You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
మహారాష్ట్ర: ‘లలిత్’గా మారిన కానిస్టేబుల్ ‘లలిత’ కథ
''చావాలో, బతకాలో నాకు అర్థమయ్యేది కాదు. అది చాలా భయంకరమైన అనుభవం. నాకు ఊపిరాడనట్లు అనిపించేది. నేను ఎంతో కష్టపడి ఆ పరిస్థితి నుంచి బయటపడ్డాను.''
లింగ మార్పిడి చికిత్స కోసం అనుమతి తీసుకోవడానికి ఎన్నో కష్టాలు పడిన లలిత్ సాల్వే తన మానసిక స్థితి గురించి పై మాటల్లో వివరించారు.
మహారాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఈ 29 ఏళ్ల కానిస్టేబుల్ ఎట్టకేలకు గత నెల 25న లింగ మార్పిడి చికిత్స చేయించుకుని, తన పేరును 'లలిత' నుంచి 'లలిత్'గా మార్చుకున్నారు.
''ఆ సర్జరీ చాలా బాధాకరమైన అనుభవం. కానీ ఒక్కసారి నాకు స్పృహ వచ్చాక, చాలా ఏళ్ల తర్వాత నేను స్వేచ్ఛగా ఊపిరి పీలుస్తున్నట్లు అనిపించింది'' అన్నారు లలిత్.
మహారాష్ట్ర పోలీస్ శాఖలో లలిత్ ఉదంతం ఓ సంచలనం. అందుకే అతను తన స్వస్థలమైన బీడ్ జిల్లాలోని రాజెగావ్‌కు వెళ్లినపుడు, అతని కుటుంబ సభ్యులతో పాటు గ్రామస్తులూ ఎంతో సంతోషించారు.
'లలిత' నుంచి 'లలిత్' వరకు..
నేటి లలిత్ ఒకప్పుడు లలిత అనే బాలికగా పెరిగారు.
చిన్నప్పటి నుంచి లలితకు తన శరీరంలో ఏదో లోపం ఉందనిపించేది. అయితే అదేంటో అర్థం కావడానికి ఆమెకు చాలా ఏళ్లే పట్టింది.
లలిత తల్లిదండ్రులు వ్యవసాయ కూలీలు. ఆమె విద్యాభ్యాసం అంతా బంధువుల ఇంట్లో జరిగింది.
20 ఏళ్ల వయసులో లలిత చదువు పూర్తి చేసి, మహారాష్ట్ర పోలీసు విభాగంలో కానిస్టేబుల్‌గా చేరింది.
ఉద్యోగం రావడంతో ఇక జీవితంలో నిశ్చింతగా జీవించొచ్చు అనుకునే సమయంలో పరిస్థితులు శరవేగంగా మారిపోయాయి.
తన జననాంగాల వద్ద గడ్డలాంటిది ఏర్పడినట్లు గుర్తించి, లలిత డాక్టర్ వద్దకు వెళ్లింది.
అప్పుడు తెలిసింది ఆమెకు తాను స్రీ కాదు, పురుషుడు అని. హార్మోన్ టెస్టులు కూడా ఇదే విషయాన్ని నిర్ధారించాయి.
''అంతవరకు యువతిగా ఉన్న నాకు, హఠాత్తుగా మగాడినని తెలియగానే, ఏం జరుగుతున్నదో నాకు అర్థం కాలేదు'' అంది లలిత.
డాక్టర్లు ఆమె లింగ మార్పిడి చికిత్స చేయించుకోవాలని సూచించారు.
ఆ సమయంలో గందరగోళానికి గురైన లలితకు ఆమె కుటుంబం అండగా నిలిచింది.
2016లో లలిత కొన్ని పరీక్షల కోసం ముంబైలోని జేజే హాస్పిటల్‌కు వెళ్లింది. అయితే వైద్య పరీక్షల కోసం నెల రోజుల సెలవు తీసుకోవాల్సి వచ్చింది. నాటి నుంచి ఆమెకు శాఖాపరమైన సమస్యలు ఎదురయ్యాయి.
