‘ఆరేళ్ల కిందట మాయమైన నా కూతురు ఇంకా బతికే ఉంటుంది’

    • రచయిత, సౌతిక్ బిస్వాస్
    • హోదా, బీబీసీ ప్రతినిధి

ఆరేళ్ల కిందట బిహార్‌లో 12 ఏళ్ల బాలికను ఆమె బెడ్‌రూం నుంచి అపహరించుకుపోయారు. దీనిపై విచారణ చేయాలని సుప్రీంకోర్టు సీబీఐని ఆదేశించింది. అయితే ఈ కేసులో వాళ్లకూ ఏమీ అంతు చిక్కలేదు. మరి ఎందుకు ఆ బాలిక తల్లిదండ్రులు ఇంకా తమ కూతురు జీవించే ఉంటుందని భావిస్తున్నారు?

బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో అతుల్య చక్రవర్తి ఒక రాత్రి బాత్రూంకు వెళ్లడానికి నిద్రలేచారు. దొంగలు పడకుండా ఉండడం కోసం బైట ఏర్పాటు చేసుకున్న రెండు ఫ్లూరోసెంట్ బల్బులు వెలగకపోవడం ఆయనకు అసహజంగా అనిపించింది.

బాత్రూంకు వెళ్లొచ్చి ఆయన తన భార్య మోయిత్రిని నిద్ర లేపి, పడుకునే ముందు ఆమె ఏమైనా ఆ లైట్లను ఆఫ్ చేసిందేమో ఆరా తీశారు. ఆమె తాను ఆఫ్ చేయలేదనడంతో వాళ్లిద్దరూ కలిసి వరండాలోకి వచ్చారు.

టార్చి వెలుగులో కనిపించిన దృశ్యం చూసి వాళ్లిద్దరికీ నోట మాట రాలేదు.

అక్కడ వరండావైపు ఉన్న ఒక గది తలుపులు బార్లా తెరిచి ఉన్నాయి. దాంతో వాళ్ల నిద్ర మత్తు ఎగిరిపోయింది.

ఆందోళనతో మోయిత్రి 12 ఏళ్ల కూతురు నవ్‌రుణా గదిలోకి వెళ్లారు.

సన్నగా ఉండే ఆ అమ్మాయి ఆ రోజు చేతులకు గోరింటాకు పెట్టుకుని, టీవీలో కార్టూన్ సినిమాలు చూసి, బ్రెడ్డు పాలు తాగి నిద్రపోయింది.

గదిలోకి వెళ్లిన మోయిత్రికి కూతురు కనిపించలేదు. ఆమె కప్పుకున్న సిల్కు షాల్, తలగడ, దోమతెర చెక్కు చెదరలేదు. కానీ పడక మీద కూతురు మాత్రం లేదు.

2012, సెప్టెంబర్ 18న నవ్‌రుణా చక్రవర్తి అలా మాయమైంది.

'మాయమైన' నవ్‌రుణా

ఆమె గదిని ఆనుకుని ఉన్న వీధిలోంచి కిటికీకి ఉన్న ఊచలు వంచి, ఎవరో ఆమె గదిలోకి ప్రవేశించి ఉంటారని పోలీసులు భావించారు.

లోపలికివచ్చిన వ్యక్తి బహుశా నిద్రపోయిన నవ్‌రుణాకు ఏదైనా మత్తుమందిచ్చి ఉండాలి. భయపడిపోయిన ఆ బాలిక పెనుగులాడినట్లు కనిపిస్తోంది. అక్కడి నుంచి ఆ బాలికను వరండాలోకి మోసుకుపోయారు.

లోపలికి వచ్చిన వ్యక్తి బయటున్న వాళ్లు లోపలికి రావడానికి వీలుగా లోపలి నుంచి తలుపులు తెరిచినట్లు పోలీసులు భావించారు. ఆ తర్వాత ఆ బాలికను మెయిన్ రోడ్ మీద నిలిపి ఉన్న వాహనంలోకి తీసుకుపోయారు.

ఆరేళ్ల అనంతరం నవ్‌రుణా మరణించి ఉంటుందని పోలీసులు అంటున్నా, తల్లిదండ్రులు మాత్రం ఇంకా ఆమె బతికే ఉందని నమ్ముతున్నారు.

నవ్‌రుణా మాయమైన మూడు నెలల తర్వాత పోలీసులు ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేశారు. వారిలో ఒకరు అతుల్య చక్రవర్తి దూరపు బంధువు. వాళ్లు ఏదో దాస్తున్నట్లు పోలీసులకు అనిపించింది. కానీ ఆ నేరం వాళ్లే చేసినట్లు వాళ్లకు సాక్ష్యాధారాలేమీ లభించలేదు.

