You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ రాజీనామా
సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి గురువారం నాడు ఉద్వాసనకు గురైన అలోక్ వర్మ ప్రభుత్వ సర్వీసుకు రాజీనామా చేశారు.
పిటిఐ వార్తా కథనం ప్రకారం ఆయన తన రాజీనామా లేఖలో ఇది "అందరూ ఆత్మపరిశీలన" చేసుకోవాల్సిన సమయం అని రాశారు. సుప్రీం కోర్టు ఆదేశాలతో బుధవారం నాడు మళ్ళీ సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మను, 36 గంటలు తిరగకుండానే ప్రధానమంత్రి మోదీ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ ఆ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది. ఆయనను ఫైర్ సర్వీసెస్ డీజీగా బదిలీ చేసింది.
1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన అలోక్ వర్మ తన రాజీనామా లేఖలో, "నేను 2017 జనవరి 31 నాటికే ఉద్యోగ విరమణ వయసును పూర్తి చేసి సీబీఐ డైరెక్టర్‌గా ప్రభుత్వ సేవలో ఉన్నాను. సీబీఐ డైరెక్టర్‌గా పదవీ కాలం 2019 జనవరి 31తో ముగుస్తుంది. అది నిర్ణీత వ్యవధి కలిగిన పదవి. ఇప్పుడు నేను సీబీఐ డైరెక్టర్ కాదు కాబట్టి, ఫైర్ సర్వీస్ డీడీ, సివిల్ డిఫెన్స్, హోమ్ గార్డ్స్ తదితర శాఖల్లో పని చేసేందుకు పదవీ విరమణ వయసు దాటి పోయింది కాబట్టి, నన్ను నేటి నుంచే ఉద్యోగం నుంచి విరమించినట్లుగా గుర్తించండి" అని తెలిపారు.
రాజీనామా లేఖను ఆయన పర్సనల్ అండ్ ట్రైనింగ్ శాఖ కార్యదర్శికి అందజేశారు.
సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగింపు
ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని హైలెవల్ కమిటీ సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మను పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
రెండు రోజుల క్రితం సుప్రీం కోర్టు ఆయనను సెలవుపై పంపడాన్ని తప్పుబడుతూ ఆ నిర్ణయాన్ని కొట్టేసింది. ఆలోక్ వర్మ బాధ్యతలు చేపట్టిన మరుసటి రోజే ఆయనను పదవి నుంచి తొలగించారు.
ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం ప్రధాని అధ్యక్షతన సమావేశమైన హైలెవల్ కమిటీ సుదీర్ఘ భేటీ అనంతరం.. వర్మను సీబీఐ చీఫ్ పదవి నుంచి తొలగిస్తూ నిర్ణయం తీసుకుంది.
ఆయనను జాతీయ మానవ హక్కుల సంస్థకు బదిలీ చేసే అవకాశాలు ఉన్నట్లు పీటీఐ పేర్కొంది.
ఈ సమావేశంలో ప్రధానితో పాటు లోక్‌సభ పక్ష నేత మల్లికార్జున ఖర్గే, సుప్రీంకోర్టు ప్రధాని న్యాయమూర్తి రంజన్ గొగొయ్ ద్వారా నియమితులైన జస్టిస్ ఏకే సిక్రీ ఉన్నారు.
ప్రధాని మోదీ, జస్టిస్ సిక్రీ ఆలోక్ వర్మ తొలగింపుకు మొగ్గు చూపగా, ఖర్గే దీనిని వ్యతిరేకించారు.
ఆలోక్ వర్మ తొలగింపుపై కాంగ్రెస్ పార్టీ, ''అది జాయింట్ పార్లమెంటరీ కమిటీ విచారణ కావచ్చు, లేదా స్వతంత్ర సీబీఐ డైరెక్టర్ విచారణ కావచ్చు.. విచారణ గురించి ఎంత భయపడుతున్నారో మోదీ మరోసారి నిరూపించుకున్నారు,'' అని ట్వీట్ చేసింది.
ఇదే అంశంపై సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషన్, ''రఫేల్ స్కామ్‌లో తనపై ఎఫ్‌ఐఆర్ రిజిస్టర్ చేస్తారనే భయంతో డైరెక్టర్ పదవిలో తిరిగి నియుక్తులైన మరుసటి రోజే అలోక్ వర్మను హడావుడిగా, ఆయన వాదన వినక ముందే పదవి నుంచి తొలగించారు. విచారణను ఆపడానికి ఎంత తొందరో.'' అని ట్వీట్ చేశారు.
కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని తోసిపుచ్చిన సుప్రీంకోర్టు
రెండ్రోజుల క్రితం ఇచ్చిన తీర్పులో సుప్రీంకోర్టు ఆలోక్ వర్మను సెలవుపై పంపే లేదా ఆయనను పదవి నుంచి తొలగించే అధికారం హైలెవల్ కమిటీకే ఉందని స్పష్టం చేసింది.
ఆలోక్ వర్మను సెలవుపై పంపే ముందు ప్రభుత్వం పాటించాల్సిన నిబంధనలు పాటించలేదని కోర్టు పేర్కొంది.
ఆయన పదవిలో కొనసాగవచ్చని స్పష్టం చేస్తూ.. ఆలోక్ వర్మ ఎలాంటి విధానపరమైన ముఖ్య నిర్ణయాలూ తీసుకోరాదని సూచించింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)