You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
జనగణమన: జాతీయగీతానికి మదనపల్లెకూ సంబంధం ఏమిటి?
- రచయిత, మురారి రవికృష్ణ
- హోదా, బీబీసీ ప్రతినిధి
భారతదేశ జాతీయగీతం 'జనగణమన' గీతాన్ని విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ నిజానికి 1911లోనే రాశారు. అదే ఏడాది డిసెంబర్ 27న కోల్‌కతాలో జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశాలలో కూడా దానిని ఆలపించారు.
ఆ తర్వాత కూడా జాతీయోద్యమం నేపథ్యంలో ఆ గీతాన్ని అనేక లక్షలసార్లు, అనేక వేదికల మీద ఆలపించారు. అయితే ఇప్పుడు మనం వినే ట్యూన్‌లో కాదు.. ఎవరికి నచ్చిన రాగంలో వాళ్లు పాడుకునేవాళ్లు.
జనగణమనకు ఆ స్వరాన్ని కట్టింది ఒక ఐరిష్ జాతీయురాలైతే... దానికి వేదికైంది చిత్తూరు జిల్లా మదనపల్లె.
భారత స్వాతంత్రోద్యమాన్ని బలపరిచిన డాక్టర్ అనీబిసెంట్ మదనపల్లెలో థియోసాఫికల్ కాలేజీని స్థాపించారు.
ఐరిష్ జాతీయుడైన ప్రముఖ విద్యావేత్త జేమ్స్ హెన్రీ కజిన్స్ దాని ప్రిన్సిపాల్‌గా ఉండేవారు. లండన్ మ్యూజిక్ కాలేజిలో చదువుకున్న ఆయన భార్య మార్గరెట్ కజిన్స్ అక్కడ సంగీతాన్ని నేర్పించేవారు.
1919లో దక్షిణ భారతదేశ పర్యటనలో ఉన్న రవీంద్రనాథ్ ఠాగూర్ తిరిగి తిరిగి అలిసిపోయి బెంగళూరు చేరుకున్నారు. అక్కడ ఉన్నపుడే ఆయనకు మదనపల్లె వాతావరణం గురించి తెలిసింది.
దీంతో ఆయన విశ్రాంతి కోసం మదనపల్లెలోని థియోసాఫికల్ కాలేజీ చేరుకున్నారు. ఠాగూర్‌కు జేమ్స్ కజిన్స్ కవిత్వం అంటే చాలా ఇష్టం. ఆయన మదనపల్లెలో బస చేయడానికి అది కూడా ఒక కారణం.
ప్రశాంత వాతావరణం కలిగిన థియోసాఫికల్ కాలేజీలో ప్రతి బుధవారం డిన్నర్ తర్వాత విద్యార్థులంతా కలిసి పాటలు పాడేవాళ్లు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఠాగూర్.. అలాంటి ఒక వేడుకలో పాల్గొన్నారు.
ఆ సందర్భంగా ఆయన స్వయంగా తన గొంతుకతో జనగణమన ఆలపించారు. ఠాగూర్ కంఠస్వరం నుంచి వెలువడిన ఆ పాటకు విద్యార్థులూ గొంతు కలిపారు.
సరిగ్గా మార్గరేట్ కజిన్స్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు.
ఆ పాటలోని దేశభక్తిని, జాతీయ భావాన్ని గమనించారు. కానీ అప్పటికి జనగణమనను ఇంకా ఎవరూ రాగయుక్తంగా పాడడం లేదు.
అందువల్ల దానిని తానే స్వరబద్ధం చేయాలని నిర్ణయించుకున్నారు.
ఆ మరుసటి రోజు ఆమె ఠాగూర్‌ను కలిసి జనగణమనను స్వరబద్ధం చేయాలన్న తన కోరికను వినిపించారు.
దీనికి అంగీకరించిన ఠాగూర్.. ఆమెకు ఆ పాట అర్థాన్ని విడమర్చి చెప్పారు. దానికి స్వరం ఎలా ఉంటే బాగుంటుందో సూచించారు.
ఆ తర్వాత మార్గరేట్ కజిన్స్ తన విద్యార్థినుల సహాయంతో ప్రతి పదానికి అర్థం తెలుసుకుంటూ దానికి ట్యూన్ కట్టారు. ఆ తర్వాత ఠాగూర్‌కు తాను కట్టిన స్వరాన్ని వినిపించారు.
కొన్ని చిన్న చిన్న సంగీత పరికరాలతో విద్యార్థులు రాగయుక్తంగా పాడిన జనగణమన గీతాన్ని విన్న ఠాగూర్ ఆమెను ఎంతగానో అభినందించారు.
అలా బెంగాల్‌లో పుట్టిన జనగణమన గీతం మదనపల్లెలో స్వరబద్ధమైంది.
ఆ తర్వాత 1922లో మార్గరేట్ కజిన్స్ మొట్టమొదటి మహిళా మేజిస్ట్రేట్‌గా పనిచేశారు. 1927లో స్థాపించిన అఖిల భారత మహిళా సదస్సుకు ఆమె సహవ్యవస్థాపకురాలు. 1936 వరకు ఆమె దాని అధ్యక్షురాలిగా పని చేశారు.
