అభిప్రాయం: ఆ వికలాంగురాలిపై సామూహిక అత్యాచారం జరిగింది.. కానీ ఎవరూ నమ్మలేదు

    • రచయిత, దివ్య ఆర్య
    • హోదా, బీబీసీ ప్రతినిధి

అత్యాచారానికి గురైన ఒక వికలాంగురాలితో నేను మొదటిసారి మాట్లాడినపుడు ఆమె నాతో.. తనకు జరిగింది లైంగిక హింస కంటే బాధాకరం అని చెప్పింది. ఒక వికలాంగురాలిపై కూడా అత్యాచారం జరుగుతుందని ఎవరూ నమ్మడానికి కూడా సిద్ధంగా లేరని ఆవేదన వ్యక్తం చేసింది.

పొలీసులు, ఇరుగుపొరుగు, స్వయంగా ఆమె కుటుంబ సభ్యులు కూడా ఆమెను గుచ్చి గుచ్చి ప్రశ్నించారు. 'వికలాంగురాలిపై అత్యాచారం చేయడం వల్ల ఎవరికి ఏమొస్తుంది' అన్నారు.

ఆమెపై సామూహిక అత్యాచారం జరిగింది. బాధితురాలు చెప్పినదాన్ని బట్టి ఆమె పక్కింట్లో ఉన్న వ్యక్తి, తన స్నేహితుడితో కలిసి ఆమెకు కూల్ డ్రింకులో ఏదో కలిపి ఇచ్చాడు. ఆమెకు మెలకువ వచ్చేసరికి ఒక గల్లీలో అర్ధనగ్నంగా పడి ఉంది.

చివరికి పోలీసులు ఫిర్యాదు నమోదు చేశారు, కేసు దర్యాప్తు చేస్తున్నారు.

వికలాంగురాలిపై జరిగే లైంగిక వేధింపుల్లో ఎక్కువగా బాగా తెలిసినవారే వారి నమ్మకాన్ని వమ్ము చేస్తారు.

'డెహ్రాడూన్ నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ విజుబిలిటీ హ్యాండీ క్రాఫ్ట్(ఎన్ఐవీహెచ్)'లో అదే జరిగింది. ఇక్కడ మోడల్ స్కూల్లో సంగీతం నేర్పిస్తున్న ఒక టీచరు తమపై లైంగిక హింసకు పాల్పడ్డాడని అక్కడి విద్యార్థులు ఆరోపించారు.

పరారైన ఉపాధ్యాయుడు

విద్యార్థుల మాటలు మొదట ఎవరూ నమ్మలేదు. స్కూల్ ప్రిన్సిపల్, సంస్థ డైరెక్టర్ కూడా వారు చెబుతున్నది పట్టించుకోలేదు.

దాంతో వారు పది రోజులు ఆందోళనలు కూడా చేయాల్సివచ్చింది. సోషల్ మీడియాలో వాళ్లు తమ వీడియో కూడా పోస్ట్ చేశారు. స్థానిక మీడియాకు ఆ సమాచారం అందించారు. దాంతో చివరకు పోలీసులు కేసు రిజిస్టర్ చేశారు.

విద్యార్థులు మేజిస్ట్రేట్ ఎదుట వాంగ్మూలం ఇచ్చారు. ఆ తర్వాత ఉపాధ్యాయుడిపై పాక్సో యాక్ట్ కింద 'వైకల్యాన్ని అలుసుగా తీసుకుని లైంగిక హింసకు పాల్పడినట్టు' కేసు నమోదు చేశారు.

ఆ ఉపాధ్యాయుడు ఇప్పటికీ పరారీలోనే ఉన్నాడు. స్కూల్ ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్‌ను తొలగించారు. సంస్థ డైరెక్టర్ రాజీనామా చేశారు.

రిపోర్ట్ ఏం చెబుతోంది?

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ బ్యాంక్ ఇచ్చిన 'వరల్డ్ రిపోర్ట్ ఆన్ డిజిబిలిటీ(2011)' ప్రకారం, సాధారణ మహిళలు, వికలాంగులైన పురుషులతో పోలిస్తే, వికలాంగులైన మహిళల్లో విద్య, ఉపాధి పొందేవారి శాతం తక్కువ, వారిలో హింసకు గురయ్యే శాతం ఎక్కువ.

ఈ రిపోర్ట్ ప్రకారం వికలాంగ మహిళలు బయటి ప్రపంచంలో తాము సురక్షితంగా జీవించలేమని భావిస్తారు. ఆ భావనే విద్య, ఉపాధి అవకాశాలకు వారిని దూరంగా ఉంచుతుంది.

వికలాంగులైన మహిళలు చదవడం-రాయడం-ఉపాధి పొందడం లాంటి వాటికి కుటుంబం అంత ప్రాధాన్యం ఇవ్వరు. ముఖ్యంగా వారిని బయటకు పంపించడం వల్ల ఏదైనా జరగవచ్చని, వారు తమకు మరింత భారం అవుతారని వారు భయపడతారు.

