ఎమర్జెన్సీని మించిన భయం ఇప్పుడుంది: రొమిలా థాపర్

పుణె పోలీసులు అరెస్ట్ చేసిన విప్లవ రచయితల సంఘం నేత పెండ్యాల వరవరరావు సహా ఐదుగురు పౌర హక్కుల ఉద్యమకారులను సెప్టెంబర్ 6వ తేదీ వరకు గృహ నిర్బంధంలో ఉంచాలని మహారాష్ట్ర ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఆ ఐదుగురి అరెస్టును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసినవారిలో రొమిలా థాపర్ ఒకరు. ఆ పిటిషన్ పై విచారణ జరిపిన తరువాత సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఈ నేపథ్యంలో రొమిలా థాపర్ బీబీసీతో మాట్లాడారు. తన పిటిషన్ గురించి, ప్రస్తుత పరిణామాల గురించి వివరించారు. ఆ విషయాలు ఆమె మాటల్లోనే...

‘‘మహారాష్ట్ర పోలీసులు దేశవ్యాప్తంగా ఐదుగురు పౌర హక్కుల ఉద్యమకారులను అరెస్టు చేసి పుణెకు తరలించారు. వీళ్లంతా సమాజంలో చాలా మందికి తెలిసిన, మంచి పేరున్న వ్యక్తులు. వీళ్లను అరెస్టు చేసిన పద్ధతి సరైనది కాదు. వాళ్లను నేరుగా అలా తీసుకెళ్లడానికి వాళ్లేమీ క్రిమినల్స్ కాదు. ఇవే విషయాలను ప్రస్తావిస్తూ, ‘వాళ్లపైన ఉన్న ఆరోపణలు ఏంటి?’, ‘వాళ్లు ఏ తప్పు చేశారని నిరూపించాలనుకుంటున్నారు?’, ‘దానికి అనుసరిస్తోన్న పద్ధతి ఏంటి?’ అని ప్రశ్నిస్తూ నేను పిటిషన్ వేశాను.

ఆ పిటిషన్ పైనే బుధవారం సుప్రీం కోర్టులో విచారణ జరిగింది. కోర్టు కూడా వాళ్లను తిరిగి ఇంటికి పంపించాలని అంగీకరించింది. వారం రోజుల పాటు వారిని గృహ నిర్బంధంలో ఉంచాలని పేర్కొంది. దాంతో వాళ్లు జైలుకు వెళ్లాల్సిన అవసరం తప్పింది. మరోవారం తరువాత మరో హియరింగ్ ఉంటుంది.

వ్యక్తిగతంగా తెలుసు

పోలీసులు అరెస్టు చేసిన వాళ్లలో కొందరు నాకు వ్యక్తిగతంగా తెలుసు. వాళ్లూ మనందరిలాంటి వాళ్లే. వాళ్లను అరెస్టు చేసిన విధానం సరైనది కాదు. ఎవరినైనా అరెస్టు చేయడానికి వెళ్లినప్పుడు వాళ్లను ఎందుకు అరెస్టు చేస్తున్నారనే విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి. క్రిమినెల్స్ లాగా వాళ్లను తీసుకెళ్లడానికి కుదరదు.

పోలీసులు అరెస్టు చేసిన వారందరిపైన హింసకు కారణమయ్యేరనే అభియోగాలు నమోదయ్యాయి. కానీ నిజానికి ఆ సమయంలో వాళ్లలో కొందరు అక్కడ లేరు. రెండోది... వాళ్లంతా తుపాకులో, లాఠీలో తీసుకొని హింసకు పాల్పడే వ్యక్తులు కాదు. కాబట్టి అక్కడ హింస ప్రస్తావనే లేదు. వాళ్లలో రచయితలు, ప్రొఫెసర్లు, ఉద్యోగులు ఉన్నారు. అందుకే ఈ అభియోగాల్లో ‘హింస’ అనే పదానికి ఉన్న నిర్వచనం ఏంటో నాకు అర్థం కాలేదు.

