You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
పంజాబ్ రైలు ప్రమాదం: దసరా వేడుకల్లో అపశృతి... 58 మంది దుర్మరణం
అమృత్‌సర్‌లోని జోడా పాటక్ వద్ద దసరా వేడుకల సందర్భంగా జరిగిన ప్రమాదంలో 58 మంది చనిపోయారని స్థానిక పోలీసులు తెలిపారు. 100 మందికిపైగా గాయపడ్డారు.
అమృత్‌సర్‌లో దసరా వేడుకల సందర్భంగా రావణ దహన కార్యక్రమం జరుగుతోంది. అయితే మంటలు అంటించిన తరువాత రావణ దిష్టిబొమ్మ అక్కడున్నవారిపై పడటంతో తొక్కిసలాట మొదలైంది. అక్కడి నుంచి తప్పించుకునేందుకు ప్రజలు పక్కనే ఉన్న రైలు పట్టాలపైకి పరుగులు తీశారు.
ఈ క్రమంలో రైలు రావడంతో పలువురు చనిపోయారని ప్రాథమిక సమాచారం.
ఇదే సమయంలో టపాసులు కూడా పేలడంతో రైలు వచ్చే విషయాన్ని స్థానికులు గుర్తించలేదని చెబుతున్నారు.
ఈ ప్రమాదం సాయంత్రం ఆరున్నర గంటల సమయంలో జరిగింది.
కార్యక్రమానికి పంజాబ్ ఉప ముఖ్యమంత్రి నవజోత్ సిద్దూ భార్య నవజోత్ కౌర్ సిద్ధూ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
స్థానికులు చెబుతున్న ప్రకారం ఇక్కడ దాదాపు 700 మంది ఉన్నారు.
మృతుల్లో పలువురు చిన్నారులు కూడా ఉన్నారని స్థానికులు విలేఖర్లకు తెలిపారు.
ప్రమాద సమాచారం తెలుసుకున్న పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్ వెంటనే అమృత్‌సర్‌కి ప్రయాణమయ్యారు. మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు.
మరోవైపు ఈ ప్రమాదానికి కారణం పాలనా వైఫల్యమేనంటూ స్థానికులు ఆందోళనకు దిగారు.
రైలు ఇటువైపు వస్తున్నపుడు హార్న్ కూడా కొట్టలేదని ఆరోపించారు.
క్షతగాత్రులను పోలీసులు వెంటనే ఆస్పత్రికి తరలించారు.
ఈ ప్రమాదం తనను తీవ్రంగా కలచివేసిందని ప్రధాని మోదీ అన్నారు. మృతుల కుటుంబాలకు ఆయన సానుభూతి తెలిపారు. తక్షణ సాయం అందించాలని అధికారులను కోరినట్లు ఆయన ట్విటర్ ద్వారా పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి)