You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
Fact Check: బుర్జ్ ఖలీఫా మీద రాహుల్ గాంధీ ఫొటో ప్రదర్శన వీడియో ఎలా పుట్టింది?
- రచయిత, ఫ్యాక్ట్‌చెక్ టీమ్
- హోదా, బీబీసీ న్యూస్
దుబాయ్‌లోని ఆకాశహర్మ్యం బుర్జ్ ఖలీఫా మీద కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ఫొటోను ప్రదర్శించినట్లు చూపుతున్న ఓ వీడియో ప్రస్తుతం ఫేస్‌బుక్, ట్విటర్‌లలో వైరల్ అవుతోంది.
కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తున్న సోషల్ మీడియా పేజీలు కొన్ని ఈ వీడియోను షేర్ చేశాయి.
ఫేస్‌బుక్‌లో ''విత్ రాహుల్ గాంధీ'' అనే పేజీలో ఈ వీడియోను లక్ష మందికి పైగా వీక్షించారు.
ఇది వాట్సాప్ గ్రూపుల్లోనూ సర్క్యులేట్ అవుతోంది.
దుబాయ్ ప్రభుత్వం రాహుల్‌గాంధీని గౌరవిస్తూ బుర్జ్ ఖలీఫా మీద ఆయన ఫొటోను ప్రదర్శించిందని ఈ పేజీలు చెప్పుకొస్తున్నాయి.
ఇండియా, పాకిస్తాన్ దేశాల స్వతంత్ర్య దినోత్సవాల సందర్భంగా బుర్జ్ ఖలీఫా మీద ఈ రెండు దేశాల జాతీయ పతాకాలను ప్రదర్శించటం సాధారణంగా జరుగుతోంది.
అయితే.. ఈ ఆకాశహర్మ్యం మీద రాహుల్ గాంధీ ఫొటోను ప్రదర్శించలేదని మా దర్యాప్తులో వెల్లడైంది.
ఈ వీడియో పై భాగంలో ఎడమ చేతి వైపు 'Biugo' అనే వాటర్‌మార్క్ ఉంది. అది వీడియోలు తయారు చేయటానికి, ఎడిట్ చేయటానికి ఉపయోగించే ఒక అప్లికేషన్. ఎటువంటి దృశ్యం లేదా ఫొటోను సూపర్-ఇంపోజ్ చేసే టెంప్లేట్లు ఇందులో ఉన్నాయి.
ఈ యాప్ టెంప్లేట్ లైబ్రరీలో బుర్జ్ ఖలీఫా టెంప్లేట్ ఉన్నట్లు మేం గుర్తించాం. ఆ టెంప్లేట్ ద్వారా ఎవరైనా సరే ఏ వ్యక్తి ఫొటోనైనా సరే జోడించి.. బుర్జ్ ఖలీఫా మీద ప్రదర్శించినట్లు చూపవచ్చు.
నిజానికి రాహుల్‌గాంధీ జనవరి 11, 12 తేదీల్లో దుబాయ్‌లో పర్యటించాల్సి ఉందని ఖలీజ్ టైమ్స్ ఒక కథనంలో పేర్కొంది. అక్కడి భారతీయ ప్రజలను రాహుల్ కలుస్తారు. రాహుల్ పర్యటన రాజకీయమైనది కాదని కాంగ్రెస్ పార్టీ నిర్ధారించింది.
''ఆ సమావేశం రాజకీయపరమైనది కాదు. విదేశాల్లోని భారతీయులను మేం చేరుకునే మార్గమిది'' అని అఖిల భారత కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి హిమాంశు వ్యాస్ చెప్పినట్లు ఖలీజ్ టైమ్స్ ఉటంకించింది.
మంగళవారం ప్రెస్‌మీట్ సందర్భంగా.. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని ప్రవాసభారతీయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను ''ఒక పరిశోధకుల బృందం'' పరిశీలించినట్లు కూడా వ్యాస్ ఆ పత్రికకు చెప్పారు. ''అరబ్ ఎమిరేట్స్‌లో చనిపోయిన ప్రవాసభారతీయుల భౌతిక కాయాలను స్వదేశానికి తరలించటానికి భారీగా వ్యయం అవుతుండటం మొదలుకుని.. కార్మికుల సమస్యలు, నిరాశ్రయులైన భారతీయులు ఎదుర్కొంటున్న సవాళ్ల వరకూ అందులో ఉన్నాయి'' అని ఆయన పేర్కొన్నారు.
సాధారణ ఎన్నికలు దగ్గరపడటంతో.. కాంగ్రెస్ లేదా బీజేపీలకు మద్దతిచ్చే పేజీలలో ఫేక్ న్యూస్ (నకిలీ వార్తలు) ప్రచారం చేసే కార్యకలాపాలు పెరుగుతున్నాయి. ప్రవాస భారతీయుల్లో రాహుల్‌గాంధీ ప్రతిష్టను పెంచే ప్రయత్నంలో భాగంగా ఈ తాజా వీడియో ప్రచారంలోకి వచ్చినట్లు కనిపిస్తోంది.
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)