You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఎవరైనా అమ్మాయిని కలిస్తే ఆ పని చేసొచ్చానని ఇంట్లో చెబుతానన్న హార్దిక్ పాండ్యాపై 2 వన్డేల నిషేధానికి సిఫారసు : ప్రెస్ రివ్యూ
భారత క్రికెటర్లు హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్‌లు ఒక టెలివిజన్ 'షో'లో మహిళల్ని కించపరిచేలా అసభ్యకర వ్యాఖ్యలు చేశారంటూ బీసీసీఐ షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు సాక్షి కథనం తెలిపింది.
24 గంటల్లోగా సంజాయిషీ ఇవ్వాలని బీసీసీఐ ఆ నోటీసుల్లో బోర్డు పేర్కొంది.
'కాఫీ విత్ కరణ్' కార్యక్రమంలో వ్యాఖ్యాత కరణ్ జోహార్‌తో కలిసి ఈ ఇద్దరు క్రికెటర్లు పాల్గొన్నారు. ఇది ఇటీవలే ప్రసారమైంది.
అందులో 25 ఏళ్ల ఆల్‌రౌండర్ పాండ్యా మాట్లాడుతూ 'అమ్మాయిల విషయంలో నేనేమీ బుద్ధిమంతుడ్ని కాదు. వాళ్లను అదోటైపుగా చూస్తా. క్లబ్‌లలో వారి ఒంపుసొంపులపై కైపుగా కన్నేస్తా. ఎవరైనా అమ్మాయిని శారీరకంగా కలిస్తే 'ఆజ్ మై కర్ కే ఆయా' (నేను ఈ రోజు ...ఆ పని చేసొచ్చా) అని తల్లిదండ్రులతో చెప్పేస్తా' అని వ్యాఖ్యానించాడని కథనం తెలిపింది.
18 ఏళ్ల వయసప్పుడే తన ప్యాంట్ జేబులో కండోమ్ లభించడాన్ని వాళ్ల అమ్మ తండ్రి దృష్టికి తీసుకెళ్లిందని, మొదట మందలించినా, తర్వాత 'పర్లేదు...రక్షణ కవచం వాడావు' అని తండ్రి తనతో అన్నట్లు షోలో రాహుల్ చెప్పుకొచ్చినట్టు సాక్షి వివరించింది.
కాంట్రాక్టు క్రికెటర్లయి ఉండి ఇలా అశ్లీల రీతిలో విచ్చలవిడితనంతో వ్యాఖ్యానించిన సదరు క్రికెటర్లకు పరిపాలక కమిటీ (సీఓఏ) చీఫ్ వినోద్ రాయ్ నోటీసులు పంపారు.
ఈ నోటీసులు రాగానే పాండ్యా ట్విట్టర్ వేదికగా మహిళలను క్షమాపణలు కోరాడు. 'ఆ ఊపులో చెప్పేశాను. ఉద్దేశపూర్వకంగా చేసినవి కాదు. ఈ వ్యాఖ్యలు ఎవరినైనా బాధించివుంటే క్షమించాలి' అని అన్నాడని కథనంలో చెప్పారు. అయితే మరో క్రికెటర్ రాహుల్ మాత్రం ఇంకా స్పందించలేదని పత్రిక తెలిపింది.
మరోవైపు బీసీసీఐలో అడ్మినిస్ట్రేటర్స్ కమిటీ చీఫ్ వినోద్ రాయ్ .. పాండ్యా, రాహుల్‌లపై రెండు వన్డేలు ఆడకుండా నిషేధం విధించాలని సిఫార్సు చేశారు.
ఈ సిఫారసుపై బీసీసీఐ తుది నిర్ణయం తీసుకోవాల్సి ఉంది.
నా గుండెను దొంగిలించింది..
నా హృదయాన్ని దొంగిలించారని, వెతికి పెట్టాలని ఇటీవల ఒక యువకుడు ఫిర్యాదు చేసినట్లు నాగ్‌పూర్ పోలీసులు మీడియాకు చెప్పినట్లు ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
డబ్బులు దోచుకున్నారని, బంగారం దోచుకున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసేవారిని చూశాం. కానీ నా హృదయాన్ని దోచుకున్నారంటూ ఫిర్యాదు చేయడం ఎప్పుడైనా చూశారా.. ?.
నాగ్‌పూర్‌లో ఓ యువకుడు అదే పని చేశాడు 'సార్... ఓ అమ్మాయి నా హృదయాన్ని దోచుకుంది. వెతికిపెట్టరా ప్లీజ్' అంటూ పోలీసులను ఆశ్రయించాడు.
'మేం అలాంటి కేసులను స్వీకరించం' అని పోలీసులు ఎంత చెప్పినా వినలేదు. 'నా హృదయం నాకు తిరిగి ఇప్పిస్తామ'ని మాట ఇస్తేనే ఇక్కడ నుంచి వెళ్తానని భీష్మించుకు కూర్చున్నాడు.
