You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
అరవింద్ సుబ్రమణియన్: నోట్ల రద్దు ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది
ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య ఘర్షణపూర్వక వాతావరణంపై భారత మాజీ ప్రధాన ఆర్థిక సలహాదారు అరవింద్ సుబ్రమణియన్ బీబీసీతో మాట్లాడారు.
బీబీసీ ప్రతినిధి సమీర్ హష్మికి ఇచ్చిన ప్రత్యేక ఇంటర్వ్యూలో ఆయన.. ప్రభుత్వం ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాలని, అదే సమయంలో ఆర్‌బీఐ కూడా ప్రభుత్వానికి సహకరించాలని కోరారు.
గత జూన్‌లో అరవింద్ సుబ్రమణియన్ కేంద్ర ప్రభుత్వ ప్రధాన ఆర్థిక సలహాదారు పదవికి రాజీనామా చేశారు. తాజాగా.. 'ఆఫ్ కౌన్సిల్ - ద చాలెంజెస్ ఆఫ్ మోదీ- జైట్లీ ఎకానమీ' అన్న తన పుస్తకంలో ఆయన కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నోట్ల రద్దును ‘ఆర్థిక వ్యవస్థను దెబ్బ తీసిన నిర్ణయం'గా పేర్కొన్నారు.
''మొదట నోట్ల రద్దు, ఆ తర్వాత జీఎస్టీ.. ఈ రెండూ కలిసి నగదు లభ్యతపై తీవ్ర ప్రభావం చూపాయి. నేడు మనం చూస్తున్న ఆర్థిక పరిస్థితిపై ఆ రెండింటి ప్రభావం చాలా ఉంది. నేను ఎప్పుడూ జీఎస్టీని సమర్థించేవాడిని. కానీ కొంతవరకు నోట్ల రద్దు ప్రభావం జీఎస్టీపై పడింది,'' అని ఆయన తెలిపారు.
ప్రభుత్వం ఆయనను సంప్రదించిందా?
రెండేళ్ల క్రితం కేంద్ర ప్రభుత్వం హఠాత్తుగా 500, 1000 నోట్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దానికి ప్రధాన కారణం నల్లధనాన్ని అరికట్టడం అని పేర్కొన్నారు. కానీ నోట్లు రద్దు చేసినా, 99 శాతం నోట్లు తిరిగి బ్యాంకులకు చేరుకున్నాయి. అయితే ప్రభుత్వం మాత్రం నోట్ల రద్దు వల్ల ఆదాయ పన్ను చెల్లించే వారి సంఖ్య పెరిగిందని అంటోంది.
కానీ నోట్ల రద్దు వల్ల నష్టం జరగలేదా?
దీనికి సమాధానంగా సుబ్రమణియన్, ''నాకు తెలిసి ఇప్పటివరకు నోట్ల రద్దు స్వల్పకాలిక, దీర్ఘకాలిక లాభనష్టాలపై ఎవ్వరూ ఒక సమగ్ర పరిశోధన చేయలేదు. ఈ పని ఇప్పటికీ చేయొచ్చు. నోట్ల రద్దు వల్ల లాభం జరిగిందని చాలా మంది అంటుంటే, నష్టం కలిగిందని మరికొందరు అంటున్నారు.'' అన్నారు.
అరవింద్ సుబ్రమణియన్ తన పుస్తకంలో నోట్ల రద్దుకు ముందు ప్రభుత్వం తనను సంప్రదించిందా లేదా అన్న విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. ఇంటర్వ్యూలో కూడా ఆయన ఆ విషయం గురించి మాట్లాడడానికి నిరాకరించారు.
''ఇలాంటి విషయాలు బయట మాట్లాడకూడనివి అని నేను పుస్తకంలో కూడా చెప్పాను. దానికి బదులుగా మనం ముందుకు వెళ్లి కొత్త విషయాలను తెలుసుకుంటే బాగుంటుంది,'' అన్నారు.
'ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడండి'
భారత ప్రభుత్వానికి, ఆర్‌బీఐకి మధ్య ఉన్న ఘర్షణపూర్వక వాతావరణాన్ని ప్రస్తావించినపుడు అరవింద్ సుబ్రమణియన్, ''అభిప్రాయభేదాలు ఉండవచ్చు. కానీ వాటిని చర్చించి పరిష్కరించుకోవాలి. ఇది ఇచ్చిపుచ్చుకునే విధానంలో సాగాలి. అప్పుడే దేశానికి శ్రేయస్కరం'' అన్నారు.
ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దాని అర్థం ఆర్‌బీఐని విమర్శించరాదని కాదు. కానీ ఆర్‌బీఐ ఒక స్వతంత్ర సంస్థ అన్న అవగాహనతో దానితో వ్యవహరించాలి.
''అదే సమయంలో ఆర్‌బీఐ కూడా ప్రభుత్వంతో సహకరించాలి, ఇది రెండు వైపుల నుంచి జరగాలి'' అని అరవింద్ సుబ్రమణియన్ అన్నారు.
ఆర్‌బీఐని నియంత్రించడానికి ప్రభుత్వం సెక్షన్ 7ను ఉపయోగించుకోవడం సబబే అని అరవింద్ సుబ్రమణియన్ అన్నారు.
''కానీ సెక్షన్ 7ను తేలికగా ఉపయోగించకూడదు. ఆర్‌బీఐ స్వేచ్ఛను, స్వాతంత్ర్యాన్ని హరిండానికి దాన్ని ఉపయోగించుకోకూడదు'' అన్నారు.
ఆర్‌బీఐ స్వతంత్ర ప్రతిపత్తి అన్నిటికన్నా ముఖ్యం అన్న ఆయన.. అదే సమయంలో ప్రభుత్వంతో సమన్వయం కూడా అవసరమే అన్నారు.
ఇవి కూడా చదవండి:
- రామమందిరం నిర్మాణానికి మోదీ ప్రభుత్వం ఆర్డినెన్స్ తీసుకురానుందా?
- క్యాథలిక్ చర్చిలో పవిత్ర కన్యలు: 'నేను క్రీస్తును పెళ్లాడాను... నా శరీరాన్ని అర్పిస్తాను'
- ఇరాన్: జర్నలిస్టులు, కవులను వెంటాడిన మృత్యువు.. దేశాన్ని వణికించిన సీరియల్ హత్యలు
- గద్దర్ ఇంటర్వ్యూ: 'ఓటు కూడా ఒక పోరాట రూపమే'
- పిల్లలను కనాలంటే భయమా? అది టోకోఫోబియా అవ్వొచ్చు
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)