, నియమపాలనకు, సంవిధాన పాలనకు అవసరమైన ప్రశ్నలివి.
ఇవి కూడా చదవండి.
- 'పంజరంలో చిలక' సీబీఐలో ఏం జరుగుతోంది?
- సీబీఐ వర్సెస్ సీబీఐ: డైరెక్టర్ అలోక్ వర్మ తొలగింపునకు.. రఫేల్ విచారణకు సంబంధముందా?
- సీబీఐ కేసులో సుప్రీం తీర్పు కేంద్ర ప్రభుత్వానికి చెంపపెట్టేనా?
- CBI vs CBI: కాకినాడ సానా సతీశ్ బాబు ఫిర్యాదు ఎందుకు సంచలనమైంది?
- సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ రాజీనామా
- రాకేశ్ అస్థానా కేసు దర్యాప్తుకు అజిత్ డోభాల్ అడ్డు తగిలారు: సీబీఐ డీఐజీ
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)