You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
సోషల్: ‘కర్ణాటక ఎన్నికల్లో ఓటమికి కాంగ్రెస్ నాయకత్వ లోపమే కారణం’
కర్ణాటక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారం కోల్పోయింది. బీజేపీకి అత్యధిక స్థానాలు లభించాయి. అయితే, ఏ పార్టీకీ స్పష్టమైన మెజార్టీ రాలేదు. దీంతో, జేడీఎస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే తాము మద్దతు ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది.
ఈ మేరకు జేడీఎస్, కాంగ్రెస్ నాయకులు మంగళవారం సాయంత్రం గవర్నర్‌ను కలవాలని నిర్ణయించుకున్నారు.
ఈ నేపథ్యంలో కర్ణాటకలో కాంగ్రెస్ ఓటమి ఆ పార్టీ వైఫల్యమా? లేక కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు రాహుల్ గాంధీ నాయకత్వ లోపమా? అని బీబీసీ తెలుగు ఫేస్‌బుక్ పేజీలో పాఠకుల అభిప్రాయాలను కోరింది. దీనికి పలువురు పాఠకులు ఇలా స్పందించారు.
బీజేపీపై ఉన్న వ్యతిరేకతను గ్రహించి ఇప్పటికైనా ఒక మంచి, సమర్థవంతమైన నాయకత్వాన్ని కాంగ్రెస్ పార్టీ ప్రకటించాలని, అలా చేస్తే ఆ పార్టీకి తిరుగుండదని శివకుమార్ గుప్తా ఉడుత అనే ఫేస్‌బుక్ యూజర్ అన్నారు.
కాంగ్రెస్‌లో ఛరిష్మా ఉన్న నాయకులు లేకపోవడం, ఎన్నికల ఎత్తుగడలు వేసే సరైన నాయకులు లేకపోవడం, ప్రజల్లో విశ్వాసం కలిగించలేకపోవడంతోనే ఓటమికి గురైందని నరేంద్ర బాబు ఆడూరు చెప్పారు.
కాంగ్రెస్ వైఫల్యం, రాహుల్ నాయకత్వం రెండూ కారణమేనని మహేశ్ పిట్టల తెలిపారు.
సిద్ధరామయ్య ఫర్వాలేదని, రాహుల్ గాంధీ ఐరన్ లెగ్ అని షేక్ రహీమ్ అనే యూజర్ చెప్పగా.. కాంగ్రెస్ కార్యకర్తలు ఒక ప్రణాళికతో తగిన విధంగా పనిచేయలేదని సదాశివుడు పాటిల్ బూథ్కూరి పేర్కొన్నారు.
ఆంధ్రావాళ్ల శాపం వల్లనే కాంగ్రెస్ ఈ పరిస్థితిలో ఉందని కిరణ్ శివాడి అనే యూజర్ అభిప్రాయపడ్డారు.
అయితే, ఎవరు మంచి చేస్తున్నారనేది ప్రజలు గమనిస్తారని, అలా చేస్తున్న వారికే ఓటు వేస్తారని నరసింహం కవి అన్నారు.
ప్రజలు డబ్బుకే ప్రాధాన్యం ఇస్తున్నారని నాగ చౌదరి దావులూరి అనే యూజర్ అభిప్రాయ పడగా.. ఈ అభిప్రాయాన్ని రవి కడారి అనే మరొక యూజర్ సమర్థించారు.
లింగాయత్‌ల బిల్లుకు ఆమోదం తెలపాల్సింది కేంద్ర ప్రభుత్వం కాబట్టి వారంతా బీజేపీకి ఓటు వేశారని, ముంబై కర్ణాటక ప్రాంతం బీజేపీకి బాగా కలసివచ్చిందని కిషోర్ వేము అనే యూజర్ తన అభిప్రాయం చెప్పారు.
మరొక యూజర్ గని ఎన్ స్పందిస్తూ.. బీజేపీ, మోదీ గొప్పతనం, పనితనం ఇప్పుడు కూడా ఒప్పుకోకపోతే ఎలా? అని ప్రశ్నించారు.
‘కాంగ్రెస్‌పై వ్యతిరేకతే కారణం’
కర్ణాటకలో అధికార కాంగ్రెస్ పార్టీ అనుసరించిన ఎన్నికల వ్యూహాలు బీజేపీ, జేడీఎస్‌లకు కలసివచ్చాయని ఎన్నికల విశ్లేషకుడు పెంటపాటి పుల్లారావు అన్నారు. ఎన్నికల ఫలితాలపై బీబీసీ తెలుగుతో ఆయన మాట్లాడుతూ.. కొన్ని వర్గాలకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా కాంగ్రెస్ వ్యవహరించిందని, దీనివల్ల మిగతా వర్గాలన్నీ ఏకమై కాంగ్రెస్‌కు దూరమయ్యాయన్నారు. అదేవిధంగా.. ప్రజలంతా సంతృప్తితో ఉన్నారని, ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటూ చేసిన ప్రచారం కూడా అసంతృప్తికి కారణమైందన్నారు.
రాహుల్ గాంధీ కూడా అత్యధికంగా ఎన్నికల ప్రచారంలో తిరిగారని, ఒకవేళ పార్టీ గెలిస్తే ఈ ఘనతను ఆయనకే కట్టబెట్టేవారు కాబట్టి.. ఓడిపోయింది కనుక ఈ ఓటమికి కూడా ఆయనే బాధ్యుడని పుల్లారావు అభిప్రాయపడ్డారు.
సిద్ధరామయ్య ఓడిపోయినప్పటికీ ఆయన్ను ఎవ్వరూ పట్టించుకోరని, రాహుల్ గాంధీ వైఫల్యం మాత్రం మిగతా రాష్ట్రాల ఎన్నికల్లోనూ, 2019 సార్వత్రిక ఎన్నికల్లోనూ ప్రభావం చూపే అవకాశాలున్నాయని తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)