నిజానికి అలాంటప్పుడు ఏం చేయాలో పోలీస్ శాఖలోనే స్పష్టత లేదు. ఎందుకంటే అంతకు ముందెన్నడూ వాళ్లకు ఇలాంటి పరిస్థితి ఎదురు కాలేదు.
ఆమెను యువతిగా భావించి కానిస్టేబుల్‌గా తీసుకున్నారు. మరి సర్జరీ అయిన తర్వాత ఆమెకు ఏం పని ఇవ్వాలి?
లలితకు కూడా కుటుంబ పోషణ కోసం ఉద్యోగం అవసరం. అందువల్ల ఆమె ఉద్యోగాన్ని వదులుకోలేదు. దీంతో ఆమె కోర్టును ఆశ్రయించింది. బాంబే హైకోర్టు ఈ విషయాన్ని మహారాష్ట్ర అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్‌కు రెఫర్ చేసింది.
ఈ విషయమంతా మీడియాలో రావడంతో ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవిస్ ఈ విషయంలో కలుగజేసుకున్నారు. గత ఏడాది నవంబర్‌లో ఆయన పోలీస్ శాఖ దీనినొక ప్రత్యేక కేసుగా పరిగణించి, సర్జరీ తర్వాత ఆమెను విధుల్లోకి తీసుకోవాలని సూచించారు.
దీంతో ఎట్టకేలకు లలితకు శాఖాపరమైన ఆమోదం లభించి, ఆమెకు సెలవు దొరికింది. గత నెల 25న సర్జరీ జరిగి - లలిత, లలిత్‌గా పరివర్తన చెందారు.
ఇంకా ఉంది..
ముంబైలోని సెయింట్ జార్జ్ హాస్పిటల్‌లో లలిత్‌కు సర్జరీ చేసిన డాక్టర్ రజత్ కపూర్ సర్జరీకి సంబంధించిన సమాచారాన్ని బీబీసీతో పంచుకున్నారు.
లైంగిక అవయవాలపై అసంతృప్తి కారణంగానే ఆమె లింగ మార్పిడి చికిత్స చేయించుకుందన్న వార్తలను ఆయన ఖండించారు.
''లైంగిక అవయవాలపై అసంతృప్తి ఉంటే మగవాళ్లు ఆడవాళ్లుగా, ఆడవాళ్లు మగవాళ్లుగా మారాలనుకుంటారు. అయితే లలిత్ కేసు అలా కాదు. అతనిలోని బాహ్య జననాంగాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదు. అందువల్ల చిన్నప్పుడు అతణ్ని బాలికగా భావించి, అలాగే పెంచారు'' అని ఆయన వివరించారు.
రాబోయే కాలంలో అతనికి మరిన్ని చికిత్సలు చేయాల్సి ఉంటుందని తెలిపారు.
''రెండో దశలో అతనికి బాహ్య జననాంగాల అమరిక పూర్తి చేస్తాం. ఆ తర్వాత మరో చికిత్స ద్వారా అతనికి మిగతా మగాళ్లలాగా గడ్డం, మీసాలు రావడం ప్రారంభిస్తాయి'' అన్నారు.
నూతన ఆరంభం
సర్జరీ తర్వాత లలిత్ ఇప్పుడు కొత్త ఆత్మవిశ్వాసంతో మళ్లీ సర్వీసులో చేరారు. ఈ పోరాటంలో ఇన్నాళ్లూ తన వెన్నంటి నిలబడిన వారికి అతను కృతజ్ఞతలు తెలిపారు.
''నన్ను ఎగతాళి చేసిన వారు ఉన్నారు. అయితే వాళ్లకన్నా నాకు మద్దతు ఇచ్చిన వాళ్ల సంఖ్య చాలా ఎక్కువ. వాళ్లు నా భావాలను, బాధను అర్థం చేసుకున్నారు'' అని తెలిపారు.
సమాజంలో తనలాంటి వారు ఎదురైనప్పుడు ప్రజలు వాళ్లను అర్థం చేసుకునేందుకు ప్రయత్నించాలని కోరారు.
''సమాజంలో ఇంకా చాలా మంది 'లలిత'లు ఉన్నారు. వాళ్లను చులకనగా చూడకండి. వాళ్లను అర్థం చేసుకోండి. వాళ్లకు సహకరించండి.''
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)