అప్పటిదాకా అలాంటి కేసులను చూడని పోలీసులు కాసేపు బిత్తరపోయారు. ఏం చేయాలో పాలుపోక పైస్థాయి అధికారులకు సమాచారం అందించారు.
అక్కడికి వచ్చిన అధికారులు.. హృదయాన్ని దోచుకుంటే ఏం చేయాలనేది భారత శిక్షాస్మృతిలో లేదని, అలాంటి చట్టం వచ్చాక తప్పకుండా వెతికి పెడతామని యువకుడికి నచ్చజెప్పి పంపించారు.
నాగ్‌పూర్ పోలీస్ కమిషనర్ భూషణ్ కుమార్ ఉపాధ్యాయ తాము దొంగల దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్న వస్తువులను యజమానులకు తిరిగి ఇచ్చే సందర్భంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సరదాగా ఈ విషయాన్ని చెప్పారు.
''అప్పుడప్పుడు ఇలాంటి దొంగతనాల కేసులు కూడా వస్తాయి. మేమేం చేసేది'' అని అన్నారు.
జగన్మోహన్‌రెడ్డి తన విహార యాత్రను ముగించారు
వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్‌రెడ్డి తన విహార యాత్రను ముగించారని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎద్దేవా చేసినట్టు ఈనాడు కథనం ప్రచురించింది.
ప్రతి వారం ఇంటికి వెళ్తూ చేసిన ఫ్యాన్సీ యాత్రకు పవిత్రత ఎక్కడుంటుందని చంద్రబాబు ప్రశ్నించారు. తాను అర్ధరాత్రి దాటాకా కొన్ని రోజులు నడిచిన సందర్భాలున్నాయని, కానీ ఏనాడైనా రాత్రి 7 గంటల తరువాత జగన్ పాదయాత్ర చేశారా? అని నిలదీశారని కథనం తెలిపింది.
రోజుకు 8 కిలోమీటర్లు నడిస్తే దానిని పాదయాత్ర అంటారా? వారానికోసారి విశ్రాంతి తీసుకుని చేసేది పాదయాత్రా? అని చంద్రబాబు ప్రశ్నించారని చెప్పింది.
బుధవారం రాత్రి ఉండవల్లిలోని ప్రజా వేదికలో విలేకరులతో కొద్దిసేపు ఇష్టాగోష్ఠిగానూ, అంతకుముందు ప్రకాశం జిల్లాలో జరిగిన కార్యక్రమాల్లోనూ చంద్రబాబు మాట్లాడారు.
ప్రజల మనోభావాలకు తగ్గట్లే రాష్ట్రంలో పొత్తులపై నిర్ణయం తీసుకుంటామని, కాంగ్రెస్‌తోనూ ఇదే తరహాలో వ్యవహరిస్తామని స్పష్టం చేశారు.
ఈనెల 19న కోల్‌కతాలో మమతా బెనర్జీ నిర్వహించే సభ రోజున అమరావతిలో ధర్మపోరాట సభ తేదీపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలిపారు. సరైన సమయంలో పార్టీ అభ్యర్థులను ప్రకటిస్తామని చెప్పారు.
అప్పట్లో జగన్ చేసిన అవినీతి కారణంగా రాష్ట్రం ఎన్నో ఆస్తులను కోల్పోయిందని చంద్రబాబు ధ్వజమెత్తారు.
అధికారులు, పారిశ్రామికవేత్తలు జైలుకు వెళ్లారు. ఆస్తులు నిరుపయోగమయ్యాయి' అంటూ అప్పటి వాన్‌పిక్ భూముల వ్యవహారాన్ని గుర్తు చేశారని ఈనాడు కథనం తెలిపింది.
డైనమిక్ సిటీగా హైదరాబాద్
చారిత్రక హైదరాబాద్ నగరం డైనమిక్ సిటీగా మరోసారి సత్తా చాటిందని ఆంధ్రజ్యోతి ఒక కథనం ప్రచురించింది.
అధునాతన అభివృద్ధి కేంద్రంగా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. అనతి కాలంలోనే అనూహ్య పురోగతి సాధించి ప్రపంచ వ్యాప్త ప్రధాన నగరాల్లో డైనమిక్ సిటీగా రెండో స్థానం దక్కించుకుంది.
వరుసగా మూడో యేడాది అగ్రభాగాన నిలిచిన హైదరాబాద్ నగర కీర్తి పతాకను విశ్వవ్యాప్తం చేసింది.
మంగళవారం జరిగిన వరల్డ్ ఎకనామిక్ ఫోరం(డబ్ల్యుఈఎఫ్) వార్షిక సమావేశంలో జేఎల్‌ఎల్ సిటీ మెమొంటమ్ ఇండెక్స్ (సీఎంఐ)- 2019 నివేదిక విడుదల చేశారు.
ప్రపంచ వ్యాప్తంగా 131 ప్రధాన వాణిజ్య నగరాల్లో జరుగుతోన్న అభివృద్ధి, ఇతరత్రా అంశాలను పరిశీలించి ప్రకటించిన ర్యాంకుల్లో హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచిందని కథనం తెలిపింది.