డీఎన్‌ఏ పరీక్ష

2012, నవంబర్ 26న చక్రవర్తి ఇంటికి సమీపంలోని డ్రైనేజీలో ఒక ప్లాస్టిక్ సంచిలో ఒక కొన్ని ఎముకలు లభించాయి.

ఆ తర్వాత పోలీసులు చక్రవర్తి కుటుంబానికి వాళ్ల కూతురి ఎముకలు దొరికాయని చెప్పారు. కానీ వాళ్లు దాన్ని విశ్వసించడానికి నిరాకరించారు. అవి తమ కూతురివే అనడానికి ఆధారం ఏంటి?

ఆ తర్వాత ఆ ఎముకలను ఫోరెన్సిక్ లేబ్‌లో పరీక్ష చేశారు. వాటిని పరీక్షించిన వ్యక్తి, ''అవి 13-15 ఏళ్ల వయసున్న బాలికవి. ఆ ఎముకలు దొరికిన నాటికి 10-20 రోజుల ముందు ఆమె మరణించి ఉండాలి. అయితే మరణానికి స్పష్టమైన కారణం తెలియడం లేదు'' అని పేర్కొన్నారు.

అయితే చక్రవర్తి దంపతులు మాత్రం అవి తమ కూతురివని అంగీకరించలేదు. 2014లో చక్రవర్తి దంపతులు డీఎన్‌ఏ పరీక్షలకు అంగీకరించారు కానీ వాటి ఫలితాలు పోలీసులు తమకు వెల్లడించలేదని వాళ్లు తెలిపారు.

''ఆ ఎముకలు మా కూతురివే అయితే, మా డీఎన్‌ఏ ఫలితాలు ఎందుకు వెల్లడించడం లేదు'' అని చక్రవర్తి ప్రశ్నించారు.

అయితే ఈ కేసును చేపట్టిన సీబీఐ మాత్రం ఇది కిడ్నాప్ కమ్ మర్డర్ కేసు అని, ఈ హత్యకు కారణం చక్రవర్తి కుటుంబం ఉంటున్న ఇంటికి సంబంధించిన వివాదమే అంటోంది.

ముజఫర్‌పూర్‌లో హత్యలు, కిడ్నాప్‌లు సర్వసాధారణం. ఇక్కడ ల్యాండ్ మాఫియా భయపెట్టి, బెదిరించి భూములను లాక్కుంటుంది. అల్లరి మూకల కారణంగా మహిళలు ఒంటరిగా వీధుల్లో తిరగలేని పరిస్థితి.

అతుల్య చక్రవర్తి ఒక రిటైర్డ్ ఫార్మాస్యూటికల్ రెప్రజెంటేటివ్. ఆయన తన పాత ఇంటిని అమ్మేసి మరో చోట ఇల్లు తీసుకోవాలనుకుంటున్నారు.

నవ్‌రుణా కనిపించకుండా పోవడానికి రెండు వారాల ముందు ఆయన తన ఇంటిని 3 కోట్ల రూపాయలకు విక్రయించడానికి ఒక అగ్రిమెంట్‌పై సంతకాలు చేశారు. 20 లక్షల రూపాయల అడ్వాన్స్ కూడా తీసుకున్నారు.

అయితే ఈ విషయం తెలిసిన మరో రియల్టర్ ఆ ఒప్పందాన్ని రద్దు చేసుకోవాలని చక్రవర్తిపై ఒత్తిడి తెచ్చారు. స్థానిక పోలీసులు కూడా వచ్చి తనను ఆ ఒప్పందం రద్దు చేసుకోవాలని కోరినట్లు చక్రవర్తి చెబుతున్నారు. అందుకే తన కూతుర్ని మాయం చేశారని ఆయన ఆరోపిస్తున్నారు.

ఆ తర్వాత కొన్నేళ్ల పాటు పోలీసులు నవ్‌రుణా కుటుంబ సభ్యులు, స్నేహితులు, బంధువులను విచారించారు. ఆ బాలిక ఒక చోట తన 'డ్రీమ్ బాయ్' గురించి రాసిందని పోలీసులు చెబుతున్నారు. పరువు హత్య కోణం నుంచి చక్రవర్తి తన కూతుర్ని హత్య చేశాడేమో అని వాళ్లు ఇంటి సెప్టిక్ ట్యాంకులో కూడా పరిశీలించారు.

పోలీసులు నవ్‌రుణా కుటుంబ సభ్యులతో పాటు కనీసం 100 మంది అనుమానిత వ్యక్తుల కాల్ రికార్డులను పరిశీలించారు. బాలికను అక్రమ రవాణా చేశారేమో అనే అనుమానంతో స్థానిక రెడ్ లైట్ ఏరియాతో పాటు అనేక చోట్ల రెయిడ్స్ నిర్వహించారు.

