You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
రిక్షావాలా కుమార్తె రికార్డు బద్దలుకొట్టింది.. స్వప్న బర్మన్ ప్రతిభతో హెప్టాథ్లాన్‌లో భారత్‌కు తొలిసారి స్వర్ణం
జకార్తాలో జరుగుతున్న ఆసియా క్రీడల్లో భారత్‌కు చెందిన స్వప్న బర్మన్ బంగారు పతకం గెలుచుకుని సరికొత్త చరిత్ర సృష్టించారు.
ఆసియా గేమ్స్‌లో హెప్టాథ్లాన్‌లో మొదటిసారి భారత్‌కు స్వర్ణం లభించింది. కానీ 21 ఏళ్ల స్వప్న బర్మన్‌కు అక్కడి వరకూ రావడం మాత్రం అంత సులభంగా సాధ్యం కాలేదు.
రిక్షావాలా కూతురైన స్వప్న పాదాలకు మొత్తం 12 వేళ్లుంటాయి.
సాధారణంగా కాళ్లకు ఆరేసి వేళ్లున్నంత మాత్రాన జీవితంలో కష్టాలు రావడం అనేది ఉండదు. కానీ ఒక క్రీడాకారుడు ఆరు వేళ్లతో పరిగెత్తడం అంత సులభం కాదు. స్వప్నకైతే ఆ వేళ్ల వల్ల ఇంకా ఎన్నో సమస్యలు ఎదురయ్యాయి.
అదనపు వేళ్లుండడం ఒక వ్యాధా?
భారత్‌లో ఆరు వేళ్లున్నవారి గురించి ఒక నమ్మకం ఉంది. ఆరు వేళ్లుంటే అదృష్టవంతులని చాలా మంది చెబుతుంటారు. కానీ ఆమె అదృష్టవశాత్తు దాన్ని గెలుచుకోలేదు.. ఆమె సాధించిన ఈ ఘనత వెనుక ఎన్నో ఏళ్లుగా ఆమె ఎదుర్కొంటున్న కష్టాలున్నాయి.
అయినా చేతులకో, కాళ్లకో అదనపు వేళ్లు ఉండడం వ్యాధి కాదు.
చేతులు, లేదా కాళ్లకు అదనపు వేళ్లు ఉండడాన్ని సైన్సులో 'పాలిడక్టిలీ' అంటారు.
ఎవరికైనా పాలిడక్టిలీ అనేది పుట్టుకతోనే వస్తుంది. చేతులు, లేదా కాళ్లకు అదనపు వేళ్లు ఉండడం వల్ల రోజువారీ పనులు చేసుకోవడంలో పెద్దగా తేడా ఉండదని డాక్టర్లు చెబుతున్నారు.
దిల్లీ ప్రైమస్ హాస్పిటల్‌లో ఎముకల వైద్య నిపుణుడు కౌశల్ కుమార్.. "మ్యుటేషన్ వల్లే అలా జరుగుతుంది. అంటే పుట్టుక సమయంలో ఏదైనా జన్యువు మార్పిడికి గురవడం వల్ల అదనపు వేళ్లు లాంటివి ఏర్పడతాయి" అని తెలిపారు.
పాలిడక్టిలీలో చాలా రకాలు ఉన్నాయి
1. చేతులు లేదా కాళ్లకు కేవలం అదనపు సాఫ్ట్ టిష్యూ ఉండడం వల్ల కూడా పుడుతున్నప్పుడు ఐదుకు బదులు ఆరు వేళ్లు కనిపించడం జరుగుతుంది.
"అలా అదనపు టిష్యూ కనిపించినపుడు, బిడ్డ పుట్టగానే.. దారం కట్టి దాన్ని తీసేస్తారు. కానీ దాన్ని డాక్టర్ పర్యవేక్షణలోనే చేయాల్సి ఉంటుంది. దారం కట్టి సాప్ట్ టిష్యూను తీసేయడం అనేది వినడానికి సులభంగానే ఉన్నా, చాలా కష్టం. డాక్టరు లేకుండా చేస్తే, ప్రమాదకర పరిణామాలకు దారితీయొచ్చు" అని డాక్టర్ కౌశల్ చెప్పారు.