నగరంలో సామాజిక ఆర్థిక పరిస్థితులు, వాణిజ్యం, నిర్మాణ రంగంలో పురోగతి, తక్కువ సమయంలో గణనీయ ఎదుగుదలకు కారణాలను పరిశీలనలో పరిగణనలోకి తీసుకున్నారు.
ఈ క్రమంలోనే హైదరాబాద్ అగ్రభాగాన నిలిచిందని డబ్ల్యుఈఎఫ్ పేర్కొంది. గతేడాది డైనమిక్ సిటీగా మొదటిస్థానం దక్కించుకోగా.. ఇప్పుడు బెంగళూరు ఫస్ట్ ర్యాంకు సాధించిందని ఆంధ్రజ్యోతి వివరించింది.
2015లో సీఎంఐ ప్రకటించిన టాప్-20 నగరాల్లో చోటుదక్కని హైదరాబాద్.. మూడేళ్లుగా ప్రథమ శ్రేణిలో నిలుస్తోంది. 2017లో ఐదో స్థానం, 2018లో మొదటి ర్యాంకు సాధించగా.. ప్రస్తుతం రెండో స్థానంలో నిలిచినట్టు కథనం పేర్కొంది.
చిట్ ఫండ్ కంపెనీలకు కఠిన నిబంధనలు
చిట్‌ఫండ్ కంపెనీలు ఖాతాదారులను మోసం చేయకుండా స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ నిబంధనలను కఠినతరం చేసినట్లు నమస్తే తెలంగాణ కథనం ప్రచురించింది.
రిజిష్టర్డ్ చిట్‌ఫండ్ కంపెనీలు తమ చీటి విలువ మొత్తాన్ని డబ్బురూపంలోనే తమశాఖ అకౌంట్‌లో డిపాజిట్ చేయాలని ఆదేశాలు జారీచేసింది.
కంపెనీల వ్యవహారాలన్నింటినీ ఆన్‌లైన్‌లో నిక్షిప్తం చేయనున్నారు. ఇందుకోసం దేశంలో ఎక్కడాలేనివిధంగా బ్లాక్‌చైన్ సిస్టమ్‌ను ఉపయోగించడానికి రంగం సిద్ధం చేశారని కథనం తెలిపింది.
మొదటిదశలో ఈనెల నుంచి రంగారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాలలో ప్రయోగాత్మకంగా కొత్త విధానాన్ని అమలుచేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు.
ఖాతాదారులకు వెంటనే డబ్బులు ఇవ్వడానికి ఏదైనా లోపం ఉంటే సదరు డబ్బును చిట్‌ఫండ్ కంపెనీలు సొంతానికి ఉపయోగించుకోకుండా ప్రత్యేక ఖాతాలో జమచేయాలని అధికారులు ఆదేశాలు జారీచేసినట్లు నమస్తే తెలంగాణ పేర్కొంది.
తెలంగాణలో దాదాపు 10వేలకు పైగా గుర్తింపు పొందిన చిట్‌ఫండ్ కంపెనీలు ఏటా వందల కోట్లలో వ్యాపారం చేస్తున్నాయి. దేశంలో 40 శాతం టర్నోవర్ తెలంగాణలో జరుగుతున్నది.
దేశంలో, రాష్ట్రంలో కొన్ని కంపెనీలు ఖాతాదారుల నుంచి భారీ మొత్తంలో సొమ్ము వసూలు చేసిన తర్వాత బిచాణా ఎత్తివేస్తున్నాయి. కొన్ని చీటింగ్ ఫండ్‌ల వల్ల సామాన్యులు నిండా మునుగుతున్నారు.
ఇలాంటి పరిస్థితిని నివారించడానికి తెలంగాణ స్టాంపులు, రిజిస్ట్రేషన్‌శాఖ కొంతకాలంగా కసరత్తు చేస్తున్నది. కమిషనర్ చిరంజీవులు ఆధ్వర్యంలో జాయింట్ కమిషనర్ వేముల శ్రీనివాసులు చిట్‌ఫండ్ల నుంచి ప్రజలు మోసపోకుండా ఫూల్‌ప్రూప్ సిస్టమ్‌ను రూపొందించారని కథనంలో వివరించారు.
ఇవి కూడా చదవండి:
- విపరీతంగా షేర్ అవుతున్న ఈ ఫొటోలు నిజంగా భారతీయ సైనికులవి కాదు
- వై.ఎస్. జగన్ పాదయాత్ర ముగింపు సభ: "రైతులకు రూ.12,500 ఆర్థికసాయం"
- 10 శాతం రిజర్వేషన్లు: ‘ఉద్యోగార్థులకు క్యారెట్ ఎర’
- Fact Check: బీజేపీ కార్యకర్తలు నిజంగానే గోమాంసాన్ని తరలించారా...
- చరిత్రలోనే బలమైన ఈస్టిండియా కంపెనీ ఉద్యోగులకు తెలుగు ఎందుకు నేర్పేది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)