హైదరాబాద్: ఆ మెసేజ్ షేర్ చేస్తున్నారా? అయితే జాగ్రత్త!

    • రచయిత, దీప్తి బత్తిని
    • హోదా, బీబీసీ ప్రతినిధి

నకిలీ వాట్సాప్ సందేశాలు సృష్టించిన భయాలు తెలుగు రాష్ట్రాల్లో ఇంకా కనిపిస్తున్నాయి. తాజాగా హైదరాబాద్‌లో చోటుచేసుకున్న ఘటనలే అందుకు ఉదాహరణ.

ఆదివారం హైదరాబాద్‌లోని చాంద్రాయణగుట్ట ప్రాంతంలో ఒక ట్రాన్స్‌జెండర్‌ని కొందరు వ్యక్తులు కొట్టి చంపారు. మంగళవారం పహాడీషరీఫ్‌లో కిడ్నాపర్లుగా అనుమానించి ముగ్గురు మహిళలపై దాడి చేశారు. పోలీసులు జోక్యం చేసుకోవడంతో వారిని విడిచిపెట్టారు.

కిడ్నాపర్లు తిరుగుతున్నారంటూ వ్యాప్తి చెందుతున్న సందేశాలను నమ్మవద్దని, అవన్నీ నకిలీవని పోలీసులు సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అయినా, దాడులు ఆగట్లేదు.

తెలంగాణలోని రాచకొండ పోలీసు కమిషనరేట్ పరిధిలో ఇలాంటి ఘటనలు ఎక్కువగా జరిగాయి.

ఇక్కడ ఇప్పటివరకు వేరువేరు ఘటనల్లో 30 మందికి పైగా అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో ముగ్గురు మైనర్లు కూడా ఉన్నారు.

"వాళ్లు చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకున్నందుకు అరెస్టు చేశాం. నకిలీ సందేశాలను ఇతరులకు ఫార్వర్డ్ చేసినందుకు ఇద్దరిని అరెస్టు చేశాం. ఆరుగురికి నోటీసులు పంపాం. తప్పుడు సమాచారాన్ని పుట్టించిన వారిని, దాన్ని వ్యాప్తి చేసిన వారిని ఐటీ యాక్ట్ కింద అరెస్టు చేశాం. ప్రస్తుతం ప్రజల్లో భయం పోగొట్టాలంటే వదంతులు విస్తరించకుండా ఆపటం ముఖ్యం" అని రాచకొండ కమిషనర్ మహేష్ భగవత్ తెలిపారు.

సాంస్కృతిక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో అవగాహన పెంచే ప్రయత్నం చేస్తున్నామని ఆయన వెల్లడించారు.

ఇప్పటివరకు జరిగిన ఘటనల్లో బాధితుల్లో మతిస్థిమితం లేని, యాచకుల సంఖ్యే ఎక్కువగా ఉంది. దాంతో రోడ్లపై ఉంటున్న అలాంటి వారిని పోలీసులు గుర్తించి ప్రభుత్వ అనాథ ఆశ్రమాలకు తరిలిస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్‌లోని రాజమహేంద్రవరం(రాజమండ్రి)లో పోలీసులు దాదాపు ౩౦౦ మంది యాచకులను ఓ స్వచ్ఛంద సంస్థ నడుపుతున్న వృద్ధాశ్రమంలో చేర్చారు.

"బిచ్చగాళ్లను కిడ్నాపర్లుగా భావించి దాడులు జరుగుతున్న నేపథ్యంలో ఇలా చేస్తున్నాం" అని రాజమహేంద్రవరం అర్బన్ సూపరింటెండెంట్ బి. రాజకుమారి తెలిపారు.

తెలంగాణలోనూ అలాంటి వారిని ఆశ్రమాలకు తరలిస్తున్నామని పోలీసులు తెలిపారు.

విచారణ ఎంతవరకు వచ్చింది?

ప్రజల్లో భయాందోళనలకు కారణమైన ఆ నకిలీ మెసేజ్‌లు ఎక్కడి నుంచి వచ్చాయి? వాటిని ఎవరు పుట్టించారు? అన్న కోణంలో తెలంగాణ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసి ఆ సందేశాల మూలాలను వెతికే పనిలో ఉన్నారు.

హైదరాబాద్ నగర కమిషనర్ అంజనీ కుమార్ మాట్లాడుతూ.. "దర్యాప్తు జరుగుతోంది. ఆ వదంతులను ఎవరు పుట్టించారో త్వరలోనే బయట పెడతాం" అని తెలిపారు.

అయితే, ప్రస్తుతం పోలీసులకు కొన్ని సాంకేతిక ఇబ్బందులు ఎదురవుతున్నాయి.