అయితే విషయం ఇక్కడితో ఆగిపోలేదు. రవీంద్రనాథ్ ఠాగూర్ మదనపల్లెలోనే జనగణమన ఆంగ్లానువాదాన్ని కూడా చేశారు. మదనపల్లెలో ఉన్న సమయంలోనే ఒక ఉదయాన థియోసాఫికల్ కాలేజీ ప్రాంగణంలోని ఓ గుల్‌మొహర్ చెట్టుకింద కూర్చుని ఠాగూర్ జనగణమనను ఇంగ్లిష్‌లోకి అనువదించారు.
ఆ తర్వాత దానిని తన అందమైన చేతిరాతతో రాయడమే కాకుండా, కింది భాగంలో దాని పేరు 'మార్నింగ్ సాంగ్ ఆఫ్ ఇండియా' అని రాశారు. దాని కింద ఫిబ్రవరి 28, 1919 అని రాసి, సంతకం చేసి, మార్గరేట్ కజిన్స్‌కు బహుమానంగా ఇచ్చారు.
తర్వాత కాలంలో ఆ కాలేజీకి ఆర్థిక సమస్యలు ఎదురైనప్పుడు ఆ ప్రతిని విక్రయించగా, ఒక అమెరికాకు చెందిన కళాభిమాని దానిని కొనుగోలు చేశారు. దాని కాపీ ఇప్పటికీ మదనపల్లె థియోసాఫికల్ కాలేజీలో ఉందని ఆ కాలేజీ ప్రిన్సిపాల్ డాక్టర్ మల్లికార్జున రావు తెలిపారు.
మదనపల్లె కాలేజీ వదలివెళ్లే ముందు ఠాగూర్ దానిని 'దక్షిణ భారతదేశపు శాంతినికేతన్' అని కీర్తించారు.
ఆ తర్వాత జనగణమనను జాతీయ గీతంగా ప్రకటించాలని జేమ్స్ హెన్రీ కజిన్స్ చాలా తీవ్రంగా ప్రయత్నించారు.
భారతదేశం 1950 జనవరి 26న గణతంత్ర దేశంగా మారాక దానిని జాతీయ గీతంగా ప్రకటించారు.
- సాహిత్యంలో నోబెల్ బహుమతి పొందిన ఏకైక ఆసియా వాసి రవీంద్రనాథ్ ఠాగూర్. ఆ అవార్డు పొందిన తొలి యూరప్ బయటి వ్యక్తి కూడా ఆయనే. 20వ శతాబ్దంలో భారతదేశం అందించిన గొప్ప కవి, దార్శనికుడు అని ఆయన్ను అభివర్ణిస్తుంటారు.
- సాహిత్య రంగంలోనే కాకుండా సామాజిక, ఆధ్యాత్మిక, రాజకీయ, శాస్త్రీయ రంగాల్లో పశ్చిమ బెంగాల్‌పైన, బెంగాల్ పునరుజ్జీవనంపైన ఠాగూర్ కుటుంబం తనదైన ముద్ర వేసింది.
- 1901వ సంవత్సరంలో ఠాగూర్ శాంతినికేతన్ విద్యాలయాన్ని ప్రారంభించారు. అత్యంత ప్రాచీనమైన తపోవన విద్యావిధానాన్ని ఆయన ప్రోత్సహించారు. గురుశిష్యులు ప్రకృతికి దగ్గరగా ఉండే, ఎలాంటి గోడలు లేని విద్యావిధానమే మేలని భావించారు. ఇక్కడ సాహిత్యం, కళలతో పాటు తర్వాత సైన్స్‌ను కూడా బోధించేవారు.
- శాంతి నికేతన్‌కు అవసరమైన నిధుల కోసం ఆయన విదేశాల్లో ప్రసంగాలు చేసి, విరాళాలు స్వీకరించేవారు.
- బ్రిటిష్ ప్రభుత్వం ఠాగూర్‌ను 1915 జూన్ 3వ తేదీన నైట్‌హుడ్ పురస్కారంతో సత్కరించింది. అయితే, 1919లో జలియన్‌వాలా బాగ్ మారణకాండ నేపథ్యంలో బ్రిటిష్ వైఖరికి నిరసనగా, అప్పటికే భారీ స్థాయిలో ఆందోళన చేస్తున్న భారతీయులకు మద్దతుగా ఈ బిరుదును వెనక్కు ఇచ్చేస్తున్నట్లు ఠాగూర్ ప్రకటించారు.
ఇవి కూడా చదవండి:
- యాపిల్: 12 ఏళ్ల పాటు నష్టాలు చూసిన ఈ కంపెనీ నేడు ప్రపంచంలో నం.1
- ప్రొఫెసర్ జయశంకర్: 'శనివారం ఉపవాసాన్ని, తెలంగాణవాదాన్ని విడిచిపెట్టలేదు'
- ఆర్టికల్ 35-A: కశ్మీర్ అమ్మాయిలు ఇతర రాష్ర్టాల వారిని పెళ్లాడితే హక్కులు కోల్పోతారు, ఎందుకిలా?
- ప్రపంచంలో అత్యంత రొమాంటిక్ పోస్ట్బాక్సు
- హిందూమతం అంటే ఏమిటి? చరిత్ర ఏం చెప్తోంది?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)