2. పాలిడక్టిలీలో రెండో రకంలో చేతులు, కాళ్లలో ఐదు వేళ్లతోపాటు ఎముక లేకుండా కొంత మాంసభాగం బయటికి వచ్చి ఉంటుంది. అది చూడ్డానికి వేలులాగే కనిపిస్తుంది.
"అలాంటి సమయాల్లో సర్జరీ తప్ప దానికి వేరే చికిత్స లేదు. అంటే సర్జరీతో అదనపు వేలును తొలగించొచ్చు" అని కౌశల్ తెలిపారు.
సర్జరీ ఎప్పుడు చేయాలి, ఎప్పుడు చేయకూడదు అనేది సర్జన్ నిర్ణయిస్తాడు. చాలా కేసుల్లో చిన్నప్పుడే దాన్ని తీసివేయడం మంచిది. కొన్నిసార్లు పిల్లలు పెద్దయ్యేవరకూ డాక్టర్లు వేచిచూడాల్సి ఉంటుంది.
3. మూడోరకం చాలా క్లిష్టమైనది. ఇందులో ఐదు వేళ్ల తర్వాత ఆరో వేలు కూడా వస్తుంది. దాన్లో టిష్యూతోపాటూ ఎముక కూడా ఉంటుంది. అలాంటి కేసుల్లో వారికి కొన్ని ఇబ్బందులు ఉండచ్చు.
సాధారణంగా ఇలాంటి సర్జరీ కోసం ఎముకల వైద్యుల దగ్గరకు వెళ్లాల్సి ఉంటుంది.
ఆరు వేళ్లతోనే స్వప్న క్రీడా ప్రయాణం
స్వప్న బర్మన్ రెండు పాదాలకు ఆరేసి వేళ్లుంటాయి. ఆమెకు పాలిడక్టలీ మూడో రకం సమస్య ఉంది. అందులో ఆరో వేలులో మాంసంతోపాటూ ఎముక కూడా ఉంటుంది.
ఇప్పటివరకూ ఆమె వాటిని తీయించుకోలేదు. డాక్టర్లు చెబుతున్నదాని ప్రకారం ఆరు వేళ్లతో పరిగెత్తడం కష్టం కాదు. కానీ దానికోసం ఆమె ప్రత్యేకమైన బూట్లు వేసుకోవాల్సి ఉంటుంది.
కానీ ప్రత్యేకమైన బూట్ల కోసం స్వప్న ఎన్నో కష్టాలు పడ్డారు.
స్వప్న కుటుంబం ఆర్థిక స్థితి అంతంతమాత్రంగానే ఉంటుంది. స్వప్న తండ్రి రిక్షా నడుపుతారు. కానీ 2013లో ఆయనకు స్ట్రోక్ వచ్చింది. అప్పటి నుంచి ఆయన మంచంపైనే ఉన్నారు.
ప్రస్తుతం ఆమె తల్లి టీ తోటలో పనిచేస్తున్నారు. ఆమె సంపాదనతోనే ఇల్లు నడుస్తుంది. స్వప్నకు ప్రత్యేకంగా బూట్లు తెప్పించేందుకు ఇంటి ఆర్థిక స్థితి సరిపోదు. ఆమె కుటుంబంలో అమ్మానాన్నతోపాటూ అన్న అసిత్ బర్మన్, వదిన కూడా ఉంటారు.
"స్వప్నకు పరిగెత్తడంలో ఎప్పుడూ ఎలాంటి సమస్యా రాలేదు. కానీ ఆమెకు బూట్లు తీసుకురావడమే సమస్య అయ్యింది. షాపులో బూట్లు కొనడానికి వెళ్తే, ఆమె సైజు బూట్లు, తన కాళ్లకు సరిపోయేవి కావు. స్వప్న పాదం వెడల్పుగా ఉండడం వల్ల ఆ బూట్లతో పరిగెత్తడం కష్టమయ్యేది. అని స్వప్న వదిన బీబీసీకి చెప్పారు.
