You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మూక దాడుల్లో చిక్కుకున్నప్పుడు తప్పించుకునే మార్గాలు
మూకదాడులు భారత్‌లో ప్రాణాంతకంగా మారాయి. సోషల్ మీడియాలో వ్యాపించిన వదంతులు చాలామంది చావుకు కారణమయ్యాయి. బీబీసీ పరిశోధన ప్రకారం 2014 ఫిబ్రవరి నుంచి 2018 జూలై మధ్య కనీసం 31 మంది మూక దాడుల్లో ప్రాణాలు కోల్పోయారు. మరెంతో మంది గాయాల పాలయ్యారు.
సామాన్య ప్రజలను కూడా కిడ్నాపర్లుగా భావించి దాడి చేసి హత్య చేసిన ఉదంతాలూ ఉన్నాయి. అలాంటి సంఘటనలను గమనిస్తే ఎవరైనా సరే మూక మధ్యలో ఇరుక్కుపోయే అవకాశం ఉందని తెలుస్తుంది. ఒకవేళ ఎదుటి వ్యక్తిని చంపడమే లక్ష్యంగా జనం గుమిగూడితే మాత్రం వాళ్ల నుంచి తప్పించుకోవడం కాస్త కష్టమే.
ఆందోళనలు, నిరసనల సమయంలో కూడా జనాలు విచక్షణా రహితంగా దాడులకు పాల్పడే అవకాశాలున్నాయి.
అలాంటప్పుడు ఆవేశంగా ఉన్న జనం మధ్య నుంచి జాగ్రత్తగా బయటపడటానికి కొన్ని మార్గాలున్నాయి.
1. మొదటి జాగ్రత్త
జనం ఆవేశంగా, కోపంగా ఉన్నట్టు కనిపిస్తే ఏమాత్రం వాదించకుండా చల్లగా అక్కడి నుంచి జారుకోవడానికి ప్రయత్నించడం చాలా ముఖ్యం. వాళ్ల ముందు నుంచి కాకుండా, ఎవరూ గమనించకుండా బయటపడే ప్రయత్నం చేయాలి. ఒకవేళ రోడ్డుకు అటూ ఇటూ బ్లాక్ చేసి ఉంటే, రోడ్డుకు ఓ వైపు వెళ్లి స్థిరంగా నిలబడిపోవడం మేలు.
కోపంగా ఉన్న జనం మధ్య ఉన్నప్పుడు వాళ్లు చేసే పనిలో భాగం కాకపోవడం, వారి చర్యలకు స్పందించకపోవడం మంచిది.
2. పారిపోలేకపోతే...
గుంపు నుంచి బయటపడటం వీలు కాకపోతే, వాళ్లలో ఎవరో ఒకరితో మాట్లాడి అప్పటికప్పుడు వారికి కాస్త దగ్గరయ్యే ప్రయత్నం చేయాలి. అలా ఎవరినైనా మచ్చిక చేసుకోగలిగితే కాస్త భద్రత లభించే అవకాశం ఉంది. అది ఏదైనా బృందం కలిసి నిర్వహించే ఆందోళన అయితే, ఆ బృంద నాయకుడితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అతడిని కాస్త మచ్చిక చేసుకోగలిగితే సురక్షితంగా బయటపడే అవకాశం ఉంది. మరోపక్క, ఆ నాయకుడి స్వభావం కూడా గమనించాలి. అతడు మరీ కోపిష్టిలా కనిపిస్తే అతడితో మాట్లాడకపోవడమే మంచిది.
ఒకవేళ ఆ ఆందోళన ఓ బృందం నిర్వహించేది కాకుండా ఎవరైనా జనాలు కలిసి నిర్వహించేది అయితే, ఆ గుంపులో అందరి కంటే వెనుక ఉన్నవారితో మాట్లాడే ప్రయత్నం చేయాలి. సాధారణంగా గుంపులో ముందు, మధ్యలో ఉండేవారు ఎక్కువ ఆవేశంగా ఉండే అవకాశం ఉంది. వాళ్లు ఎందుకు కోపంగా ఉన్నారో తెలుసుకునే ప్రయత్నం చేస్తే, వారు కొంత మెత్తబడే అవకాశం ఉంది.
అందరి ముందూ కాకుండా వారిని కాస్త దూరంగా తీసుకెళ్లి మాట్లాడటం మేలు. కోపంగా ఉన్న గుంపు ముందు వేరొకరితో మాట్లాడే ప్రయత్నం చేయకపోవడం మంచిది. అలాగే ఎవరితోనైనా మాట్లాడే సమయంలో ఇతరుల దృష్టి మనపై పడకుండా జాగ్రత్త పడాలి.
3. నేరుగా మాట్లాడాలి
నాయకుడితో లేదా బృందంలో ఎవరితోనైనా మాట్లాడేప్పుడు తడబడకుండా నేరుగా వారి కళ్లలోకి చూస్తూ మాట్లాడాలి. దానివల్ల మీరు ఏ బృందంలోనూ సభ్యులు కాదని, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా ఉన్నారనే భావన వాళ్లకు కలుగుతుంది. గుంపు మానసిక స్థితిని అర్థం చేసుకొని మౌనంగా ఉండాలి. వాళ్లు కోపంగా, ఆవేశంగా ఉంటే అక్కడి నుంచి జారుకోవాలి.
4. మూకకు దూరంగా
ఆందోళన మధ్యలో చిక్కుకున్నప్పుడు మీ వల్ల వారికి ఎలాంటి నష్టం లేదనే భావనను గుంపులోని వాళ్లకు కల్పించడం చాలా ముఖ్యం. అందుకే అక్కడ ఏం జరిగినా స్పందించకూడదు. గుంపుకు దూరంగా ఉంటూ, మీ వల్ల ఎవరికీ ఎలాంటి ఇబ్బంది లేదని వారికి స్పష్టం అర్థమయ్యేలా చేయాలి.
5. ఎవరినీ కవ్వించొద్దు
ఆవేశంలో ఉన్న మూకను ఎదుర్కొనే సమయంలో ఎవరినీ ఏమాత్రం కవ్వించకుండా జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం. ఎవరి పక్షమూ వహించకుండా పక్కకు తప్పుకోవాలి.
గుంపులో సభ్యులకు ఎదురుగానో, మధ్యలోనో కాకుండా ఏదో ఒక వైపుకి వెళ్లిపోవాలి. అన్నిటికంటే ముఖ్యంగా, అక్కడి నుంచి ఎలాగోలా జారుకోవాలి.
(యూకేకు చెందిన భద్రతా నిపుణుడు, ప్రమాదాన్ని అంచనా వేయగల నిపుణుడు ఆండ్రీ మెక్ ఫార్లెన్ చెప్పిన విషయాలివి)
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)