You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
‘700 ఏళ్ల పిల్లలమర్రి’ చెట్టుకు 'సెలైన్' బాటిళ్లతో చికిత్స
- రచయిత, విజయ భాస్కర్
- హోదా, బీబీసీ కోసం
తెలంగాణలోని మహబూబ్‌నగర్ శివారులో ఉండే పిల్లలమర్రి ప్రధాన శాఖ ఒకటి నిరుడు నేలమట్టం కావడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది.
వందల ఏళ్ల చరిత్ర ఉన్న పిల్లలమర్రిని కాపాడుకొనేందుకు సెలైన్ సీసాలు వాడుతూ చికిత్స అందిస్తున్నారు నిపుణులు.
మూడెకరాల విస్తీర్ణంలో విస్తరించిన ఈ మహావృక్షానికి సుమారు 700 ఏళ్లు ఉంటాయని స్థానికులు చెబుతున్నారు. చెదలు పట్టడంతో ఇది దెబ్బతింటోంది. ఊడలు, శాఖలు విరిగిపోతున్నాయి.
దీంతో, చెట్టుకు చికిత్స అందించేందుకు వృక్ష సంరక్షణ నిపుణులు వివిధ చర్యలు చేపడుతున్నారు.
నిపుణులు 'క్లోరోఫైరఫస్' అనే చీడనివారణ మందును పిచికారీ చేయించడంతోపాటు, దానిని సెలైన్ బాటిళ్లలో నింపి చెట్టు కాండం ద్వారా వివిధ శాఖలకు అందేలా చూస్తున్నారు. చెట్టు స్థితిపై నిరంతర పర్యవేక్షణ పెట్టారు. ఈ చర్యలతో పిల్లలమర్రి క్రమంగా కోలుకుంటోంది.
చెట్టుకు సారవంతమైన మట్టి, ఎరువు అందిస్తూ, క్రిమసంహారక మందులు పోస్తూ ఆరోగ్యాన్ని సంతరించుకొనేలా ప్రయత్నాలు చేస్తున్నారు.
నేల వాలుతున్న ఊడలను చీడ సోకకుండా నేరుగా భూమిలోకి పాకే విధంగా వృక్ష సంరక్షణ సిబ్బంది పైపులు ఏర్పాటు చేశారు. చెట్టు మొదళ్లు కూలకుండా సిబ్బంది సిమెంటు దిమ్మెలు ఏర్పాటు చేశారు.
సందర్శకులకు అనుమతి లేదు
పిల్లలమర్రి ప్రధాన శాఖ ఒకటి డిసెంబరులో నేలమట్టమైంది. మర్రిచెట్టును కాపాడే ప్రయత్నాల్లో భాగంగా మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రొనాల్డ్ రాస్ దీనిని పర్యాటకశాఖ పరిధి నుంచి తప్పించి అటవీ శాఖ పరిధిలోకి మార్చారు.
నిత్యం వందల మంది పర్యాటకులు ఈ మర్రిచెట్టును దగ్గర నుంచి చూసేందుకు వచ్చేవారు. నాలుగు నెలలుగా సందర్శకులను చెట్టు దగ్గరకు అనుమతించడం లేదు.
మరో రెండు నెలలు ఇదే చికిత్స
ఈ మహావృక్షానికి పూర్వ వైభవం తెచ్చేందుకు అన్ని చర్యలు తీసుకొంటున్నామని పిల్లలమర్రి పర్యవేక్షణాధికారి పాండురంగారావు తెలిపారు. సంరక్షణ చర్యలతో ఫలితాలు కనిపిస్తున్నాయన్నారు.
అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ మాజీ ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్ మనోరంజన్ భాంజా సలహా మేరకు ఈ చికిత్స అందిస్తున్నామని ఆయన చెప్పారు. ఇంకో రెండు నెలలపాటు ప్రస్తుత చికిత్సను కొనసాగించే అవకాశముందని తెలిపారు.
లోగడ సందర్శకుల్లో కొందరు చెట్టుపైకి ఎక్కి రాళ్లు, ఇనుప ముక్కలతో కొమ్మలపై పేర్లు రాసేవాళ్లని, దీనివల్ల కూడా చెట్టుకు నష్టం వాటిల్లిందని పాండురంగారావు తెలిపారు.
ఇవి కూడా చదవండి:
(బీబీసీ తెలుగును ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విటర్‌లో ఫాలో అవ్వండి. యూట్యూబ్‌లో సబ్‌స్క్రైబ్ చేయండి.)