You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
వామపక్ష సంఘాలకు చెందిన ముగ్గురు యువతులు ఏమయ్యారు
హైదరాబాద్ నగరంలో మావోయిస్టులతో సంబంధాలున్నాయన్న ఆరోపణతో ప్రభుత్వ ఉద్యోగి ఒకరిని అరెస్టు చేశారు పోలీసులు. మరోవైపు వామపక్ష సంఘాల్లో చురుగ్గా ఉంటున్న ముగ్గురు యువతులనూ పోలీసులుగా చెప్పుకున్న కొందరు తీసుకువెళ్లారు.
హైదరాబాద్ మౌలాలిలో నివాసం ఉంటోన్న ఆత్మకూరు లక్ష్మీనరసమ్మ, రమణయ్యల కుమార్తెలు భవాని, అన్నపూర్ణ, అనూషలను డిసెంబరు 22న కొందరు వ్యక్తులు పోలీసులమని చెప్పి వారి ఇంటి నుంచి తీసుకువెళ్లారు.
భవాని అమరుల బంధుమిత్రుల సంఘంలోనూ, అన్నపూర్ణ, అనూషలు మహిళా సంఘాల్లోనూ పనిచేస్తున్నారని వారి తల్లి లక్ష్మీ నరసమ్మ చెప్పారు.
"కుషాయిగూడ పోలీసులమంటూ 15 మంది మగవాళ్లు, ఇద్దరు మహిళలు వచ్చారు. ఇంకే వివరాలు చెప్పకుండా మా ముగ్గురు కుమార్తెలను తీసుకు వెళ్లారు. ఇప్పటి వరకూ వారి ఆచూకీ లేదని" హైకోర్టుకు రాసిన లేఖలో లక్ష్మీనరసమ్మ పేర్కొన్నారు.
తన ఫిర్యాదును హెబియస్ కార్పస్ రిట్ గా స్వీకరించాలని ఆమె కోర్టుకు విజ్ఞప్తి చేశారు. తమ పిల్లలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ వారి తల్లి లక్ష్మీ నరసమ్మ వీడియో ప్రకటన విడుదల చేశారు.
ప్రస్తుతం భవాని అమరుల బంధు మిత్రుల సంఘానికి రాష్ట్ర సహాయ కార్యదర్శిగా ఉన్నారు. అన్నపూర్ణ సీఎంఎస్‌లో రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలిగా ఉన్నారు.
తాజా పరిణామాలపై పాత్రికేయులు ఎన్.వేణుగోపాల్ స్పందిస్తూ... తెలంగాణలో పోలీసు నియంత పాలన మళ్లీ మొదలైందనీ, అందరూ దీన్ని ఖండించాలనీ అన్నారు. ఆ అమ్మాయిలను వెంటనే విడుదల చేయాల్సిందిగా ప్రజాస్వామ్యవాదులు డిమాండ్ చేయాలని కోరారాయన.
వీరి విడుదల కోరుతూ పలు ప్రజా సంఘాల ప్రతినిధులూ ప్రకటన విడుదల చేశారు.
అయితే తామెవరినీ అదుపులోకి తీసుకోలేదనీ, ఈ వ్యవహారంతో తమకు ఏమాత్రం సంబంధం లేదనీ కుషాయిగూడ పోలీసులు ‘బీబీసీ’తో చెప్పారు.
వారు కనపడకపోవడంపై తమకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని కుషాయిగూడ పోలీసులు అన్నారు.
మరోవైపు ఉప్పల్ ఎన్జీఆర్ఐలో పనిచేస్తోన్న నక్కా వెంకట్రావు అలియాస్ మూర్తి అనే వ్యక్తిని ఛత్తీస్‌గఢ్ పోలీసులు అరెస్టు చేశారు.
దీనిపై ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం దుర్గ్ రేంజ్ ఐజీ జీపీ సింగ్‌ను బీబీసీ సంప్రదించగా నక్కా వెంకట్రావు 1980ల నుంచీ మావోయిస్టులతో సంబంధాలు కొనసాగిస్తున్నారనీ, కేంద్ర కమిటీ సభ్యులతో సంబంధాలున్నాయనీ, ఇద్దరు మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యులతో అతను మాట్లాడినట్టు తమ వద్ద సాక్ష్యాలున్నాయనీ చెప్పారు .
"పట్టణ ప్రాంతంలో ప్రభుత్వ ఉద్యోగంలో ఉండడం వల్ల అతనిపై ఎవరికీ అనుమానం రాలేదు. ఓ రకంగా చెప్పాలంటే అతను జాతీయ స్థాయిలో నక్సలైట్లకు కోఆర్డినేటర్ గా పనిచేస్తున్నాడనుకోవాలి. అసలు అతని పేరు వెంకట రావు అని తమకు తెలియదనీ, మూర్తి అనే పేరు మాత్రమే మాకు తెలుసు. గతంలో దొరికిన మావోయిస్టులు ఇచ్చిన సమాచారం ఆధారంగా అతణ్ణి పట్టుకున్నాం. అతని దగ్గర నుంచి రెండు వాకీటాకీలు కొంత సమాచారం సేకరించాం. అతను ఎన్జీఆర్ఐలో కీలక బాధ్యతల్లో ఉండడంతో ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నాం" అన్నారు జీపీ సింగ్.
కాగా సోమవారం నక్కా వెంకట్రావును బిలాస్పూర్‌లోని స్థానిక న్యాయస్థానంలో ప్రవేశ పెట్టారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)