You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ఆ గర్భిణిని కాపాడిన పోలీసు హీరో ఎవరు?
- రచయిత, గురుప్రీత్ సైనీ
- హోదా, బీబీసీ ప్రతినిధి
మధురలో ఒక వ్యక్తి ఒక మహిళను ఎత్తుకుని హాస్పిటల్ వైపు పరిగెత్తుతున్నారు. అయితే ఆయన ఆమె భర్తా కాదు, బంధువూ కాదు. ఆమెకు పరిచయం లేని వ్యక్తి.
ఇక ఆ మహిళ విషయానికి వస్తే - ఆ వ్యక్తే కాదు.. ఆ ఆసుపత్రి, ఆ నగరం కూడా ఆమెకు కొత్తే.
ఆసుపత్రిలో చేరిన కొద్ది సేపటికే ఆ మహిళ ఒక పిల్లవాడికి జన్మనిచ్చారు. ప్రస్తుతం ఆ తల్లీబిడ్డా ఇద్దరూ క్షేమంగా ఉన్నారు.
ఇంతకూ ఆ మహిళ ఎవరు? ఆమె ఎక్కడి నుంచి వచ్చారు? ఆమెను ఎత్తుకుని పరిగెత్తిన పోలీసాయన ఎవరు?
ఎందుకు ఆయన ఆమెను అలా ఎత్తుకు వచ్చారు? ఈ ప్రశ్నలు చాలా మందిని వేధిస్తుండొచ్చు.
భావనది హర్యానాలోని వల్లబ్‌గఢ్. కొన్నాళ్ల క్రితం ఆమె హాత్రస్‌లోని తన తల్లి వద్దకు వచ్చారు.
శుక్రవారం ఆమె తిరిగి వల్లబ్‌గఢ్‌కు వెళ్లాలనుకున్నారు. భర్త మహేశ్, మూడేళ్ల కూతురుతో కలిసి రైలు ఎక్కారు. రైలు ఎక్కగానే ఆమెకు నొప్పులు మొదలయ్యాయి.
అంబులెన్స్ లేదు
20 ఏళ్ల భావన ''నాకు ఎన్ని నెలలో నేను మర్చిపోయాను. నాకు ఇంకా ఎనిమిది నెలలే అనుకున్నాను'' అని బీబీసీకి తెలిపారు.
రైలు ఎక్కాక భావనకు నొప్పులు ఎక్కువ రావడంతో, మహేశ్ తన భార్యను తీసుకుని మధుర స్టేషన్‌లో దిగిపోయారు.
స్టేషన్‌లో మహేశ్ చాలా మందిని సహాయం అడిగారు కానీ ఎవరూ ముందుకు రాలేదు.
సరిగ్గా అదే సమయంలో హాత్రస్ ఎస్‌ఓ సోనూ కుమార్ స్టేషన్ నుంచి బైటికి వెళ్తున్నారు.
సోనూ కుమార్ కోర్టు పని మీద మధురకు వచ్చారు. మహేశ్ అందరినీ బతిమాలుతుండడం చూసి ఆయన అతని వద్దకు వచ్చారు.
''ఒక చేతిలో సంచి, మరో చేతిలో చిన్న పాపను పట్టుకుని అందర్నీ బతిమాలుతున్న మహేశ్‌ను చూశాను. కొత్త ప్రదేశం కావడంతో అతనికి ఆసుపత్రికి దారి కూడా తెలీదు. అతను చాలా ఆందోళనగా ఉన్నాడని నాకు అనిపించింది.''
''అప్పటికి అతని భార్య పరిస్థితి బాగాలేదు. ఆమె నొప్పితో మెలికలు తిరుగుతోంది'' అని సోనూ కుమార్ వివరించారు.
సోషల్ మీడియాలో హీరో
భావన పరిస్థితి చూసిన వెంటనే సోనూ కుమార్ ఆంబులెన్స్ కోసం 108కు ఫోన్ చేశారు. అయితే ఆంబులెన్స్ అందుబాటులో లేదని సమాధానం వచ్చింది. ఆయన 102 కు ఫోన్ చేస్తే, అక్కడి నుంచి కూడా సహాయం రాలేదు.