నవ్‌రుణాను కనిపెట్టడానికి మేం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశామని పోలీసులు కోర్టుకు తెలిపారు. అయితే ఫలితం మాత్రం శూన్యం.

గత ఏప్రిల్ నెలలో ఆరుగురు అనుమానితులను అరెస్ట్ చేసినట్లు సీబీఐ సుప్రీంకోర్టుకు తెలిపింది. అయితే వాళ్ల ఇళ్లలో వెదికినా, అనుమానించదగ్గవేవీ లభించలేదు.

ఈ సంఘటన జరిగినప్పుడు విచారణతో సంబంధమున్న ముగ్గురు సీనియర్ పోలీసుల అధికారులను ప్రశ్నించినట్లు కూడా సీబీఐ కోర్టుకు తెలిపింది.

వారిలో ఒకరు ముజఫర్‌పూర్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఫస్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్. ఆయనకు నార్కో, బ్రెయిన్ మ్యాపింగ్ పరీక్షలు చేయాలని సీబీఐ కోర్టుకు విజ్ఞప్తి చేసింది.

ఈ కేసులో 'బ్యూరోక్రాట్-మాఫియా' సంబంధాలు కనిపిస్తున్నాయని, విచారణ చేస్తున్న పోలీసుల తీరు అనుమానాస్పదంగా ఉందని పేర్కొంది.

'గొంతు వినిపించింది'

కూతురి విషయం చక్రవర్తి కుటుంబాన్ని బాగా దెబ్బ తీసింది. గుండె జబ్బు ఉన్న చక్రవర్తి స్లీపింగ్ పిల్స్ ఓవర్ డోస్ వేసుకుని మరణం అంచుల వరకు వెళ్లొచ్చారు.

గత రెండేళ్లుగా చక్రవర్తి భార్య మోయిత్రి స్థానిక పోలీస్ స్టేషన్‌కు వెళ్లి తన కూతురు ఏమైందో చెప్పాలని వాళ్లను ప్రశ్నిస్తున్నారు.

''నాతో ఆటలాడకండి. నా కూతుర్ని నాకిచ్చేయండి'' అని ఆమె వాళ్లపై కేకలు వేస్తారు.

తన కూతురు మాయమయ్యాక చక్రవర్తి, పోలీసు అధికారులతో తన సంభాషణను, తనకు వచ్చిన మిస్టరీ కాల్స్‌ సంభాషణలన్నీ రికార్డు చేశారు. వాటిలో తనకు ఎక్కడో తన కూతురి గొంతు వినిపించిందని ఆయన అంటారు.

తను పోలీసు అధికారులతో చేసిన సంభాషణను ఆయన సవివరంగా ఐదు డైరీలలో రాశారు. రాజకీయనాయకులకు, జడ్జీలకు, ప్రధానికి, రాష్ట్రపతికి కూడా ఆయన తనకు న్యాయం చేయాలంటూ లేఖలు రాశారు. స్వయంగా సీఎం నితీష్ కుమార్‌ను కలుసుకుని విచారణ నత్త నడకన సాగుతోందంటూ ఫిర్యాదు చేశారు.

ఈ సమాజంలో సామాన్యులకు న్యాయం జరగదని, తన కూతుర్ని రక్షించుకోలేకపోయానని ఆయన ఆవేదన వ్యక్తం చేస్తుంటారు.

కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న చక్రవర్తి ఇల్లు ఇప్పుడొక జ్ఞాపకాల మ్యూజియం. నవ్‌రుణా గదిలో ఆమె జ్ఞాపకాలు మాసిపోకూడదని దేన్నీ కదల్చలేదు.

ఆమె స్కూలు యూనిఫామ్, ఆమె వాడిన తువ్వాలు, స్కూలుకు వెళ్లేందుకు ఉపయోగించే పింకు రంగు సైకిల్, ఎర్ర పర్సు, దానిలోని 200 రూపాయలు ఇంకా అలాగే ఉన్నాయి.

తన కూతురు ఎప్పటికైనా తిరిగి వస్తుందని ఆ తల్లిదండ్రులు ఇంకా నమ్ముతూనే ఉన్నారు.

''నవ్‌రుణా వస్తోంది. ఆమె వస్తువులన్నీ జాగ్రత్త చేయాలి'' అంటుంది తల్లి మోయిత్రి.

''తనకిప్పుడు 18 ఏళ్లు వచ్చేశాయి. నా తల్లి ఇప్పుడు ఎలా ఉంటుందో?''

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)