ఆ కష్టం ఎలా దూరమైంది?
"సరైన బూట్లు దొరక్కపోవడమే కాదు, బూట్లు లేవని ట్రైనింగ్ నుంచీ, గేమ్ వరకూ చాలా సార్లు ఆమెను ఎంపిక చేయకుండా పక్కకు పెట్టేవారు. చాలా మంది డాక్టర్ల సలహాలు కూడా తీసుకున్నాం. ఒక్కోసారి బూట్లు కొనడానికి డబ్బుల్లేకుంటే, ఇంకోసారి డాక్టర్లకు డబ్బు పెట్టాల్సి వచ్చేది. కానీ ఇప్పుడు ఆమె ఆర్డర్ ఇచ్చి విదేశాల నుంచి తన బూట్లు తెప్పించుకుంటోంది" అని ఆమె వదిన చెప్పారు.
"పాలిడక్టలీ అనేది వైకల్యం కాదు. ఇది ఉండడం వల్ల అందరికీ సమస్యలు ఉండవు" అని సప్ధర్ జంగ్ ఆస్పత్రి స్పోర్ట్స్ ఇంజూరీస్ ప్రత్యేక నిపుణులు డాక్టర్ దీపక్ చెప్పారు.
డాక్టరుగా తన 25 ఏళ్ల కెరీర్‌లో ఇలా ఆరు వేళ్లున్న క్రీడాకారులు ఇద్దరినే చూశానన్నారాయన.
‘‘వారిలో ఒకరు ఫుట్‌బాల్ క్రీడాకారుడు. కానీ ఆయన ఆరు వేళ్ల సమస్యతో నా దగ్గరికి రాలేదు. తను గాయపడడంతో నేను చికిత్స చేశాను’’ అని దీపక్ చెప్పారు.
ఆరు వేళ్లు ఉన్న వారు ప్రత్యేకంగా ఆర్డర్ ఇచ్చి తమకోసం వేళ్ల దగ్గర కాస్త వెడల్పుగా ఉండేలా బూట్లు తయారు చేయించుకోవచ్చు.
అదనపు వేళ్లు ఉన్న ప్రముఖులు
బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్‌కు ఒక చేతికి రెండు బొటనవేళ్లున్నాయి.
ఇక ప్రముఖ టాక్ షో యాంకర్ ఓప్రా విన్‌ఫ్రేకు కూడా ఒక కాలికి అదనపు వేలు ఉంది.
ఇవి కూడా చదవండి:
- హై హీల్స్ వేసుకుంటున్నారా... జాగ్రత్త
- పిల్లల మలంతో చేసిన డ్రింక్ తాగుతారా - ఇది ఆరోగ్యానికి చాలా మంచిది
- ‘ఆ మాటలు విన్న తర్వాత పిల్లలను కనాలంటేనే సిగ్గుగా ఉంటుంది’
- చరిత్ర: భారత్ నుంచి బ్రిటన్ ఎంత సంపద దోచుకెళ్లింది?
- హ్యాపీయెస్ట్ కంట్రీస్‌లో సంతోషం అంతంతేనా?
- డేరాబాబా: ఏడాది జైలు శిక్షా కాలంలో సంపాదన రూ.6వేలు
- 'కార్డు'లను కరెన్సీనోట్లుగా మార్చేందుకు సైబర్ నేరగాళ్లు ఏం చేస్తున్నారంటే..
- #BBCSpecial జ్ఞాపకశక్తిని పెంచుకోవడానికి ఎనిమిది మార్గాలు
- కృత్రిమ మేధస్సు: కాల్ సెంటర్లలో ఉద్యోగాలు హుష్ కాకేనా?
- ‘మద్యపానం.. మితంగా తాగినా ముప్పే’
బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.