దీంతో ఆయన భావనను తానే తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. రైల్వేస్టేషన్ అధికారులను సంప్రదించి, వీల్ చైర్ తీసుకుని, భావనను రైల్వేస్టేషన్ బైటికి తీసుకెళ్లారు. అక్కడి నుంచి రిక్షా తీసుకుని, దగ్గరలో ఉన్న జిల్లా ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు.
కానీ నొప్పులతో బాధపడుతున్న భావనను అక్కడి డాక్టర్ మహిళల ఆసుపత్రికి రెఫర్ చేశారు.
''మహిళల ఆసుపత్రి అక్కడికి 100 మీటర్ల దూరంలో ఉంది. ఆసుపత్రి బైట చూస్తే నాకు ఎక్కడా రిక్షా కనిపించలేదు. పోనీ స్ట్రెచర్‌లో తీసుకుపోదామంటే అవీ లేవు. భర్తకేమో ఓ చేతిలో సంచీ, మరో చేతిలో పాప ఉంది. దీంతో నేనే ఆమెను ఎత్తుకుని మహిళల ఆసుపత్రికి పరిగెత్తాను. ఆ సమయంలో కేవలం నొప్పులతో బాధ పడుతున్న ఆమెను వెంటనే ఆసుపత్రిలో చేర్చాలన్నదే నా ఆలోచన'' అని సోనూ కుమార్ తెలిపారు.
సోనూ కుమార్ అలా ఆమెను ఎత్తుకుని మహిళల ఆసుపత్రి వైపు పరిగెత్తుతున్న దృశ్యం చాలామందిని ఆకర్షించింది. ఆ రోజు మధుర నగరం మొత్తం ఆయన గురించే చర్చ జరిగింది. ఆయన నిండు గర్భిణిని ఎత్తుకుని పరిగెడుతున్న దృశ్యాలు సోషల్ మీడియా అంతా షేర్ అయ్యాయి.
''ఆమెను ఆసుపత్రిలో చేర్చిన కొన్ని నిమిషాలకే ఆమెకు బాబు పుట్టాడు. కొన్ని నిమిషాలు ఆలస్యం అయినా, పరిస్థితి విషమించేదని డాక్టర్లు అన్నారు'' అని సోనూ కుమార్ తెలిపారు.
ప్రశంసలు.. విమర్శలు
భావన భర్త మహేశ్, సోనూ కుమార్‌పై ప్రశంసలు కురిపించారు.
''ఆ సమయంలో ఆయన దేవుడిలా వచ్చారు. ఇలాంటి మంచి వ్యక్తులు జీవితంలో అందరికీ తారసపడాలని కోరుకుంటున్నా'' అని మహేశ్ అన్నారు.
శనివారం భావన ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయి, ఇంటికి వెళ్లారు.
సోనూ కుమార్, ''ఆ మహిళను ఆసుపత్రిలో చేర్పించాక నేను సీఎమ్‌ఓతో మాట్లాడాను. ఆయన తమ తప్పును అంగీకరించి, వెంటనే ఆసుపత్రి గేటు వద్దే స్ట్రెచర్ పెట్టించారు'' అని తెలిపారు.
''ఈ సంఘటన జరిగినప్పుడు అక్కడ చాలా మంది ఉన్నారు. వాళ్లలో ఒకరు వీడియో తీస్తున్నారు.''
''ఎవరైనా ఒక వ్యక్తి రోడ్డు మీద బాధ పడుతుంటే, అతనికి ఎవరూ సహాయం చేయరు. కనీసం రోడ్డు మీద బండిని కూడా ఆపరు. మనుషుల్లో మార్పు రావాలి. అలాగే ప్రభుత్వ ఆసుపత్రుల పని తీరులో కూడా'' అన్నారాయన.
ఒక పోలీసు అధికారి మానవత్వంతో చేసిన పనిపై ఇప్పుడు ప్రశంసలు కురుస్తున్నాయి.
అదే సమయంలో సమాజంలో మనుషుల తీరు, అధికార యంత్రాంగం తీరుపై ప్రశ్నలు కూడా వెల్లువెత్తుతున్నాయి.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)