'లోన్ కోసం బ్యాంకుకెళ్తే.. ఆడపిల్లవు నీకెందుకు బిజినెస్ అన్నారు'
ఆమె దళిత యువతి. సొంతంగా వ్యాపారం చేయాలని అనుకున్నారు. చేతిలో సరిపడా డబ్బులు లేవు. బ్యాంకుకు వెళ్తే మేనేజరు అసలు లోపలకే రానివ్వలేదు. పెళ్లి చేసుకోక బిజినెస్ ఎందుకంటూ విమర్శించారు. కానీ ఆమె అనుకున్నది సాధించారు.
ఏడాదికి రూ.కోటిన్నర టర్నోవర్ కలిగిన సంస్థకు అధినేతగా మారారు.
హైదరాబాద్ కేంద్రంగా గతేడాది మార్చిలో నిపుణ ఇన్సిట్యూట్ ఫర్ స్కిల్స్ అండ్ ఎంటర్‌ప్రెనర్‌షిప్(ఎన్‌ఐఎస్‌ఈ) పేరుతో ఒక సంస్థని ఏర్పాటు చేశారు. స్టార్టప్‌లకు చేయూతనివ్వడం, నిరుద్యోగులకు నైపుణ్య శిక్షణ ఇవ్వడం లక్ష్యంగా ఇది పనిచేస్తోంది.
ఇక్కడ మరికొందరు దళిత మహిళలకు ఉపాధి చూపారు.
ఆమె పేరే ప్రవల్లిక. ఒంగోలుకు చెందిన ఈమె హైదరాబాద్ లో ఉంటున్నారు. తాను ఎదుర్కొన్న కష్టాలను.. తాను విజయం సాధించిన తీరును బీబీసీకి వివరించారు.
ఆ వివరాలు ఆమె మాటల్లోనే..
మా నాన్న ప్రతినెలా ఖర్చుల కోసం రూ.3 వేలు ఇచ్చేవారు. ఎంటెక్ సెకెండ్ ఇయర్‌లో ఉన్నప్పుడే సొంతంగా వ్యాపారం చేయాలనుకున్నాను. కానీ, చేయగలనా లేదా అనే అనుమానం ఉండేది.
ఇతరులకు ఉపాధి ఇవ్వాలని ఉద్దేశంతో బిజినెస్‌లోకి అడుగుపెట్టా.
లోన్ కోసం బ్యాంకుల చుట్టూ తిరిగా.
నాకు అన్ని అర్హతలూ ఉన్నా.. మహిళను, దళితురాలని అయినప్పటికీ ఒక బ్యాంకు మేనేజర్ కనీసం నన్ను తన ఆఫీస్‌లోకి కూడా రానివ్వలేదు.
అమ్మాయి అందులో యంగ్ ఏజ్‌లో ఉందని పిలిచి మాట్లాడాడు తప్పితే టాలెంట్ ఉంది లోన్ ఇవ్వాలని పిలవ లేదు.
మీరు ఆడపిల్లలు, మీరేం బిజినెస్ చేస్తారు. ఇంకో రెండేళ్లలో పెళ్లి చేసుకుంటారు. మీకెందుకు ఇవన్నీ అన్నారు.
పెళ్లి తర్వాత కూడా బిజినెస్ చేయాలనే ఆలోచన ఉంటే రండి అప్పుడు లోన్ ఇస్తా అన్నారు.
మా అమ్మానాన్న చదువుకో లేదు. కానీ, మమ్మల్ని చాలా ఆత్మవిశ్వాసంతో చదివించారు.
కానీ, నేను బిజినెస్ చేస్తా అన్నప్పుడే అమ్మ ఒక మాట చెప్పింది. ‘నువ్వు అమ్మాయివి. బటయకెళ్లితే బతకలేవు. మనం దళితులం. ఈ సమాజం మనల్ని బతకనివ్వదు’ అని చెప్పింది.
ఎన్నో కష్టాలు పడి ఇప్పుడు సంస్థను ముందుకు తీసుకెళ్తున్నాం.
నా మొదటి ప్రాజెక్టు కూడా దళితులకే చేశాను. నేను పుట్టింది ఒంగోలులోని ఒక మారుమూల పల్లెలో.
చదువుకుంటున్నప్పుడు, వ్యాపారంలో నేనెప్పుడూ వివక్షకు గురికాలేదు.
నిజంగా అవసరం ఉన్నవాళ్లకే రిజర్వేషన్లు దక్కాలి.
ప్రవల్లిక సంస్థ నేపథ్యం
ప్రవల్లిక తండ్రి ఒకప్పుడు తాపీ మేస్త్రీగా పనిచేశారు. ఇప్పుడాయన భవన నిర్మాణ రంగంలో ఉన్నారు. ఈమె హైదరాబాద్ కేంద్రంగా గతేడాది మార్చిలో నిపుణ ఇన్సిట్యూట్ ఫర్ స్కిల్స్ అండ్ ఎంటర్‌ప్రెనర్‌షిప్(ఎన్‌ఐఎస్‌ఈ) పేరుతో ఒక సంస్థని ఏర్పాటు చేశారు.
ప్రస్తుతం ప్రవల్లికక సంస్థలో 10 మంది పని చేస్తున్నారు. అందులో 90 శాతం మంది దళితులే.
అయితే, ఆమె వ్యాపార భాగస్వామి మాత్రం ఉన్నత కులస్తులు. కానీ, కంపెనీలోని 80 శాతం వాటా ఆమెదే.
ఇవి కూడా చదవండి:
- బీబీసీ 100 మంది మహిళలు: 4 సమస్యలపై పోరు
- స్త్రీపురుష సమానత్వంపై మనం వియత్నాం నుంచి ఏం పాఠాలు నేర్చుకోవాలి?
- #BBCSpecial: ‘వ్యభిచారంలోకి మమ్మల్నిలా తోసేసినారు..’
- తల్లిపాలకు టెక్నాలజీ అవసరమా?
- ఐర్లాండ్ అబార్షన్ రెఫరెండం: ఆమె ప్రాణాలు కోల్పోయింది.. ఈమె చరిత్ర తిరగరాసింది
- ‘పెట్టుబడి పెట్టమంటే.. నీ వయసెంత? నువ్వెప్పుడు పెళ్లి చేసుకుంటావు? అనడిగారు’
- ‘13 ఏళ్ల వయసులో నన్ను పాతికవేలకు అమ్మేశారు’
- మహిళలూ మెదడును మీ దారికి తెచ్చుకోండి ఇలా..
- మహిళలు మద్యం కొనడానికి వెళ్తే ఏమవుతుంది?
- మహిళా ఉద్యోగులతో కంపెనీలకు మేలేనా?
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)