You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
తెలంగాణ : ‘అసెంబ్లీ రద్దు‘పై చట్టం ఏం చెబుతోంది?
తెలంగాణ రాష్ట్ర తొలి శాసనసభ గడువు పూర్తవడానికి తొమ్మిది నెలల ముందుగానే రద్దయింది. ఈ మేరకు అసెంబ్లీ రద్దుకు సిఫారసు చేస్తూ రాష్ట్ర మంత్రివర్గం ఏకగ్రీవంగా తీర్మానించింది.
మంత్రివర్గ సమావేశం అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ తన మంత్రివర్గ సహచరులతో కలిసి నేరుగా రాజ్‌భవన్‌కు వెళ్లి మంత్రివర్గ తీర్మానాన్ని గవర్నర్ నరసింహన్‌కు అందజేయగా ఆయన వెనువెంటనే ఆమోదించారు.
మళ్లీ ఎన్నికలు జరిగి కొత్త ప్రభుత్వం ఏర్పడేవరకు ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కేసీఆర్‌ను గవర్నర్ కోరగా ఆయన అందుకు అంగీకరించారు.
కేసీఆర్ గురువారం అసెంబ్లీని రద్దు చేస్తారన్న ఊహాగానాల నేపథ్యంలో బుధవారం నుంచే హడావుడి మొదలైంది. మిగతా పార్టీలూ రాష్ట్రంలో పరిణామాలను గమనిస్తూనే ఉన్నాయి. అనుకున్నట్లుగానే కేసీఆర్ శాసనసభను రద్దు చేయడంతో ఉత్కంఠకు తెరపడింది.
4 సంవత్సరాల 3 నెలల పాలన
కాగా తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం జరిగిన ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర సమితి అత్యధిక స్థానాలు సాధించడంతో ఆ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు(కేసీఆర్) 2014 జూన్ 2న తెలంగాణ తొలి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు.
అప్పటి నుంచి ఇప్పటివరకు 4 సంవత్సరాల 3 నెలల 4 రోజుల పాటు ముఖ్యమంత్రిగా ఉన్నారు.
ఎన్నికల ప్రచారం షురూ
అసెంబ్లీ రద్దుకు గవర్నర్ ఆమోదం లభించిన కొద్దిసేపటికే తెలంగాణలో ఎన్నికల సందడి మొదలైపోయింది. సోషల్ మీడియాలో ముఖ్యంగా ఫేస్‌బుక్, వాట్స్‌యాప్ వేదికగా తెరాస నేతలు ప్రచారం ప్రారంభించారు.
ఇప్పటికే టిక్కెట్‌పై నమ్మకం ఉన్నవారు, తెరాస అధినేత కేసీఆర్ నుంచి నమ్మకమైన హామీ పొందినవారితో పాటు ఆశావహలు కూడా సోషల్ మీడియాలో కేసీఆర్ ప్రభుత్వ పథకాలతో పాటు తమ అభ్యర్థిత్వాన్ని కూడా ప్రచారంలోకి తీసుకెళ్తున్నారు.
మరోవైపు తెరాస శుక్రవారం నుంచి ఎన్నికల ప్రచారాన్ని అధికారికంగా మొదలుపెట్టనుంది. హుస్నాబాద్‌లో 'ఆశీర్వాద సభ' పేరిట భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
త్వరలో ఎన్నికలు జరగనున్న నాలుగు రాష్ట్రాలతో పాటుగా తెలంగాణకూ ఎన్నికలు జరిగే అవకాశం ఉంది.
మరి శాసనసభ రద్దు తర్వాత ఏమవుతుంది?
తెలంగాణ ప్రస్తుత శాసనసభ పదవీ కాలం 2014 జూన్ 9వ తేదీ నుంచి మొదలయింది. రాజ్యాంగంలోని 172వ అధికరణ ప్రకారం ఎన్నికైన శాసనసభ మొదటిసారి సమావేశమైన తేదీ నుంచి ఐదేళ్ల పాటు కొనసాగుతుంది. ఆ ప్రకారం.. శాసనసభ గడువు ముగియటానికి 2019 జూన్ 8వ తేదీ వరకూ సమయముంది.
అసెంబ్లీని ముందుగా రద్దు చేసి ముందస్తు ఎన్నికలకు వెళ్లాలన్నది కేసీఆర్ ప్రణాళిక. ఆ సన్నాహాల్లో భాగంగానే భారీ స్థాయిలో ఇటీవల బహిరంగ సభ నిర్వహించారని తెలుస్తోంది.
కేసీఆర్ సభను రద్దు చేశాక.. శాసనసభలో పూర్తి మెజారిటీ ఉన్న రాష్ట్ర మంత్రివర్గం సిఫారసులను పాటించాల్సిన విధి గవర్నర్‌కు ఉంటుందని 163వ అధికరణ నిర్దేశిస్తోంది.
రాజ్యాంగంలోని 174 (2) అధికరణ కింద రాష్ట్ర శాసనసభను రద్దు చేసే అధికారం గవర్నర్‌కు ఉంది. ఈ నేపథ్యంలో శాసనసభను రద్దు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం సిఫారసు చేసినపుడు దానిని గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది.