ఆ వదంతులు ఎక్కువగా వాట్సాప్‌ ద్వారానే వ్యాప్తి చెందాయని, కానీ అందుకు సంబంధించిన వివరాలు ఇచ్చేందుకు వాట్సాప్ సానుకూలంగా లేదని ఓ ఉన్నతాధికారి తెలిపారు.

"పోలీసులు ఎప్పుడు అడిగినా.. తాము డేటా స్టోర్ చేయడంలేదని వాట్సాప్ చెబుతోంది. దీని వల్ల కొంత ఇబ్బంది అయితే ఉంది" అని ఆ అధికారి తెలిపారు.

ఇలాంటి కేసుల దర్యాప్తు సమయంలో వివరాలను వాట్సాప్ ఇవ్వకపోవడం సమస్యే అని ఫ్యాక్ట్‌లీ సంస్థ స్థాపకుడు రాకేష్ రెడ్డి దుబ్బు అన్నారు.

"వినియోగదారులకు ప్రైవసీ అవసరమే. కానీ, చట్టాన్ని అమలు చేసే సంస్థలకు అవసరమైనప్పుడు వాట్సాప్ వంటి మాధ్యమాలు ఆ సమాచారాన్ని అందించేలా ఉండాలి. ప్రభుత్వాలు కూడా అందుకు తగినట్టుగా విధానాలను తీసుకురావాలి. నకిలీ వార్తలు అన్నది దేశంలో పెద్ద సమస్యగా మారింది. దాన్ని అరికట్టేందుకు సోషల్ మీడియా వేదికలు కూడా కృషి చేయట్లేదు" అని రాకేష్ రెడ్డి అన్నారు.

పోలీసులు మాత్రం ఈ నకిలీ సందేశాలు సృష్టించేవారిని కచ్చితంగా పట్టుకుంటామని అంటున్నారు.

సంచలనాల కోసమే ఇదంతా..

"వాట్సాప్‌ని సమాచార బదిలీతో పాటు, ఆహ్లాదం కోసం వాడుకునేవారు పెరిగిపోయారు. కొందరు ఇలాంటి మాధ్యమాలను సంచలనాల(సెన్సేషనలిజం) కోసం వాడటం మూలాన ఇలాంటి సమస్యలు వస్తున్నాయి" అని మనస్తత్వ వేత్త డా. వసుప్రద కార్తీక్ అభిప్రాయపడ్డారు.

"సంచలనాలు సృష్టించి ఒక 'హీరో'గా గుర్తిపు పొందాలన్న ఆలోచన ఒకటి. రెండోది, వచ్చిన సందేశం సరైందా, కాదా..? అని చూసుకోకుండా ఇతరులకు ఫార్వర్డ్ చేయటం ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. ఇటువంటి మెసేజ్‌లకు ప్రజలు ఆవేశంగా స్పందిస్తారు. ఆ బలహీనతను ఆసరాగా చేసుకుని, వదంతులు సృష్టిస్తున్న వారు వాట్పాస్‌ను ఒక ఆయుధంగా మార్చి ప్రజల భావోద్వేగాలతో ఆడుకునే ప్రయత్నం చేస్తున్నారు. మనం వాట్సాప్‌లో వచ్చే మంచి సందేశాల కంటే.. చేడు సందేశాలకే ఎక్కువ స్పందిస్తాం. ఎందుకంటే అప్పుడు భయం, అభద్రత వంటివి పుడతాయి" అని వివరించారు డా. వసుప్రదా కార్తీక్.

దీన్ని కేవలం సోషల్ మీడియా సమస్యగా కాకుండా.. సామజిక సమస్యగా చూడాలి అంటున్నారు హైదరాబాద్ విశ్వవిద్యాలంలో సోషియాలజీ విభాగం అధిపతి, సామాజికవేత్త డా. ఎన్. పూర్ణేంద్ర ప్రసాద్.

"యువతకు ఉద్యోగ అవకాశాలు లేక, ఖాళీ సమయం ఎక్కువగా ఉండటం, అలాగే ఉపాధి కోసం కుటుంబాలను వదిలి దూర ప్రాంతాలకు వెళ్లి ఉండే వారు సోషల్ మీడియాకు ఎక్కువగా అలవాటు పడుతున్నారు. అవి కూడా ఈ సమస్య వెనుక ఉన్న కారణాలుగా చెప్పుకోవచ్చు" అని ఆయన అభిప్రాయపడ్డారు.

డా. వసుప్రదా కార్తీక్ అభిప్రాయపడినట్టు ఎవరైనా.. తమకు వాట్సాప్ లేదా ఇతర సోషల్ మీడియా వేదికలపై ఏదైనా సంచలనాత్మక సందేశం కనిపిస్తే ఆవేశంగా స్పందించకూడదు. ముందు అందులో వాస్తవమెంత అన్న కోణంలో ఆలోచించాల్సిన ఆవశ్యకత ఉంది.

ఇవి కూడా చదవండి:

(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్‌, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)