ఉదాహరణకు... సుధా భరద్వాజ్ ఒక న్యాయవాది. కోర్టులో పనిచేస్తారు. ప్రజాస్వామ్య, మానవ, పౌర హక్కుల కోసం పనిచేసే కార్యకర్త, రచయిత గౌతమ్ నవ్‌లాఖా. ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ(ఈపీడబ్ల్యూ) కోసం ఆయన శక్తిమంతమైన కథనాలు, విశ్లేషణలు రాస్తారు. వాళ్లకు తీవ్రమైన వామపక్ష భావాలున్నాయని ఆరోపిస్తున్నారు. ముందు ఆ ‘తీవ్రమైన వామపక్ష భావాల’ అర్థం ఏంటో వివరించాలి. అంతేకాని ఏదో ఒక స్టేట్‌మెంట్ ఇచ్చి ఊరుకుంటే కుదరదు.

‘తీవ్రమైన వామపక్ష భావాలున్న వ్యక్తి’ అంటే ఏంటో కూడా నిర్వచించాలి. ఒకవేళ నిజంగా వాళ్లలో ఎవరికైనా తీవ్రమైన వామపక్ష భావజాలం ఉన్నా, వాళ్లను నేరుగా వచ్చి అరెస్టు చేసి తీసుకెళ్లడానికి ఆ కారణం సరిపోతుందా?

ఒకవేళ వాళ్లకు మావోయిస్టులతో సంబంధం ఉందని పోలీసులు ఆరోపిస్తే, దానికి తగిన సాక్ష్యాలు కూడా ఉండాలి కదా. ఒకవేళ అది నిజమైతే బహిరంగంగా దానికి సంబంధించిన స్పష్టత ఇవ్వాలి. పోలీసులు ఇప్పటికే విచారణ చేశామని చెప్పారు. కాబట్టి అందులో గోప్యత పాటించాల్సిన అవసరం లేదు.

రెండేళ్ల క్రితం కూడా దిల్లీ యూనివర్సిటీలో ఒకరి దగ్గర మావోయిస్టులకు సంబంధించిన పుస్తకాలు ఉన్నాయని ఆరోపిస్తూ అరెస్టు చేశారు. ఈ కేసు కూడా ఆ స్థాయిదే అయితే, అది నిజంగా హాస్యాస్పదం.

గతంలో ఇలాంటి పరిస్థితి లేదు

మావోయిస్టులతో వీళ్లకు ఉన్న సంబంధాల గురించి నేరుగా నేను స్టేట్‌మెంట్ ఇవ్వలేను. ‘ఎ’ అనే వ్యక్తికి ‘బి’, ‘బి’ అనే వ్యక్తికి ‘సి’తో సంబంధాలు ఉండొచ్చు. ఈ సంబంధాలను పోలీసులు ఒకలా, బయటివాళ్లు మరోలా చూడొచ్చు. ఉదాహరణకు... పోలీసులు తీసుకున్న ఈ చర్యలకు, మహారాష్ట్రలోని సనాతన్ సంస్థాన్ వ్యవహారానికీ లింకు ఉందని నేను గంటన్నర పాటు విశ్లేషించి చెప్పగలను. అందుకే ఇది చాలా జటిలమైన వ్యవహారం.

ఇలాంటి చర్యలు ఐదేళ్ల క్రితం కనిపించి ఉండేవి కాదు. గత నాలుగేళ్లలో ఆధిపత్యం పెరిగింది. ప్రజల్లో భయం పెరిగింది. మైనార్టీలు, ఇతర అట్టడుగు వర్గాల్లో భయానక వాతావరణం నెలకొంది. గతంలో చట్టం ఇలా పనిచేసి ఉండేది కాదు. ఇప్పుడు చట్టం పనితీరు మారిపోయింది. భవిష్యత్తులో పరిస్థితులు ఇంకా దిగజారొచ్చని నా అభిప్రాయం.

ప్రస్తుతం ప్రజల్లో నెలకొన్న భయం, ఎమర్జెన్సీ కాలం నాటి భయం కంటే తీవ్రమైంది. ఆ భయం కొద్ది కాలమే ఉంది. కానీ ఈ భయం నాలుగేళ్లుగా కొనసాగుతోంది. ఇది ఇంకా ఎంత కాలం ఉంటుందో తెలీదు. 2019 తరువాత కూడా ఇది కొనసాగితే పరిస్థితి ఇంకెలా ఉంటుందో చెప్పలేం.

కోర్టు ఎలాంటి చర్య తీసుకుంటుందనేదానిపై మా భవిష్యత్తు ప్రణాళిక ఆధారపడి ఉంటుంది’’.

ఇవి కూడా చదవండి

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)