You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
స్టెర్లైట్ వివాదం: ‘భారతదేశ పేరు చెడగొట్టాలని చూస్తున్నారు వాళ్లు’
స్టెర్లైట్ పరిశ్రమకు సమీపంలో ఉన్న ప్రజల సంరక్షణ తమకు ప్రధానమని వేదాంత పరిశ్రమల ఛైర్మన్ అనిల్ అగర్వాల్ బీబీసీకి చెప్పారు.
తమిళనాడులోని తూత్తుక్కుడి జిల్లాలో స్టెర్లైట్ పరిశ్రమ విస్తరణకు వ్యతిరేకంగా జరిగిన ఆందోళనల్లో పోలీసులు కాల్పులు జరిపారు. దీంతో ఇక్కడ 13 మంది చనిపోయారు.
పరిశ్రమను మూసేయాల్సిందిగా తమిళనాడు కాలుష్య నియంత్రణ మండలి ఆదేశించింది. దీంతో పరిశ్రమకు విద్యుత్తు సరఫరాను ఆపేశారు.
ఈ నేపథ్యంలో స్టెర్లైట్ పరిశ్రమ అధినేత అనిల్ అగర్వాల్‌ను బీబీసీ ఈమెయిల్ ద్వారా సంప్రదించింది.
ప్రజల ఆమోదంతోనే పరిశ్రమలను స్థాపిస్తామని చెప్పిన వేదాంతా ఇప్పుడు తమిళనాడులో ప్రజలు వ్యతిరేకిస్తున్నా ఎందుకు పట్టించకోవడం లేదని బీబీసీ ప్రశ్నించింది.
దీనికి అనిల్ స్పందిస్తూ .. తమ పరిశ్రమల చుట్టూ ఉన్న ప్రజల సంక్షేమమే ప్రధానమన్నారు. దీనికి తూత్తుక్కుడి కూడా మినహాయింపు ఏమీ కాదన్నారు.
"మా పరిశ్రమ ఎక్కడున్నా స్థానిక ప్రజలనూ మాతో కలుపుకొనే తత్వాన్ని అనుసరిస్తున్నాం. పైగా చదువు, జీవనాధారం, పరిశుభ్రత విషయాల్లోనూ మేం పలు కార్యక్రమాలు అమలు చేస్తూ వస్తున్నాం’’ అని అనిల్ అన్నారు.
తూత్తుక్కుడిలో జరిగిన ఆందోళనలు కొందరి ప్రేరేపితమని చెప్పిన అనిల్.. పెట్టుబడులకు మంచి దేశంగా ఉన్న భారత్ పేరును చెడగొట్టాలని చూస్తున్నారని అన్నారు.
"తమిళనాడు ప్రభుత్వ విచారణలో నిజానిజాలు తెలుస్తాయి. అదే సమయంలో తూత్తుక్కుడిలో జరిగిన ప్రాణ నష్టానికి .. తీవ్ర సంతాపం వ్యక్తం చేస్తున్నా" అని చెప్పారు.
పోలీసులు, అధికార యంత్రాంగంపై వేదాంతా తెచ్చిన ఒత్తిడి వల్లే ఈ తుపాకీ కాల్పులు జరిగాయన్న ఆరోపణలపై అనిల్ స్పందిస్తూ.. తాము న్యాయబద్దంగా పరిశ్రమలు నడుపుతున్నామని.. పోలీసులు, అధికార యంత్రాంగంపై ఎలాంటి ఒత్తిడీ చేయలేదని చెప్పారు.
తూత్తుక్కుడి ప్రజలకు ఈ తరుణంలో అవసరమైన ఏ సాయమైనా చేయడానికి సిద్ధమని చెప్పిన అనిల్.. స్టెర్లైట్ పరిశ్రమ కార్మికులు, అక్కడి ప్రజలకు రక్షణ కల్పించడానికి ప్రభుత్వం, అధికారులు చర్యలు తీసుకోవాలని కోరామని తెలిపారు.
తమ వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలుగదని వేదాంతా చెబుతుండగా.. పర్యావరణానికి నష్టం జరిగిందని పేర్కొంటూ రూ.100 కోట్లు జరిమానా విధించారు. ఈ పరిశ్రమ వల్ల ప్రజలకు అనారోగ్యం కూడా వస్తోందని నివేదికలు చెబుతున్నాయి కదా.. అని ప్రశ్నించినపుడు అనిల్.. "పర్యావరణం, ఆరోగ్యం, రక్షణ అంశాల్లో మేం అంతర్జాతీయ ప్రమాణాలు పాటిస్తున్నాం. వేర్వేరు మంత్రిత్వశాఖలు, అధికారులు పేర్కొన్న అన్ని నిబంధనలనూ తప్పక అమలు చేస్తున్నాం. ఇది స్టెర్లైట్ పరిశ్రమకూ వర్తిస్తుంది.’’ అని చెప్పారు.
స్టెర్లైట్ వల్ల భూగర్భ జలాలకూ ఎలాంటి ముప్పు లేదని అనిల్ అగర్వాల్ పేర్కొన్నారు.
ఈ పరిశ్రమల వల్ల భూగర్భ జలాలకు ఎలాంటి ప్రమాదం లేదని 2013లో హైకోర్టు స్పష్టంగా చెప్పిందన్నారు.
అలాగే ప్రతి నెలా కాలుష్య నియంత్రణ మండలి చేస్తున్న పరీక్షల్లోనూ ఎలాంటి ముప్పూ కనిపించలేదన్నారు.
ఇవి కూడా చదవండి
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)