సభలో మెజారిటీ ఉన్న ప్రభుత్వమే సిఫారసు చేసినందున.. శాసనసభను రద్దు చేసిన తర్వాత రాష్ట్రపతి పాలనకు సిఫారసు చేసే వీలుండదు.
అయితే.. గవర్నర్ రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాన్ని, దానితో పాటు తన నివేదికను రాష్ట్రపతికి, కేంద్ర ప్రభుత్వానికి నివేదిస్తారు.
శాసనసభను రద్దు చేసి ప్రస్తుత ముఖ్యమంత్రినే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగాలని కోరుతారు.
శాసనసభ రద్దయిన తర్వాత ఆరు నెలలలోగా కొత్త శాసనసభ కొలువుదీరాల్సి ఉంటుంది. అలా జరిగేలా చూసే బాధ్యత కేంద్ర ఎన్నికల సంఘానిది. అసెంబ్లీ రద్దయిన ఆరు నెలల్లోగా కొత్త శాసనసభ ఎన్నికల ప్రక్రియను ఈసీ పూర్తి చేయాల్సి ఉంటుంది.
2014లో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ తదితర రాష్ట్రాలతో పాటు లోక్‌సభకు కూడా ఏక కాలంలో ఎన్నికలు జరిగాయి. ప్రస్తుత తెలంగాణ శాసనసభ ఐదేళ్ల పదవీ కాలం ముగియటానికి ఇంకా తొమ్మిది నెలల సమయం ఉంది. లోక్‌సభకు కూడా అంతే గడువు ఉంది. అంటే.. మామూలుగా అయితే 2019 మే నెలలో ఇటు అసెంబ్లీకి, అటు లోక్‌సభకు కలిసి ఒకేసారి ఎన్నికలు జరుగుతాయి.
మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్, మిజోరం రాష్ట్రాల శాసనసభల పదవీ కాలం ఈ ఏడాది డిసెంబర్, వచ్చే ఏడాది జనవరి నెలల్లో ముగియనున్నాయి. ఆ రాష్ట్రాలకు ఈ ఏడాది డిసెంబర్ ఆరంభంలో ఎన్నికలు జరిగే అవకాశముంది.
తెలంగాణలో ముందస్తు ఎన్నికలు నిర్వహించాలంటే ఆ రాష్ట్రాల ఎన్నికలతో పాటే నిర్వహించటం సాధ్యమవుతుంది. ఆ గడువు దాటితే.. లోక్‌సభ ఎన్నికలతో పాటే జరపాల్సి ఉంటుంది. డిసెంబర్‌లో ఎన్నికలు నిర్వహించాలంటే.. ఓటర్ల జాబితాలు సహా అవసరమైన ఏర్పాట్లు చేయటానికి ఈసీకి కనీసం మూడు నెలల సమయం పడుతుంది.
అసెంబ్లీ పదవీ కాలం ఇంకా కొనసాగుతుండగానే ఎన్నికల ఏర్పాట్లు ప్రారంభించే వీలు లేదు. అసెంబ్లీ రద్దయితే కానీ ఈసీ ఏర్పాట్లు ప్రారంభిస్తుంది. అంటే.. తెలంగాణ శాసనసభకు డిసెంబర్‌లో ఎన్నికలు జరగాలంటే సెప్టెంబర్ ఆరంభంలోనే అసెంబ్లీని రద్దు చేయాల్సి ఉంటుంది. ఇప్పుడు అదే జరుగుతోంది.
ఇప్పుడు కేసీఆర్ అసెంబ్లీని రద్దు చేస్తే.. డిసెంబర్ చివర్లో ఎన్నికలు నిర్వహించి, 2019 జనవరి ఆరంభంలో కొత్త ప్రభుత్వం కొలువుతీరటానికి అవకాశం ఉంటుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
ఇవి కూడా చదవండి
- 'దళిత' పదం: అవమానకరమా... ఆత్మగౌరవ సంకేతమా?
- పిల్లల మీద లైంగిక అకృత్యాలను ప్రేరేపించే వెబ్ సైట్లను హోస్ట్ చేస్తున్న దేశాలేవి?
- శ్రీలంక సైన్యంలో కొత్త జవాన్లు... బాంబులను పసిగట్టే జీవులు
- కేరళ: వరద బాధితులకు ర్యాట్ ఫీవర్ గండం
- చైనాలో ఈ ఐదేళ్లలో వచ్చిన మార్పులివే!
- 'మంచి ముస్లిం' అనేది ఎవరు నిర్ణయిస్తారు?
- BBC Special: చైనా పెళ్లిళ్ల సంతలో ‘మిగిలిపోయిన అమ్మాయిలు’
- భారతదేశంలో ముస్లింల సమస్యల గురించి మనకు అవగాహన ఉందా?
- అద్భుతంగా వెలిగిపోతున్న చైనా నగరాలు
- Reality Check: హైస్పీడ్ రైలును నిజంగా చైనానే కనిపెట్టిందా?
- అమెరికా కొత్త సుంకాలు చైనాను ఎంతగా దెబ్బ తీస్తాయి?
- సర్దార్ వల్లభాయ్ పటేల్: ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహం.. నిర్మాణం ఎలా జరుగుతోందంటే..
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)