You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
కర్ణాటక: ఏ పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేయాలో నిర్ణయించేది ఈయనే!
కర్ణాటక అసెంబ్లీ ఫలితాలు దాదాపుగా స్పష్టం అయ్యాయి. అయితే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే మెజార్టీ సీట్లు ఏ పార్టీకి రాలేదు.
ఈ ఎన్నికల్లో బీజేపీ అధిక స్థానాల్లో విజయం సాధించి, మిగతా పార్టీలకంటే ముందు నిలిచింది. కానీ, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన 112 సీట్లను మాత్రం పొందలేకపోయింది. కాంగ్రెస్ పార్టీ రెండో స్థానంలోనూ, జనతాదళ్ సెక్యులర్ (జేడీఎస్) మూడో స్థానంలోనూ నిలిచాయి.
ఈ నేపథ్యంలో కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ఏర్పాటులో గవర్నర్‌ది కీలక పాత్ర కానుంది.
ప్రభుత్వ ఏర్పాటుకు ఎవరిని ఆహ్వానించాలన్న నిర్ణయం తీసుకునేది గవర్నరే.
జేడీఎస్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తే తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ ప్రకటించింది. ఈ మేరకు ఈ రెండు పార్టీలు గవర్నర్‌తో భేటీ అవుతున్నాయి. మరోవైపు బీజేపీకి అత్యధిక స్థానాలు లభించినందున ఆ పార్టీని కూడా ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించే అవకాశాలు ఉన్నాయని, ప్రభుత్వ ఏర్పాటు తర్వాత అసెంబ్లీలో బలనిరూపణ చేయాలని గవర్నర్ సూచించవచ్చునని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.
ఎవరీ వజుభాయి వాలా?
ప్రస్తుతం కర్ణాటక గవర్నర్‌గా ఉన్నది 80 ఏళ్ల వజుభాయి వాలా.
నరేంద్ర మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ప్రభుత్వంలో వజుభాయి ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసేవారు. నరేంద్ర మోదీ 13 ఏళ్లు గుజరాత్ ముఖ్యమంత్రిగా పనిచేస్తే.. అందులో 9 ఏళ్లు వజుభాయి ఆర్థిక మంత్రిగా విధులు నిర్వర్తించారు.
రాష్ట్ర ఆర్థిక మంత్రిగా ఆయన 18 సార్లు బడ్జెట్‌ను ప్రవేశపెట్టి రికార్డు సృష్టించారు.
గుజరాత్‌లో అధికార మార్పిడి (కేశూభాయి పటేల్ నుంచి నరేంద్ర మోదీకి) జరిగినప్పటికీ, అధికారంలో కొనసాగిన కొద్దిమంది నేతల్లో వజుభాయి ఒకరు.
2001లో నరేంద్ర మోదీ తొలిసారి అసెంబ్లీకి ఎన్నికయ్యేందుకు వజుభాయి తన రాజ్‌కోట్ సీటును వదులుకున్నారు.
రాజ్‌కోట్ ప్రాంతంలోని ఒక వ్యాపార కుటుంబానికి చెందిన వజుభాయి.. పాఠశాల రోజుల నుంచే రాష్ట్రీయ స్వయం సేవక్ (ఆర్ఎస్ఎస్)తో అనుబంధం పెంచుకున్నారు.
26 ఏళ్ల వయసులో జనసంఘ్‌లో చేరి, కొద్ది కాలానికే కేశూభాయి పటేల్‌కు దగ్గరయ్యారు. తదనంతర కాలంలో రాజ్‌కోట్ మేయర్‌గా కూడా పనిచేశారు.
1985లో తొలిసారి ఆయన శాసనసభకు నామినేషన్ దాఖలు చేశారు. రాజ్‌కోట్ నుంచి ఆయన ఏడుసార్లు అసెంబ్లీకి గెలుపొందారు.
ఆరోపణలు.. వివాదాలు
వజుభాయిపై పలు ఆరోపణలు కూడా ఉండేవి. రాజ్‌కోట్‌లోని బిల్డర్లతో కలసి ఆయన పనిచేసేవారని, అలా ఆయన రియల్ ఎస్టేట్ వ్యాపారం పెరిగిందని ఆరోపణలున్నాయి. కానీ, ఈ ఆరోపణలేవీ ఆయనకు వ్యక్తిగతంగా నష్టం చేకూర్చలేదు.
తమాషా ప్రసంగాలతో ప్రజల్ని ఆకట్టుకుంటారని ఆయనకు పేరుంది.
తన ప్రకటనలతో ఆయన కొన్ని వివాదాలను కూడా మూటకట్టుకున్నారు.
మైసూరులో జరిగిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. మహిళలు ఫ్యాషన్‌కు దూరంగా ఉండాలని, కాలేజీలు ఉన్నది ఫ్యాషన్ ప్రదర్శనలకు కాదని అన్నారు. వజుభాయి చేసిన ఈ వ్యాఖ్యలపై అప్పట్లో దుమారం చెలరేగింది.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)