వికలాంగ మహిళల విషయానికి వస్తే, లైంగిక వేధింపుల ప్రమాదం తమకు చాలా ఎక్కువగా ఉంటుందని వారు భావిస్తారు. కానీ అది నిజం కాదు. ప్రపంచమంతా వారిని అలా వక్ర దృష్టితో చూడడం అనేది ఉండదు.

జవహర్ లాల్ నెహ్రూ విశ్వవిద్యాలయంలో చదువుతున్న శ్వేతా మండల్ అనుభవం ప్రకారం "వికలాంగులు కానివారు చాలా సున్నితంగా ఉంటారు. అది వికలాంగులకు చాలా అవసరం కూడా.

"మాకు సాయం కావాలి. ఇందులో వేరే అభిప్రాయమే ఉండదు. అది అందుతుంది కూడా. వికలాంగులు కాని వారిపై ఆ నమ్మకం ఉంచడం అనేది మా జీవితంలో చాలా కీలకం" అని శ్వేత చెప్పారు.

ఎన్ఐవీహెచ్‌లో కూడా అదే నమ్మకంతో ఉండే విద్యార్థుల కోసం తలుపులు, కిటికీలు తెరిచి ఉంచాలి అనే సలహాను ఇస్తున్నారు.

ఇదే మొదటిసారి కాదు

కానీ లైంగిక హింస ఆరోపణలు వెలుగులోకి వచ్చిన తర్వాత 'నేషనల్ ఫ్లాట్‌ఫాం ఫర్ ద రైట్స్ ఆఫ్ ద డిజేబుల్డ్(ఎన్‌పీఆర్‌డీ)'కి చెందిన ఇద్దరు సభ్యుల బృందం ఆ సంస్థలో పర్యటించింది. సంస్థలో తమకు రక్షణ లేదని అనిపిస్తున్నట్టు ( అభద్రతాభావంతో ఉన్నట్టు ) అక్కడి విద్యార్థులు వారికి చెప్పారు.

సంస్థ స్టాఫ్‌లో పనిచేస్తున్న మగవాళ్లు ఏం చెప్పకుండానే హాస్టల్లోకి ప్రవేశిస్తారు. బాత్రూం తలుపులకు లోపల నుంచి వేసుకోడానికి గడియలు కూడా పెట్టించలేదు.

స్కూల్లో లైంగిక హింస గురించి ఫిర్యాదు చేసినపుడు, ప్రిన్సిపల్, వైస్ ప్రిన్సిపల్ వాటిని పట్టించుకోలేదు. పైగా మీరే కాస్త బట్టలు సరిగా వేసుకుని రావచ్చుకదా, అని తమకే సలహా ఇచ్చారని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు.

ఇలాంటివి జరగడం సంస్థలో మొదటిసారేం కాదు. విద్యార్థిని-విద్యార్థులు ఏప్రిల్‌లో ఈ ఉపాధ్యాయుడితోపాటు సంగీతం నేర్పించే మరో ఉపాధ్యాయుడిపైన కూడా లైంగిక హింసకు పాల్పడ్డట్టు ఫిర్యాదు చేశారు.

అప్పుడు కూడా ఆందోళనలు జరిగాయి, ఆ తర్వాత ఆ ఉపాధ్యాయుడిని అరెస్టు చేశారు. కానీ ఈ ఉపాధ్యాయుడు ఇప్పటికీ ఆ స్కూల్లోనే ఉన్నాడు.

పోక్సో యాక్ట్ ప్రకారం ఎవరైనా ఒక మైనర్ బాలిక లైంగిక హింస గురించి ఎవరైనా అధికారికి చెబితే, అతడు ఆమె చెప్పింది పట్టించుకోకపోతే, అతడిపైన కూడా విచారణ జరపవచ్చు.

'రైట్స్ ఆఫ్ పర్సన్స్ విత్ డిజిబిలిటీస్ యాక్ట్' ప్రకారం హోదాను, పవర్ ను దుర్వినియోగం చేసి ఎవరైనా విగలాంగులపై లైంగిక వేధింపులు జరపడం శిక్షార్హమైన నేరం.

విచారణ ప్రారంభమైంది. ఒక్కో విషయం బయటికొచ్చేకొద్దీ... ఈ ఘటనలో ఎవరెవరు ఏ స్థాయిలో పిల్లల నమ్మకాలను ముక్కలు చేశారో బయటపడుతుంది.

నాకు మళ్లీ ఆ అత్యాచార బాధితురాలి మాట గుర్తుకొచ్చింది. అత్యాచారం లేదా లైంగిక హింస అనేది ముఖ్యంగా నమ్మినవారు ద్రోహం చేసినప్పుడు చాలా బాధాకరంగా ఉంటుంది.

కానీ ఆ తర్వాత వేధింపులపై చేసే సంఘర్షణలో కూడా విశ్వాసపాత్రుల అండ లభించకపోతే, అది మరో లోతైన గాయాన్ని మిగుల్చుతుంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)